Read more!

English | Telugu

సినిమా పేరు:కెప్టెన్
బ్యానర్:శ్రేష్ఠ్ మూవీస్‌, థింక్ స్టూడియోస్‌
Rating:2.50
విడుదలయిన తేది:Sep 8, 2022

సినిమా పేరు: కెప్టెన్‌
తారాగ‌ణం: ఆర్య‌, సిమ్ర‌న్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, మాళ‌వికా అవినాశ్‌, కావ్యా శెట్టి, భ‌ర‌త్ రాజ్‌, ఆదిత్య మీన‌న్‌, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, గోకుల్ ఆనంద్‌ 
డైలాగ్స్: రాకేందు మౌళి
మ్యూజిక్: డి. ఇమాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌. యువ‌
ఎడిటింగ్‌: ప్ర‌దీప్ ఇ. రాఘ‌వ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: య‌స్‌.య‌స్‌. మూర్తి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్‌
బ్యాన‌ర్స్: శ్రేష్ఠ్ మూవీస్‌, థింక్ స్టూడియోస్‌
విడుద‌ల తేదీ: 8 సెప్టెంబ‌ర్ 2022

ఆర్య హీరోగా న‌టించిన త‌మిళ్ మూవీ 'కెప్టెన్‌'ను అదే పేరుతో శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి (నితిన్ తండ్రి) తెలుగులో రిలీజ్ చేశారు. ఇటీవ‌లే క‌మ‌ల్ హాస‌న్ మూవీ 'విక్ర‌మ్‌'ను తెలుగులో రిలీజ్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న సుధాక‌ర్‌రెడ్డి, మ‌రోసారి గ‌ట్టి న‌మ్మ‌కంతోటే సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అయిన‌ 'కెప్టెన్‌'ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చారు. ఇండియాలో రూపొందిన తొలి క్రీచ‌ర్ (వింత జీవి) ఫిల్మ్‌గా ప్ర‌మోట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే...

క‌థ‌
సిక్కింలో హిమాల‌య ప‌ర్వ‌త సానువుల్లోని అడ‌వుల్లో ఉన్న సెక్ట‌ర్ 42 అనే ప్ర‌దేశానికి ఎవ‌రు వెళ్లినా ప్రాణాల‌తో బ‌య‌ట‌కు రారు. ఒక ఆర్మీ టీమ్‌కు కూడా అదే గ‌తి ప‌డుతుంది. దాంతో ఆ ర‌హ‌స్యాన్ని ఛేదించే బాధ్య‌త కెప్టెన్ విజ‌య్‌కుమార్ (ఆర్య‌)కు అప్ప‌గిస్తారు. తన టీమ్‌తో క‌లిసి అక్క‌డ‌కు వెళ్లిన కెప్టెన్ విజ‌య్ టీమ్‌పై 'మిన‌టోర్' అనే ఓ వింత జీవి దాడిచేస్తుంది. టీమ్‌లోని కార్తి (హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌) వింత‌గా ప్ర‌వ‌ర్తించి, విజ‌య్ భుజంపై గ‌న్‌పై కాల్చి, త‌ర్వాత త‌న‌ను తాను త‌ల‌పై కాల్చుకొని సూసైడ్ చేసుకుంటాడు. ఏడాది పైగా గ‌డిచిపోతుంది. అనాథ అయిన‌ విజ‌య్‌కు లేడీ మేజ‌ర్ ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తుంది. మేజ‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కావ్య (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి)ని క‌లుస్తాడు విజ‌య్‌. అత‌డి గురించి అన్నీ తెలుసుకొనే వ‌చ్చాన‌నీ, నిర్ణ‌యం తీసుకోవాల్సింది మీరేన‌ని చెప్తుంది కావ్య‌. అయితే విజ‌య్ ఏ విష‌య‌మూ తేల్చి చెప్ప‌డు. ఆమె వెళ్లిపోతుంది. సెక్ట‌ర్ 42లో ఒక ల్యాబ్‌ను ఏర్పాటుచేసే ప్లాన్‌తో డాక్ట‌ర్ కీర్తి (సిమ్ర‌న్‌) మిల‌ట‌రీ సాయం కోరుతుంది. మ‌రోసారి అక్క‌డ‌కు వెళ్లే ప‌ని విజ‌య్ టీమ్‌కు అప్ప‌గిస్తాడు ఆర్మీ జ‌న‌ర‌ల్ (ఆదిత్య మీన‌న్‌). కీర్తితో క‌లిసి సెక్ట‌ర్ 42కు వెళ్లిన విజ‌య్ టీమ్ మిన‌టోర్ల దండును ఎలా ఎదుర్కొంది? దాంతో పాటు విజ‌య్‌కు తెలిసిన మ‌రో నిజ‌మేమిటి? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

