Read more!

English | Telugu

సినిమా పేరు:బ్ర‌హ్మాస్త్రం
బ్యానర్:ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌, స్టార్‌లైట్ పిక్చ‌ర్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌
Rating:2.50
విడుదలయిన తేది:Sep 9, 2022

సినిమా పేరు: బ్ర‌హ్మాస్త్రం
తారాగ‌ణం: ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్‌, మౌనీ రాయ్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుక్ ఖాన్‌, నాగార్జున‌, డింపుల్ క‌పాడియా, సౌర‌వ్ గుర్జార్‌, గుర్‌ఫ‌తే పిర్జాడా
సాహిత్యం: చంద్ర‌బోస్‌
సంగీతం: ప్రీత‌మ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: సైమ‌న్ ఫ్రాంగ్లెన్
సినిమాటోగ్ర‌ఫీ: వి. మ‌ణికంద‌న్‌, పంక‌జ్ కుమార్‌
ఎడిటింగ్: ప్ర‌కాశ్ కురుప్‌
స‌మ‌ర్ప‌ణ: య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి
నిర్మాత‌లు: క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా, అయాన్ ముఖ‌ర్జీ
స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: అయాన్ ముఖ‌ర్జీ
బ్యాన‌ర్స్‌: ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌, స్టార్‌లైట్ పిక్చ‌ర్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌
విడుద‌ల తేదీ: 9 సెప్టెంబ‌ర్ 2022

బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించిన 'బ్ర‌హ్మాస్త్ర' సినిమాను తెలుగులో 'బ్ర‌హ్మాస్త్రం' పేరుతో రిలీజ్ చేస్తున్నార‌నీ, దాన్ని య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ప్రెజెంట్ చేస్తున్నాడ‌నీ తెలిసిన‌ప్పుడు.. స‌హజంగానే తెలుగు ప్రేక్ష‌కులు ఆ మూవీపై ఆస‌క్తి చూపించారు. త‌నే పిచ్చోడిన‌నుకుంటే, త‌న‌కంటే అయాన్ ముఖ‌ర్జీ ('బ్ర‌హ్మాస్త్ర' డైరెక్ట‌ర్‌) మ‌రింత పిచ్చోడిలా క‌నిపిస్తున్నాడ‌ని రాజ‌మౌళి ఇచ్చిన కితాబుతో ఈ సినిమాపై చాలామందిలో న‌మ్మ‌కం ఏర్ప‌డింది. 'వేక‌ప్ సిద్' డైరెక్ట‌ర్‌గా అప్ప‌టికే అయాన్ మంచి పేరు తెచ్చుకుని ఉన్నాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'బ్ర‌హ్మాస్త్రం మొద‌టి భాగం: శివ' ఇప్పుడు మ‌న ముందుకు వ‌చ్చేసింది.

క‌థ‌

శివ (ర‌ణ‌బీర్ క‌పూర్‌) అనే అబ్బాయి అనాథాశ్ర‌మంలో పెరుగుతాడు. అత‌నికి ఏడాది వ‌య‌సు ఉండ‌గా అగ్నిప్ర‌మాదంలో త‌ల్లి చ‌నిపోతుంది. కానీ అత‌డిని అగ్ని ఏమీ చేయ‌లేదు. తండ్రి గురించి అత‌నికేమీ తెలీదు. ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌న‌లతో త‌న‌లో త‌న‌కే తెలీని ఏదో ర‌హ‌స్యం ఉంద‌ని అనుమానం క‌లుగుతుంది. అత‌డిని యోధుడిగా మార్చ‌గ‌ల కొన్ని శ‌క్తులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. అస్త్రాల‌న్నింటికీ అధిప‌తి అయిన బ్ర‌హ్మాస్త్రం మూడు ముక్క‌లై, ఒక్కో ముక్క ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. విశ్వాన్ని అధీనంలోకి తెచ్చుకోవాల‌ని చూసే దేవ్ అనే ఓ మ‌హాశ‌క్తిసంప‌న్నుడి మ‌నుషులు జునూన్ (మౌనీ రాయ్‌) ఆధ్వ‌ర్యంలో ఆ బ్ర‌హ్మాస్త్రం ముక్క‌ల కోసం అన్వేషిస్తుంటారు. ఒక‌ముక్క మోహ‌న్ భార్గ‌వ (షారుక్ ఖాన్‌) అనే సైంటిస్ట్ ద‌గ్గ‌ర‌, ఇంకో ముక్క అనీశ్ శెట్టి (నాగార్జున‌) అనే ఆర్టిస్ట్‌ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు క‌నిపెడుతుంది జునూన్‌. మూడో ముక్క ఎక్క‌డ ఉందో బ్ర‌హ్మాంశ గురువు (అమితాబ్ బ‌చ్చ‌న్‌)కు కూడా తెలీదు. అది ఎక్క‌డ ఉంది? జునూన్ బృందం బ్ర‌హ్మాస్త్రాన్ని సాధించిందా? అస‌లు శివ ఎవ‌రు? ఇషా (ఆలియా భ‌ట్‌)తో అత‌ని ప్రేమ క‌థ ఏ తీరానికి చేరింది? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తాయి.


