Read more!

English | Telugu

సినిమా పేరు:బ్రహ్మోత్సవం
బ్యానర్:పివిపి సినిమా
Rating:2.00
విడుదలయిన తేది:May 20, 2016

గుడి క‌ట్టినంత మాత్ర‌న ప‌విత్ర‌త రాదు!  అందులో లింగాన్ని ప్ర‌తిష్టించిన‌ప్పుడే... రెండు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తారు.- ఈ మాట ఎందుకంటున్నామంటే.. కుటుంబ బంధాలంటే... అంద‌ర్నీ ఓ చోట చేర్చి గ్రూప్ ఫొటో తీయ‌డం కాదు. అంద‌రి చేతులూ ప‌ట్టుకొని పాట‌లుల పాడ‌డం కాదు. అంద‌రి మ‌న‌సులూ క‌ల‌వాలి. అలాంటి గొప్ప క‌థ రాసుకోవాలి.. అప్పుడే ఎమోష‌న్స్ పండుతాయి. అదిగో ఈ పాయింట్ ద‌గ్గరే శ్రీ‌కాంత్ అడ్డాల విఫ‌ల‌మయ్యాడు. కుటుంబ క‌థ చెబుతున్నా.. అందులో గొప్ప‌ద‌నం చెబుతున్నా అంటూ.. టాలీవుడ్‌లో ఉన్న ఆర్టిస్టులంద‌రినీ ఓ చోట‌కు చేర్చాడు. కానీ వాళ్ల మ‌ధ్య ఎమోష‌న్ పుట్టించ‌డంలో ఫెయిల్ అయ్యాడు, దాంతో  బ్ర‌హ్మోత్స‌వం కాస్త‌..  ఆనందం లేని పండ‌గ‌లా క‌నిపించింది.

ఇంత‌కీ ఈ సినిమా క‌థేంటంటే.. అదో పెద్ద కుటుంబం. ఇంటి పెద్ద స‌త్య‌రాజ్‌. ఆయ‌న‌కు న‌లుగురు బామ్మ‌ర్దులు. అంతా క‌ల‌సి వ్యాపారం చేస్తుంటారు. అందులో పెద బామ్మ‌ర్ది (రావు ర‌మేష్‌)  త‌న‌కు ఏమాత్రం ఇండివిడ్యువాలిటీ లేద‌ని ఫీల‌వుతుంటాడు. ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది గానీ.. తాను మాత్రం బేల మొఖం వేసుకొని చూస్తుంటాడు. స‌త్య‌రాజ్ కొడుకు మ‌హేష్ బాబు. త‌న‌కీ తండ్రి పోలికే. న‌లుగురూ త‌న చుట్టూ ఉండాల‌నుకొంటాడు. చుట్టాల‌మ్మాయి కాజ‌ల్‌ని ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ కాజ‌ల్ మ‌న‌స్త్వం వేరు. ఒక క్ష‌ణం ఒక‌లా, మ‌రుక్ష‌ణం మ‌రోలా ఆలోచిస్తుంది. అందుకే మ‌హేష్ ప్రేమ‌ని వ‌దులుకొని వెళ్లిపోతుంది. స‌రిగ్గా అప్పుడే రావు ర‌మేష్ కూడా ఇంటి పెద్దాయ‌న‌తో గొడ‌వ పెట్టుకొని విడిపోతాడు. దాంతో.. స‌త్యరాజ్ గుండె ఆగిపోతుంది. మిగిలిన‌వాళ్లు దూరం కాకుండా చూడ‌మ‌ని కొడుకు ద‌గ్గ‌ర మాట తీసుకొంటాడు. ఆ మాట‌ని నిల‌బెట్ట‌డానికి మ‌హేష్ బాబు ఏం చేశాడ‌న్న‌ది ఈ సినిమా క‌థ‌.


ఎనాలసిస్ :

చెప్పుకోవ‌డానికి పెద్ద క‌థే లేని సినిమా ఇది. మ‌రి శ్రీ‌కాంత్ అడ్డాల మ‌హేష్‌కీ, పీవీపీకి అంత‌మందికి ఏం చెప్పి ఒప్పించాడో ఆయ‌న‌కే తెలియాలి. బ‌హుశా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సీడీ ఇచ్చి - ఇలాంటి సినిమా ఇంకోటి, ఇంకో యాంగిల్లో తీస్తా అని చెప్పేసుంటాడు. అంద‌రూ త‌లాడించి ఉంటారు. శ్రీ‌కాంత్ పాయింట్ మంచిదే. అంద‌రూ క‌లిసుండాలి.. అప్పుడే ప్ర‌తీ రోజూ ఓ పండ‌గ‌లా ఉంటుంది అన్న‌ది చెప్పాల‌నుకొన్నాడు. మొద‌లెట్ట‌డం కూడా బాగానే మొద‌లెట్టాడు. కానీ మ‌ధ్య‌లో ఎటునుంచో ఎటో వెళ్లిపోయాడు. చివ‌రికి వీళ్ల‌కేం చెప్పాల‌ని ఈ క‌థ మొద‌లెట్టా.. అని క‌న్‌ఫ్యూజ్‌లో ప‌డ్డాడు. మ‌ళ్లీ క్లైమాక్స్‌కి అది గుర్తొచ్చి.. అప్పుడు తేరుకొన్నాడు.  త‌న కుటుంబం విడిపోకుండా ఉండ‌డానికి క‌థానాయ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం ఈ సినిమా. కానీ.. అలాంటి ప్ర‌య‌త్నాలేం ఈ సినిమాలో క‌నిపించ‌వు. ఇంట్లోవాళ్లంతా విడిపోతారేమో అనుకొన్న‌వాడు.. ఏడు త‌రాల బంధువుల్ని వెదుక్కొంటూ బ‌య‌ట‌కు ఎందుకు వెళ్తాడు??  వెళ్లి ఏం చేసిన‌ట్టు??  ఆ జ‌ర్నీలో ఏం తెలుసుకొన్న‌ట్టు??  ఇవేం అర్థం కావు. అస‌లు తాను చేసిన జ‌ర్నీకీ... తన మావ‌య్య మారిపోవ‌డానికీ సంబంధ‌మే లేదు. చివ‌ర్లో మావ‌య్య‌లో మార్పు కూడా కృత్రిమంగా ఉంటుంది. అస‌లు స‌త్య‌రాజ్‌ని ఎప్పుడు చంపేశారో.. అప్పుడే ఈ సినిమా ట్రాక్ త‌ప్పేసింది. లోతైన భావాలెన్నో చెప్పాల‌నుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌య‌త్నం మంచిదే. కానీ అవ‌న్నీ అర్థ‌మ‌య్యేలా చెబితే బాగుండేది.