గ్ర‌హాంత‌ర‌జీవులను, వింత జీవులను పాత్ర‌లుగా చూపిస్తూ హాలీవుడ్‌లోనే కాకుండా కొరియాలోనూ కొన్ని సైన్స్ ఫిక్ష‌న్‌ సినిమాలొచ్చాయి. హృతిక్ రోష‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'కోయీ మిల్ గ‌యా'లో ఏలియ‌న్ (గ్ర‌హాంత‌ర‌జీవి)ను మ‌నం చూశాం కానీ వేరే వింత జీవుల‌ను ప్ర‌ధానంగా చూపిస్తూ సినిమాలు రాలేదు. 'కెప్టెన్‌'లో మ‌నం మిన‌టోర్ అనే వింత జీవుల‌ను చూస్తాం. స్క్రీన్‌ప్లే ప‌రంగా చూస్తే.. చివ‌రి దాకా ఆస‌క్తిక‌రంగా సాగే సినిమా 'కెప్టెన్‌'. కాక‌పోతే సీజీలో సృష్టించిన మిన‌టోర్‌లు కానీ, క్లైమాక్స్‌లో వ‌చ్చే మిన‌టోర్ కింగ్ సీన్లు కానీ మ‌రీ నాసిర‌కం క్వాలిటీతో క‌నిపించాయి. బ‌డ్జెట్ ప్రాబ్లెమ్ వ‌ల్లే వాటిని అలా తీశార‌నేది అర్థ‌మైపోతోంది. అస‌లు మిన‌టోర్లు ఆ అడ‌విలో ఎందుకు ఉన్నాయి? అనే ప్ర‌శ్న‌కు లాజిక‌ల్‌గా ఆన్స‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్‌. 

కెప్టెన్ అనేది ఒక రెగ్యుల‌ర్ స్టోరీతో వ‌చ్చిన‌ సినిమా కాదు. త‌న కెరీర్‌లో భిన్న క‌థాంశాల‌ను ఎంచుకుంటూ వ‌స్తోన్న ఆర్య చేసిన మ‌రో డిఫ‌రెంట్ ఫిల్మ్ ఇది. రెండు గంట‌ల లోపు నిడివి వున్న ఈ సినిమాలో వింత జీవుల కంటే మ‌న‌మ‌ధ్యే తిరుగుతుంటే మ‌నుషులే మ‌రింత‌ ప్ర‌మాద‌కారుల‌నే విష‌యాన్ని ఈ సినిమాతో చెప్పాడు ద‌ర్శ‌కుడు. తోటి టీమ్ మెంబ‌ర్స్‌పై దాడిచేసి, త‌న‌ను తాను కాల్చుకొని చ‌నిపోయిన కార్తీపై ద్రోహి అనే ముద్ర‌వేసి, అత‌డికి సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు కాకుండా చేస్తే.. అత‌ను ద్రోహి కాదు, అత‌డ‌లా ప్ర‌వ‌ర్తించ‌డానికి వేరే కార‌ణం ఉంద‌ని బ‌లంగా వాదించి, చివ‌ర‌కు ఆ కార‌ణాన్ని క‌నిపెట్టి, కార్తి వ‌ల్లే తామంద‌రం బ‌తికున్నామ‌ని విజ‌య్ నిరూపించ‌డం ఈ క‌థ‌లోని ఓ కీల‌కాంశం. అయితే ఈ అంశంతో సంబంధం ఉన్న కావ్య పాత్ర‌ను మ‌రీ చిన్న‌ది చేయ‌డం ద‌ర్శ‌కుడు చేసిన ఓ పొర‌పాటు. ఆమె పాత్రపై మ‌రింత శ్ర‌ద్ధ‌పెట్టిన‌ట్ల‌యితే ఎమోష‌న‌ల్‌గానూ సినిమాకు ఉప‌క‌రించి ఉండేది. సైన్స్ ఫిక్ష‌న్ మూవీకి గ్రాఫిక్ వ‌ర్క్ అనేది అత్యంత కీల‌కం. ఈ సినిమాకు మైన‌స్‌గా మారింది అదే. క్లైమాక్స్ సీన్‌లో సీజీ వ‌ర్క్ మ‌రీ నాసిర‌కంగా ఉంది.