ఎనాలసిస్ :

'బ్ర‌హ్మ‌స్త్రం' మొద‌టి భాగం శివ పాత్ర చుట్టూ న‌డుస్తుంది. సినిమా ఆరంభ‌మైన మొద‌టి పావుగంట‌లోనే క‌థ‌లోని కీల‌కాంశం ఇమిడి ఉంది. అయితే ఆ టైమ్‌లోనే క‌థ వంక‌ర‌టింక‌ర క‌ర్ర‌లాగా ఎటు నుంచి ఎటో తిరిగి, రాకెట్‌గా మారి ఎవ‌రి షెడ్డులోకో పోతుంది. ష‌డ్రుచులు ఉన్న విందు భోజ‌నం ముందు కూర్చొని, రెండు మూడు ముద్ద‌లు తిని, ఇంకా ఆ రుచుల్ని ఆస్వాదించ‌కుండానే మ‌న ముందు ఉన్న భోజ‌నం ప్లేటును లాగేసి, చ‌ల్లారిపోయిన టీ పెట్టి తాగ‌మంటే ఎలా ఉంటుంది? స‌రిగ్గా 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా లాగా ఉంటుంది. సినిమాలో శివ పాత్ర‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేసేది, బ్ర‌హ్మాస్త్రం గురించి చెప్పేది చిరంజీవి వాయిస్‌. సినిమాలోని ప్ర‌ధానాంశం బ్ర‌హ్మాస్త్రం. అదే విందు భోజ‌నం. కానీ దాన్ని ఆస్వాదించ‌కుండా శివ‌, ఇషాల ల‌వ్ స్టోరీ కోల్డ్ టీలా గొంతుకు అడ్డం ప‌డుతూ ఉంటుంది.

నిజానికి చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ త‌ర్వాత సినిమా క‌థ‌ ఉత్కంర‌ఠ‌భ‌రితంగా, హుషారుగా మొద‌ల‌వుతుంది. శివ రూపంలో ఓ సూప‌ర్ హీరోను మ‌నం చూడ‌బోతున్నామ‌ని ఆశిస్తాం. కానీ చ‌ప్పున శివ‌-ఇషా ల‌వ్ స్టోరీ వ‌చ్చి, క‌థ డాన్స్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎపిసోడ్‌ను ద‌స‌రా వేడుక‌ల్లో రావ‌ణాసురుని భారీ బొమ్మ‌ని పేల్చివేసే సీన్‌తో గొప్ప‌గా ప్లాన్ చేశారు. ఇక స్టోరీ జెట్ స్పీడ్‌లో హైవేపై ప‌రుగులు పెడుతుంద‌నుకుంటే, ఠ‌ప్పున టోల్‌గేట్ వ‌చ్చి, ఆ స్పీడ్‌కు బ్రేకులు వేసిన‌ట్లు హాస్యాస్ప‌ద‌మైన స‌న్నివేశాలు, భ‌యంక‌ర‌మైన‌ డైలాగులు, అన‌వ‌స‌ర‌మైన సంద‌ర్భాలు వ‌చ్చి ఇబ్బందిపెడ‌తాయి. వాటితో మ‌నం మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.

ప్ర‌పంచాన్నంత‌టినీ నాశ‌నం చేయ‌గ‌ల ప‌వ‌ర్‌ఫుల్ అస్త్రం బ్ర‌హ్మాస్త్ర‌మ‌ని చెప్పి, ఆ బ్ర‌హ్మాస్త్రాన్ని కూడా అదుపుచేయ‌గ‌ల శ‌క్తి ప్రేమ‌కు ఉంద‌ని చివ‌ర‌లో చెప్తారే.. అది అన్నింటికంటే బ్ర‌హ్మాండం. ప్రేమ‌ను మించిన శ‌క్తి మ‌రేదీ లేద‌నే డైలాగ్ విన‌డం కోసం మ‌నం 166 నిమిషాల సేపు వెయిట్ చెయ్యాలి. ఈ మ‌ధ్య‌లో మ‌నం హింస‌ను అనుభ‌వించాలి. శివ‌, ఇషా మ‌ధ్య ప్రేమ అంత శ‌క్తిమంత‌మైన‌ద‌న్న మాట‌. కానీ వారి మ‌ధ్య ప్రేమ పుట్టే స‌న్నివేశాలు ఏమాత్రం శ‌క్తిమంతంగా లేక‌పోవ‌డ‌మే బాధాక‌రం. వాళ్ల మ‌ధ్య ఠ‌ప్పున ప్రేమ పుట్టేస్తుంది. కానీ ఆ ప్రేమ‌ను వారు ఒకేసారి బ‌య‌ట‌కు చెప్ప‌రు. మొద‌ట శివ చెప్పాక‌, కొన్ని ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌న‌చ్చి, అప్పుడు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని ఇషా చెప్తుంది. ఈలోపు ఆమె అత‌డిని ప్రేమించ‌దా.. అని సందేహ‌ప‌డొద్దు. నోటితో చెప్ప‌దంతే. చేత‌ల్లో చూపిస్తూనే ఉంటుంది. అలాంటి వారి అద్భుత‌మైన ప్రేమ‌క‌థ చూసే భాగ్యం మ‌న‌కు ద‌క్కింద‌న్న మాట‌!

ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. హిందీలో హుస్సేన్ ద‌ళాల్ రాసిన డైలాగ్స్‌ను తెలుగులో ఎవ‌రు రాశారో కానీ, చాలా చోట్ల అవి హారిబుల్‌గా ఉన్నాయి. బ్ర‌హ్మాంశ స‌భ్యుల గురువు ర‌ఘు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, ఆయ‌న ఎంత‌టి పూజ‌నీయుడో తెలిసి కూడా, "ఈ ముస‌లోడికి ఎక్కేసింది" అని శివ ఎక‌సెక్కంగా అన‌డం చూసి, మ‌నం ఠారెత్తిపోతాం. అదే కాదు, శివ‌-ఇషా మ‌ధ్య సంభాష‌ణ‌లు కూడా అంతే. అవి విని, రాయ‌డం రానివాడి చేత ఈ డైలాగ్స్ రాయించారా? అనే సందేహం కూడా క‌లుగుతుంది. "ఎవరు నువ్వు?" అని ప‌దే ప‌దే శివ‌ను ఇషా అడుగుతుంటే, చిరాకు పుడుతుంది. ఆ ఇద్ద‌రూ క‌లుసుకొనే తీరు, వారి మ‌ధ్య స్నేహం/ ప్రేమ ఎదిగే తీరు ఏమాత్రం ఇంప్రెసివ్‌గా అనిపించ‌దు. నేను లేకుండా నువ్వుండ‌గ‌ల‌వా? లాంటి డైలాగ్స్‌కు కాలం చెల్లిపోయింద‌ని ఈ డైలాగ్ రైట‌ర్‌కు తెలీలేదులా ఉంది. శివ‌, జునూన్ మ‌ధ్య డైలాగ్స్ కూడా సిల్లీగా ఉంటాయి. కాక‌పోతే బ్ర‌హ్మాస్త్రానికి సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన స‌న్నివేశాలు, ఘ‌ట‌న‌లు ఆస‌క్తిని క‌లిగిస్తుంటాయి.

