Read more!

English | Telugu

సినిమా పేరు:బింబిసార
బ్యానర్:ఎన్టీఆర్ ఆర్ట్స్
Rating:3.00
విడుదలయిన తేది:Aug 5, 2022

సినిమా పేరు: బింబిసార
తారాగ‌ణం: కళ్యాణ్ రామ్, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, అయ్యప్ప శర్మ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర 
మ్యూజిక్(సాంగ్స్): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం.ఎం.కీరవాణి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: కె.హరికృష్ణ
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మల్లిడి వశిష్ఠ్
బ్యాన‌ర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుద‌ల తేదీ 5 ఆగ‌స్ట్ 2022

జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా, నిర్మాతగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన 'బింబిసార' అనే మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ తో మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంతవరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమాకి రానంత బజ్ 'బింబిసార'కి వచ్చింది. మరి ప్రయోగాల పేరుతో గతంతో 'ఓం3D' వంటి షాక్ తిన్న కళ్యాణ్ రామ్.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతున్నాడో చూద్దాం.

కథ:

కొన్ని వందల ఏళ్ల క్రితం త్రిగర్తల రాజ్యంలో బింబిసారుడు అనే రాజు ఉండేవాడు. అతను పేరుకే రాజు కానీ.. రాక్షసుడు లాంటి వాడు. రాజునన్న అహంతో క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన రాజ్య ప్రజల బాగోగులు గాలి కొదిలేసి.. పక్క రాజ్యాలను ఆక్రమించుకోవడం మీదే అతని దృష్టంతా ఉంటుంది. తన మాటకు ఎదురు చెప్తే సొంత వాళ్ళను కూడా చంపేస్తాడు. రాజ్యం కోసం సోదరుడినే చంపిన క్రూరమైన రాజు. తనకి ఎదురే లేదు, మనిషి కాదు కదా దేవుడు కూడా నన్నేం ఏం చేయలేడన్న అహంతో బ్రతుకుతున్న బింబిసార జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. టైం ట్రావెల్ చేసి వందల ఏళ్ళు ముందుకు అంటే ప్రస్తుతం మన లోకంలోకి వస్తాడు. అయితే బింబిసార గతం నుంచి ప్రస్తుతానికి వస్తాడని, అతనొస్తే 'ధన్వంతరి గ్రంథం' తమ చేతికొస్తుందని కొందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అసలు బింబిసార గతం నుంచి ప్రస్తుతానికి ఎలా వచ్చాడు?.. వచ్చాక ఏం జరిగింది? అసలు ఆ 'ధన్వంతరి' గ్రంథం కథేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

'బింబిసార' చూస్తున్నప్పుడు ఇది వశిష్ఠ్ అనే ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. అనుభవమున్న దర్శకుడు తెరకెక్కించినట్లే ఉంది. మొదటి సినిమాకి ఇలాంటి కథని ఎంపిక చేసుకొని, ఒక అనుభవమున్న డైరెక్టర్ లాగా డీల్ చేసి మెప్పించడం అంత సులభం కాదు. ఆ విషయంలో వశిష్ఠను ఖచ్చితంగా మెచ్చుకోవాలి.  

ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయినప్పటికీ సైన్స్ తో ముడిపెట్టకుండా కథను నడిపించారు. పైగా ఇది ఫాంటసీ ఫిల్మ్ కాబట్టి లాజిక్స్ తో పెద్దగా పనిలేదు. 'మాయా దర్పణం' కాన్సెప్ట్ తో కాలాలను కలిపిన తీరు ఆకట్టుకుంది. కాలాలను, పాత్రలను కలుపుతూ రాసుకున్న డ్రామా బాగుంది. ఈ సినిమా ప్రధానంగా దైవం, విధి, కాలం ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంది. 

సినిమా కథ, ఆ కథని నడిపించిన తీరు బాగుంది కానీ కొన్ని సన్నివేశాలపైనా, కొన్ని పాత్రలను మలచడంపైనా మరింత శ్రద్ధ పెడితే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఫస్ట్ హాఫ్ లో బింబిసార క్రూరత్వాన్ని తెలిపేలా ఇంకా పవర్ ఫుల్ సీన్స్ ఉంటే బాగుండేది. ఒకట్రెండు సన్నివేశాల్లో తప్ప ఎక్కువగా మాటల రూపంలోనే అతని క్రూరత్వం తెలుస్తుంది. అలాగే సెకండాఫ్ లో పాప ఎమోషనల్ సీన్స్ తో పాటు.. దేవదత్త పాత్ర, విలన్ పాత్ర మీద మరింత ఫోకస్ పెట్టాల్సింది. ముఖ్యంగా బింబిసారను ఢీ కొట్టే విలన్ పాత్ర బాగా తేలిపోయింది. ఆ పాత్రకు ప్రేక్షకులకు బాగా తెలిసిన పవర్ ఫుల్ యాక్టర్ ని తీసుకొని ఉంటే బాగుండేది.

అయితే ఓవరాల్ గా మాత్రం గతాన్ని, ప్రస్తుతాన్ని ముడిపెడుతూ సినిమాని నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకుంది. మాయా దర్పణం సన్నివేశాలు గానీ ప్రస్తుతంలో బింబిసార సీన్స్ గానీ ఆకట్టుకున్నాయి. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో పాటు అక్కడక్కడా వినోదాన్ని పంచే సన్నివేశాలు కూడా ఉండటం విశేషం.

ఈ సినిమాకి ప్రధాన బలం ఎం.ఎం.కీరవాణి అని చెప్పొచ్చు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సన్నివేశాలను ఎలివేట్ చేయడంతో పాటు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి స్వర పరిచిన పాటలు కూడా బాగానే ఉన్నాయి. 'ఈశ్వరుడే', 'ఓ తేనె పలుకులా' వంటి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బానే ఉంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ కూడా సిన్మాకి మేజర్ ప్లస్ అయింది. మునెప్పగారి వాసుదేవ్ సంభాషణలు ఆకట్టుకున్నాయి.

నటీనటుల పనితీరు:

'బింబిసార' పాత్ర ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. క్రూరమైన రాజుగా బింబిసార పాత్రలో జీవించాడు. ఆ పాత్రకు ఎదురయ్యే అనుభవాలు, ఆ పాత్రలో వచ్చే మార్పులకు తగ్గట్లు వ్యత్యాసం చూపిస్తూ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడా కాస్త డైలాగ్స్ అరిచి చెప్పినట్లు అనిపించింది. డబ్బింగ్ సమయంలో రౌద్రంతో చెప్పాల్సిన డైలాగ్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉండాల్సింది. ఇక ఇందులో పేరుకి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కానీ వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. యువరాణిగా కేథరిన్, పోలీస్ గా సంయుక్త ఉన్నంతలో మెప్పించారు. జుబేదా పాత్రలో శ్రీనివాస్ రెడ్డి బాగా నటించాడు, నవ్వించాడు. ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫాంటసీ ఫిల్మ్ ప్రేక్షకులను మెప్పించేలాగే ఉంది. పూర్వకాలంలోని ఓ క్రూరమైన రాజు టైం ట్రావెల్ లో ప్రస్తుతానికి వచ్చి, మంచిగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన 'బింబిసార' థియేటర్ లో చూడదగ్గ చిత్రమే.

-గంగసాని