సీజీ వ‌ర్క్‌తో సంబంధంలేని సీన్ల‌లో య‌స్‌. యువ సినిమాటోగ్ర‌ఫీ ఎఫెక్టివ్‌గానే ఉంది. అడ‌వుల్లో తీసిన సీన్లు కానీ, మిన‌టోర్‌ను ప‌రీక్షించే ల్యాబ్ సీన్లు కానీ బాగా వ‌చ్చాయి. ఇటీవ‌లి కాలంలో త‌మిళంలోని టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న డి. ఇమాన్‌.. 'కెప్టెన్‌'కు మంచి బీజియం స‌మ‌కూర్చాడు. ప్ర‌దీప్ రాఘ‌వ్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంటే, య‌స్‌.య‌స్‌. మూర్తి ప్రొడ‌క్ష‌న్ డిజైన్ టాప్ క్లాస్‌లో ఉంది. స్టంట్ సీన్లు ఎఫెక్టివ్‌గా వ‌చ్చాయి.

న‌టీన‌టుల ప‌నితీరు

పనిపై అంకిత‌భావం ఉన్న కెప్టెన్ విజ‌య్‌కుమార్ క్యారెక్ట‌ర్‌లో ఆర్య చులాగ్గా ఇమిడిపోయాడు. ఎక్క‌డా ఓవ‌రాక్టింగ్ అనేది లేకుండా, చాలా బ్యాలెన్స్‌డ్‌గా, మెచ్యూర్డ్‌గా ప‌ర్ఫామ్ చేశాడు. అత‌ని హావ‌భావాలు కొన్ని చోట్ల సింప్లీ సూప‌ర్బ్ అనిపించాయి. డాక్ట‌ర్ కీర్తి పాత్ర‌లో సిమ్ర‌న్ బాగా రాణించింది. ఆమెలోని ఓ కొత్త‌కోణాన్ని ఈ సినిమాలో చూస్తాం. కొద్దిసేపే క‌నిపించినా కావ్య‌గా ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఆక‌ట్టుకుంది. కెప్టెన్ టీమ్ మెంబ‌ర్స్‌లో హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, కావ్యా శెట్టి, భ‌ర‌త్ రాజ్‌, మ‌రో ఇద్ద‌రు త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఆర్మీ జ‌న‌ర‌ల్‌గా ఆదిత్య మీన‌న్ గంభీరంగా న‌టించాడు. లేడీ మేజ‌ర్‌గా మాళ‌వికా అవినాశ్ (కేజీఎఫ్ సిరీస్ ఫేమ్‌), మిగ‌తా పాత్ర‌ధారులు ప‌రిధుల మేర‌కు న‌టించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మిన‌టోర్ (వింత‌జీవి)కు సంబంధించిన సీన్ల‌కు నాణ్య‌మైన సీజీ వ‌ర్క్ ఉన్న‌ట్ల‌యితే 'కెప్టెన్' మూవీ ఆక‌ర్ష‌ణీయంగా వ‌చ్చి ఉండేది. అయిన‌ప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో సాగే ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ఓసారి చూడ‌టంలో త‌ప్పేమీ లేదు.

 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి