Read more!

English | Telugu

సినిమా పేరు:సినిమా చూపిస్త మావ
బ్యానర్:ఆర్ డి బి ప్రొడక్షన్స్
Rating:2.75
విడుదలయిన తేది:Aug 14, 2015

ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సింది వినోద‌మే! అది ఎంత ఇస్తున్నార‌న్న‌ది త‌ప్ప‌, ఎలా ఇస్తున్నార‌న్న‌ది వాళ్ల‌కు అన‌వ‌స‌రం. ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకొంటే.. సినిమాలు చాలా వ‌ర‌కూ గ‌ట్టెక్కుతాయి. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమా! ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని న‌మ్ముకొన్న ఏ సినిమా ఫెయిల్ అయిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదు. `సినిమా చూపిస్త మావ‌` సినిమా కూడా ఇదే పాయింట్ ఫాలో అయిపోయింది. ఈ సినిమా `బొమ్మ‌రిల్లు`కి రివ‌ర్స్ స్ట్రాట‌జీ. అయినా స‌రే మీకు న‌చ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో `కావ‌ల్సినంత` కామెడీ ఉంది. ఈ సినిమా నిండా స్నూఫ్‌లే. అయినా మీకు న‌చ్చుతుంది. ఎందుకంటే ఆ స్నూఫ్ ల టార్గెట్ మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డ‌మే. అందుకే రొటీన్ స్టోరీని కామెడీతో లాగించేసిన సేఫ్ జోన్‌లో ప‌డిపోయింది... ఈ సినిమా. మ‌రింత‌కీ ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎవ‌రెలా చేశారు? చూసేద్దాం.. రండి.

STORY:

సోమ‌నాథ్ ఛ‌ట‌ర్జీ (రావుర‌మేష్‌) క్వాలిటీ కోసం ప్రాణంపెట్టే మ‌నిషి. తాను పీల్చే గాలి నుంచి ప్ర‌తీదీ క్వాలిటీతో ఉండాల‌నుకొంటాడు. త‌న కూతురు ప‌రిణిత (అవికా గోర్‌)ని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచుతాడు. మ‌రోవైపు క‌త్తి (రాజ్ త‌రుణ్‌) ఇంట‌ర్‌లో అన్ని స‌బ్జెక్టులూ ఫెయిల్ అయిన ఓ ఆవారా. ప‌నీ పాటా లేకుండా బేవార్స్ గా తిరుగుతుంటాడు. పరిణీత‌ని తొలి చూపులోనే ప్రేమించేసి, త‌న కోసం ఆమె చ‌దివే కాలేజీలో చేర‌తాడు (ఇంట‌ర్ ఫెయిల్ అయిన‌వాడు కాలేజీకి ఎలా వెళ్లాడ‌ని అడ‌క్కండి). నాన్న క్వాలిటీ, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌రిణిత‌కు  దూర‌మైన చిన్న చిన్న ఆనందాల్ని రుచి చూపిస్తాడు. మెల్లాగా ఆమె హృద‌యంలో స్థానం సంపాదిస్తాడు. ఈ విష‌యం తెలుసుకొన్న సోమ‌నాథ్ ఛ‌ట‌ర్జీ రెచ్చిపోతాడు. క‌త్తినీ, వాళ్ల నాన్న‌నీ అవ‌మానిస్తాడు. కానీ.. త‌న కూతురు కూడా క‌త్తిని ప్రేమిస్తుంది అని తెలుసుకొని క‌త్తికి ఓ ప‌రీక్ష పెడ‌తాడు. ఆ ప‌రీక్ష ఏమిటి?  అందులో క‌త్తి గెలిచాడా, లేదా? ఈ మామ అల్లుళ్ల స‌వాల్ సాగిన విధంబెట్టిది అనేదే సినిమా చూపిస్త మావ స్టోరీ.


ఎనాలసిస్ :