ఫ్రేము ప‌ట్ట‌లేనంత మంది మ‌న‌ముందు ఉంటారు. కానీ వాళ్ల ప్రాధాన్యం అంతంత మాత్రమే. మ‌హేష్‌, స‌త్య‌రాజ్‌, స‌మంత‌.. ఈ ముగ్గురి చుట్టూనే సినిమా న‌డిచింది. అయితే పిల్ల‌ర్ మాత్రం.. మ‌హేష్ బాబునే. ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ తానెలా అర్థం చేసుకొన్నాడో తెలీదుగానీ, త‌న పాత్ర‌కు త‌గిన‌ట్టు మౌల్డ్ అయిపోయాడు. కాజ‌ల్ ఈనాటి అమ్మాయిల ప్ర‌తినిధిగా క‌నిపించింది. స‌మంత‌.. అల్ల‌రి చేసింది. హుషారుగాన‌టించింది. ఫ్యామిలీ అంటే అంతిష్ట‌ప‌డే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏంటో కూడా ద‌ర్శ‌కుడు చూపించ‌లేక‌పోయాడు. అది స్ర్కిప్ట్‌లో ఉన్న లోప‌మే. క‌థ‌లో పాయింట్ బ‌లంగా ఉన్నా... ద‌ర్శ‌కుడు దాన్ని డీల్ చేయ‌డంలో త‌ప్పు చేశాడు. స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత ధోర‌ణిలో సాగుతాయి. వినోదానికి చోటే లేదు. వెన్నెల కిషోర్‌ని సెకండాఫ్‌లోకి లాక్కొచ్చారు కాబ‌ట్టి ఆమాత్రం రిలీఫ్ అయినా ద‌క్కింది. ఇంట్ర‌వెల్ ఎపిసోడ్‌, చివ‌ర్లో క్లైమాక్స్ త‌ప్ప‌... అంతా ఎమోష‌న్ అయిపోవ‌డానికి ఈ సినిమాలో ఏం లేకుండా పోయింది.

పెర్ఫామెన్స్:

మహేష్ మ‌రోసారి వ‌న్ మ్యాన్ షో చేశాడు. త‌న అందం,. న‌ట‌న‌.. ఇమేజ్ తో ఈ సినిమాని లాక్కొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. స‌మంత కంటే కాజ‌ల్ అందంగా క‌నిపించింది. కాజ‌ల్ కంటే స‌మంత పాత్ర గుర్తుంటుంది. రావు ర‌మేష్ మ‌రోసారి ఆక‌ట్టుకొన్నాడు. ఆ పాత్ర‌... బ‌లం అలాంటిది. స‌త్య‌రాజ్‌, రేవ‌తి, జ‌య‌సుధ‌.. వీళ్లంతా అనుభ‌వ‌జ్ఞులే కాబట్టి బండి సాఫీగా న‌డిచిపోయింది. అయితే.. సినిమా అంతా ఓ సెట్టింగ్ లా తోచింది. కృత్రిమ‌త్వం ఎక్కువ‌గా క‌నిపించింది. మిక్కీ బాణీలు స్లోగా ఉన్నాయి.. ఈ సినిమాలానే. మాట‌లు బ‌లంగానే ఉన్నా.. అంత త్వ‌ర‌గా ఎవ‌రికీ ఎక్క‌వు. స్ర్కీన్ ప్లే విష‌యంలో ద‌ర్శ‌కుడు ఇంకాస్త ఆలోచించాల్సింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మ‌హేష్‌.. 3 క‌థానాయిక‌లు.. అంత మంది ఆర్టిస్టులు, బ‌లమైన టెక్నిక‌ల్ టీమ్‌.. ఇవ‌న్నీ ఉండి కూడా ఉత్స‌వంలా తీయాల్సిన సినిమా.. నీర‌సంగా త‌యారైంది. ఈసారికి మ‌హేష్ అభిమానులు నిరాశ‌ప‌డ‌క త‌ప్ప‌దు.