ప్రీత‌మ్ స్వ‌రాలు కూర్చిన పాట‌లు విన‌డానికి బాగున్నాయి. కానీ అవి వ‌చ్చే సంద‌ర్భాలే పంటికింద రాళ్ల‌లా ఉంటాయి. బ్ర‌హ్మాస్త్రంతో ప్ర‌పంచం నాశ‌నం అవుతుంద‌నే సంద‌ర్భంలో "కుంకుమ‌లా నువ్వే చేర‌గా ప్రియా" అంటూ సిద్ శ్రీ‌రామ్ వాయిస్‌తో ర‌ణ‌బీర్ పాడ‌తాడు. చెప్పాలంటే పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఇంకా బాగుంది. ఈ బీజీయం వెనుక ఉన్న‌ది ఇంగ్లీష్ కంపోజ‌ర్ సైమ‌న్ ఫ్రాంగ్లెన్. చాలా సీన్ల‌ను ఈ బ్యాగ్రౌండ్ స్కోరే కాపాడింది. సినిమాలోని ప్ల‌స్ పాయింట్స్‌లో వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఒక‌టి. చాలా క్వాలిటీతో గ్రాఫిక్ వ‌ర్క్ చేశారు.

న‌టీన‌టుల ప‌నితీరు

శివ పాత్ర లేని స‌న్నివేశాలు ఈ సినిమాలో చాలా త‌క్కువ‌. ఆ పాత్ర‌లోకి ర‌ణ‌బీర్ క‌పూర్ సునాయాసంగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. హావ‌భావ ప్ర‌ద‌ర్శ‌న‌లో త‌నెంత‌టి నిష్ణాతుడో ఈ సినిమా మ‌రోసారి చూపించింది. ఒక‌వైపు చ‌లాకీత‌నం, ఇంకోవైపు పెయిన్ ఉండే ఆ క్యారెక్ట‌ర్‌లో బాగా రాణించాడు. ఇషాగా ఆలియా భ‌ట్ త‌న వంతు బాధ్య‌త‌ను నెర‌వేర్చింది. ఆమె న‌ట‌న గురించి చెప్పేదేముంది! గురు ర‌ఘు పాత్ర‌లో అమితాబ్ ఎప్ప‌టిలా గంభీరంగా, హుందాగా క‌నిపించారు. లేడీ విల‌న్ జునూన్ క్యారెక్ట‌ర్‌లో మౌనీ రాయ్ సూప‌ర్బ్‌గా ప‌ర్ఫామ్ చేసింది. షారుక్ ఖాన్‌, నాగార్జున చేసిన‌వి చిన్న పాత్ర‌లే కానీ, క‌థ‌కు కీల‌క‌మైన‌వి. ఇద్ద‌రూ ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. అయితే షారుక్ ఫ్యాన్స్ అత‌డిని ఆ పాత్ర‌లో చూసి డిజ‌ప్పాయింట్ అవుతారు. డింపుల్ క‌పాడియా ఎందుకు ఉందో అర్థం కాదు. ఆమె మూడంటే మూడు చోట్ల ఇలా క‌నిపించి, అలా మాయ‌మ‌వుతుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం ఒకింత నిరాశ‌ప‌రిచింది. ఇంత‌కుముందు మ‌నం చూడ‌నిదేదీ ఈ మూవీలో లేదు. ఈ త‌ర‌హా క‌థ‌లు, పాత్ర‌లు, స‌న్నివేశాలు, ఘ‌ట‌న‌లు, యాక్ష‌న్ సీన్లు ఎన్నెన్నింటినో ఇప్ప‌టికే మ‌నం చూసేశాం. ఓటీటీ వీక్ష‌కులైతే ఇలాంటివి కొల్ల‌లుగా చూసేసి ఉంటారు. మార్వెల్‌, డీసీ కామిక్స్ సినిమాల్లో మ‌నం చూసిన వాటినే 'బ్ర‌హ్మాస్త్రం'లో చూస్తాం. అంటే.. పార్సిల్ కొత్త‌దే కానీ, అందులో ఉన్న వ‌స్తువు పాత‌ది! విష‌యం బ‌ల‌హీనం! విజువ‌ల్‌గా మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది.

- బుద్ధి యజ్ఞ‌మూర్తి