English | Telugu
బ్యానర్:సితార ఎంటర్టైన్మెంట్స్
Rating:3.50
విడుదలయిన తేది:Feb 25, 2022
సినిమా పేరు: భీమ్లా నాయక్
తారాగణం: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, మురళీశర్మ, సముద్రకని, రావు రమేశ్, రఘుబాబు, కాదంబరి కిరణ్, తనికెళ్ల భరణి, శత్రు, నర్రా శ్రీను, ఎంఎస్ చౌదరి, పమ్మి సాయి, హర్షవర్ధన్, సంజయ్ స్వరూప్, అజయ్
స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్
పాటలు: త్రివిక్రమ్, రామజోగయ్యశాస్త్రి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: విజయ్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకుడు: సాగర్ కె. చంద్ర
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 25 ఫిబ్రవరి 2022
ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌తో పాటు సిన్మా లవర్స్ అంతా ఆత్రుతతోని వెయిట్ చేస్తన్న 'భీమ్లా నాయక్' వచ్చేసిండు! మామూలుగా రాలే.. బాక్సాఫీసుని దున్నేయడానికి వచ్చిండు. ఆ క్యారెక్టరేందబ్బా.. ఆ రౌద్రం ఏందబ్బా.. ఆ వీరంగం ఏందబ్బా.. ట్రైలర్‌ల మనం చూసింది రవ్వంత.. సిన్మాల అయితే కళ్లు రెండూ చాల్లేదంతే! భీమ్లా నాయక్ వేషంల పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ చూస్తంటే, ఆ డైలాగ్స్ వింటంటే, అట్లాగే చూస్తా ఉండిపోవాలనిపిచ్చిందంటే.. నిజ్జంగా నిజం. బడాయి మాటలు చెప్తున్నాననుకుంటన్నారేమో.. కావలిస్తే మీరూ చూడుండ్రి.. నిజమని అనకపోతే అప్పుడు చెప్పుండ్రి.
కథ:- ఇప్పుడు 'భీమ్లా నాయక్' కత కొంచెం చెప్పుకుందాం.. తెలంగాణ నుంచి ఒక కారు 30 లీటర్ల లిక్కర్ బాటిల్స్‌తోని కారుచీకట్ల ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కాడికొస్తే.. అక్కడున్న చెక్‌పోస్ట్‌ల ఉన్న పోలీసులు ఆపుతరు. ఆ కారులో ఫుల్లుగా తాగి నిద్రపోతున్న డానియల్ శేఖర్ అనే రిటైర్డ్ ఆర్మీ మనిషి పోలీసుల్ని కొడతంటే, అప్పుడు వొస్తాడక్కడికి ఎస్సై భీమ్లా నాయక్. డానియల్‌ని లాగి ఒక్కటిచ్చి, స్టేషన్‌కు తీసుకుపోతడు. అక్కడ డానియల్ రూడ్‌గా బిహేవ్ చేసేతలికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తడు నాయక్. డానియల్ తెలివిగా తనకు తలతిరిగిపోతుందని, మందు తాగకపోతే పిచ్చెక్కుతదని యాక్టింగ్ చేసేతలికి, ఆ స్టేషన్‌లోనే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ అప్పటికే సీజ్ చేసిన ఒక మందు బాటిల్‌ని అక్కడ పెట్టి పోతుంది. నాయక్ సీల్ తీసి, గ్లాసులో మందు పోస్తంటే తెలివిగా దాన్ని తన సెల్‌ఫోన్‌ల తీస్తాడు డానియల్. ఇది నాయక్ గమనిచ్చుకోడు. డానియల్‌కు రెండు వారాలు రిమాండ్ పడుతుంది. బయటికొచ్చిన డానియల్ తాను సెల్‌ఫోన్ల తీసిన సీన్‌ని బయటపెట్టేస్తడు. దాంతో నాయక్ సస్పెండ్ అవుతడు. ఒంటి మీద యూనిఫామ్ తీసేసినంక నాయక్ విశ్వరూపం ఎట్ల ఉంటదో డానియల్‌కి మాత్రమే కాకుండా, అందరికీ తెలుస్తది. ఆ కతేందన్నది సిన్మాల చూస్తేనే మజాగా ఉంటది.
ఎనాలసిస్ :
భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ మధ్య చిన్నగా మొదలైన గొడవ.. పంతాలు పట్టింపులతో చిలికి చిలికి ఎట్లా తుఫానుగా మారిందో డైరెక్టర్ మనసులకి నచ్చేలా మస్తుగ తీసిండు డైరెక్టర్ సాగర్ చంద్ర. భీమ్లా నాయక్ క్యారెక్టర్‌ను మలిచిన తీరు కానీ, అతను చెప్పే డైలాగ్స్ కానీ మనకి అదరహో అనిపిస్తాయంతే. అదే కాదు, భీమ్లా భార్య సుగుణ క్యారెక్టర్ కూడా మనకి అంతే మంచిగ నచ్చుతది. నాయక్ భార్య అంటే అతనిలో సగమనుకుంటున్నారేమో, డబల్ అని ఆమె చెప్పే డైలాగ్‌కి చప్పట్లు పడతాయంతే. ఒంటిమీద పోలీస్ యూనిఫామ్ ఉన్నప్పుడు ఓర్పుగా బిహేవ్ చేసే భీమ్లా.. ఆ యూనిఫామ్ ఒంటి మీంచి దూరమయ్యాక డానియల్‌నీ, అతని మనుషుల్నీ ఉతికి ఆరేస్తంటే మన ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అట్లా ఆ సీన్లని రాసిండు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకు పెద్ద బలమని వేరే చెప్పాల్నా!