బొమ్మ‌రిల్లు సినిమాని కాస్త రివ‌ర్స్ చేసి ఈ క‌థ రాసుకొన్నారేమో అనిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్ హీరో ఇంటికి వెళ్తుంది. ఇక్క‌డ హీరో... హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. ఆ హీరోకి ఓ ప‌రీక్ష‌... అందులో అత‌ను గెలిచిన విధానం.. ఈ సినిమా స్టోరీ. క్ర‌మ‌శిక్ష‌ణ‌, క్వాలిటీ పేరుతో విలువైన ఆనందాల్ని మిస్ చేసుకోకూడ‌దు అనే పాయింట్‌ని చెప్పాల‌నుకొన్నాడు ద‌ర్శ‌కుడు. అయితే అది త‌ప్ప‌.. అన్నీ చెప్పాడు. తండ్రి వ‌ల్ల కూతురు ఏం దూర‌మైంది? అస‌లు తండ్రీ కూతుర్ల అనుబంధం ఏమిటి? అనే పాయింట్‌ని స‌రిగా రాసుకోలేదు. అయితేనేం.. సినిమాలోని లోపాల‌న్నీ కామెడీ క‌వ‌ర్ చేసేసింది. సినిమా ముందు నుంచీ ఓ జాలీ మూడ్‌తోనే ఉంటుంది. అదే మూడ్ చివ‌రి వ‌ర‌కూ కంటిన్యూ అయ్యింది. క‌థ ఏం చెబుతున్నామ‌న్న‌ది ప‌క్క‌న పెట్టిన ద‌ర్శ‌కుడు ఎలా చెబుతున్నాం? అనేదానిపై ఫోక‌స్ పెట్టి మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టాడు. స‌ర‌దా స‌న్నివేశాల‌తో టేకాఫ్ ఇచ్చుకొని అదే స్పీడ్ కంటిన్యూ చేశాడు. ద్రౌప‌తి వ‌స్త్రాభ‌ర‌ణం సీన్ బాగా పండింది. భోజ‌నాల ద‌గ్గ‌ర సీన్‌,మందుకొట్టే సీన్‌న‌వ్వులు పూయించాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌న పంచ్‌లు పండాయి. దాంతో.. విసుగు లేకుండా కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొరికేసింది. ఇంట‌ర్ పాస‌వ్వ‌ని వాడు కాలేజీలోకి ఎలా వెళ్లగ‌లిగాడు లాంటి లాజిక్‌లు తీయ‌కుండా, అస‌లు ఆ టైమే ఇవ్వ‌కుండా ప్రేక్ష‌కుల‌కు వినోదాల ముసుగు వేసేశాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ క‌థ‌ని మ‌నం జీర్ణించుకోలేం. ఓ ఆవారాగాడికి స‌ర‌స్వ‌తీ దేవిలాంటి అమ్మాయిని క‌ట్ట‌బెట్ట‌డం ఏ తండ్రికి న‌చ్చ‌తుంది చెప్పండి? సినిమా కాబ‌ట్టి ఎడ్జ‌స్ట్ అయిపోవాల్సిందే. ఆ పాయింట్‌ని ప‌క్క‌న పెడితే సినిమా సాగిన విధానం ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఎమెష‌న్ సీన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చి, సినిమాలో సీరియ‌స్ నెస్ తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. చివ‌రికి హీరోదే గెలుపు అనుకోండి. ఆ సంగ‌తి ప్రేక్ష‌కుడికి ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లోనే తెలిసిపోయినా.... ఆ ఆస‌క్తి మాత్రం స‌డ‌ల‌దు.

ఉయ్యాల జంపాల‌తో ఆక‌ట్టుకొన్నారు రాజ్ త‌రుణ్‌, అవికాగోర్‌. ఈ సినిమాలోనూ అదే స్థాయిలో త‌న ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టారు. రాజ్ త‌రుణ్ ఈ సినిమాలో మ‌రింత ఈజ్‌గా న‌టించాడు. ర‌వితేజ‌ని ఇమిటేట్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నా.. క‌త్తి క్యారెక్ట‌రే ఆ టైపు అని స‌ర్దుకుపోవాలి. మందుకొట్టే సీన్‌లో రాజ్ త‌రుణ్ హావ‌భావాలు బాగున్నాయి. ఎంట‌ర్‌టైన్ మెంట్ పండించే సీన్‌లోనూ, ఎమోష‌న్ సీన్స్‌లో ఒకేలా న‌టించాడు. అదొక్క‌టే మైన‌స్‌. అవికా కాస్త బొద్దుగా క‌నిపించింది. కానీ స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. రావుర‌మేష్ ఈ క‌థ‌కు వెన్నెముక‌లా నిలిచాడు. త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి... ఈపాత్ర‌ని పండించాడు. చివ‌ర్లో పోసాని కృష్ణ‌ముర‌ళి పాత్ర కూడా కీల‌క‌మే.

చిన్న సినిమా అయినా.. క్వాలిటీలో పెద్ద సినిమాలానే క‌నిపించింది. ముఖ్యంగా ఫొటోగ్ర‌పీ ఈసినిమాకి వ‌న్నె తెచ్చింది. క‌ల‌ర్ కాంబినేష‌న్ బాగుంది. శేఖ‌ర్ చంద్ర క‌థ‌కు త‌గిన బాణీల్ని అందించాడు. మాస్ పాట‌ల్నీ ఇవ్వ‌గ‌ల‌న‌ని నిరూపించాడు. ఈ సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ సంభాష‌ణ‌లు. కొత్త కుర్రాడు ప్ర‌స‌న్న అందించిన సంభాష‌ణ‌లు ఎక్క‌డ‌క‌క్క‌డ ఈ సినిమాని నిల‌బెడుతూ వ‌చ్చాయి. కామెడీ పంచ్ ఎంత బాగా రాశాడో, సీరియ‌స్ సీన్‌లోనూ అంతేలా పెన్ను ప‌వర్ చూపించాడు. త్రినాధ‌రావు న‌క్కిన మంచి స్ర్కిప్ట్ రాసుకొన్నాడు. క‌థ‌కు ఏమేం కావాలో ఆ దినుసులు స‌మ‌కూర్చుకొన్నాడు. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ ఎంట‌ర్‌టైన్ పండించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

చిన్ని చిన్ని లోపాలున్నా... వినోదంతో తెలివిగా దాన్ని క‌వ‌ర్ చేస్తూ... కాల‌క్షేపం చేసేసే సినిమా ఇది. మీకు కావ‌ల్సింది ఎంట‌ర్‌టైన్ మాత్రమే అయితే ఈసినిమాని నిర‌భ్యంత‌రంగా చూసేయొచ్చు.