ఒరిజినల్ మలయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'తో పోలిస్తే, కొన్ని మార్పులు, చేర్పులు చేసి 'భీమ్లా నాయక్' స్క్రిప్లు రాసిండు త్రివిక్రమ్. అందులో ఎస్సై క్యారెక్టర్‌కు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లేదు. ఈ రీమేక్‌ల 'కొక్కిరి దేవర' అంటూ భీమ్లా నాయక్‌ను గిరిజనులంతా ఎందుకు కొలుస్తరో చెప్పే ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను రాసిండు త్రివిక్రమ్. అది చూస్తంటే, ఒళ్లు జలదరిస్తదంతే. ఆ ఎపిసోడ్‌కూ, క్లైమాక్స్ సీన్‌కూ లింక్ భలే కలిపిండు. దీంతో ఎమోషనల్‌గా కూడా క్లైమాక్స్ మనల్ని టచ్ చేస్తది.
'భీమ్లా నాయక్' అని టైటిల్ పెట్టారు కాబట్టి, హీరో పవన్ కల్యాణ్ కాబట్టి సినిమా అంతా ఆయనే కనిపిస్తరనీ, ఇంకెవ్వరూ కనిపించరనీ అనుకుంటే పొరపాటే. భీమ్లా క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్లో డానియల్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగే. సిన్మాల డానియల్ విలన్ కాదు, యాంటీ హీరో! అతనిలోనూ హీరోయిజం ఉంటది. దాన్ని కూడా మంచిగనే డైరెక్టర్, రైటర్ కలిసి ఎలివేట్ చేసిన్రు. ఒరిజినల్ మూవీల బిజూ మీనన్ రెండు చేతుల్తో ఛాతీ మీదుగా ఉడుంపట్టు పట్టితే పృథ్వీరాజ్ గిలగిలా కొట్టుకుంటడు. మన సిన్మాల దాన్ని మార్చేశారు. డానియల్ చేయిని పట్టుకొని, కాలుని ఆ చేయి భుజం మీద పెట్టి భీమ్లా ఒక్కసారిగా మెలితిప్పితే ప్రాణాలు పోతున్నట్లే విలవిల్లాడిపోతడు డానియల్. ఆ ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించారంటే ఆడియెన్స్‌కు పండగే అన్నట్లు సీన్లు తీసిండు డైరెక్టర్. భీమ్లా భార్య సుగుణ క్యారెక్టర్‌కు కూడా మంచి మంచి సీన్లు పడ్డాయి. మురళీశర్మ పోషించిన సీఐ ఎ. కోదండరామ్ క్యారెక్టర్ కూడా ఒరిజినల్ మూవీలోని క్యారెక్టర్‌తో పోలిస్తే మరింత ఎఫెక్టివ్‌గా వచ్చిందని చెప్పాలె.
తమన్ మ్యూజిక్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలె. పాటలన్నీ ఇప్పటికే హిట్టు. సిన్మాల వాటిని చూస్తంటే మరింత ఎమోషన్‌తో ఊగిపోతాం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే దంచి కొట్టిండు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ వండర్ఫుల్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ.. ఆయన కెమెరా వర్క్‌తోని అదరిపోయేట్లు వచ్చినయ్. నవీన్ నూలి ఎడిటింగ్ పర్ఫెక్టుగా ఉంది. ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ వర్క్ సూపర్.
నటీనటుల పనితీరు:- యాక్టర్ల పర్ఫార్మెన్సుల గురించి మాట్లాడుకోవాల్నంటే.. ఒకరు తక్కువా, ఒకరు ఎక్కువా కాదు అన్నట్లు ప్రతి ఒక్క ఆర్టిస్టూ తమ క్యారెక్టర్‌ను అర్థం చేసుకొని సూపర్బ్‌గా చేశారంతే. టైటిల్ రోల్‌ల పవన్ కల్యాణ్ ఇరగదీసిండు. అండర్‌ప్లే చేయాల్సిన చోట అండర్‌ప్లే చేస్తా, ఓవర్‌ప్లే చేయాల్సిన చోట ఓవర్‌ప్లే చేస్తా భీమ్లా నాయక్‌గా దున్నేసిండు. క్యారెక్టర్‌లోని ఎమోషన్స్‌ను గొప్పగ పండించిండు. ఇంతదాకా ఆయన చేసిన పర్ఫార్మెన్సుల్ల భీమ్లా పర్ఫార్మెన్స్ వేరే లెవల్ అబ్బా. డానియల్ శేఖర్‌గా రానా కూడా అదరగొట్టిండు. అతని పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ టాప్ క్లాస్‌ల ఉన్నయ్. ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సుల్లో ఇదొకటి. పవన్ కల్యాణ్‌కు సరైన అపోజిషన్ అన్నట్లు నటించిండు.
భీమ్లా వైఫ్ సుగుణ క్యారెక్టర్లో నిత్యా మీనన్ పర్ఫెక్టుగా కుదిరిపోయింది. ఆమెను ప్రేమించని ప్రేక్షకులుండరు. సీఐ కోదండరామ్ పాత్రలో మురళీశర్మ ఎప్పట్లా సూపర్ అన్నట్లు యాక్టింగ్ చేసిండు. డానియల్ తండ్రి ఎంపీ జీవన్ కుమార్‌గా సముద్రకని, రానా వైఫ్‌గా సంయుక్తా మీనన్, బార్ ఓనర్ నాగరాజుగా రావు రమేశ్, భీమ్లా కారు డ్రైవర్ బాలాజీగా రఘుబాబు, భీమ్లా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పరిచయం చేసే పాత్రలో ఎంఎస్ చౌదరి, హెడ్ కానిస్టేబుల్‌గా కాదంబరి కిరణ్, కానిస్టేబుల్‌గా నర్రా శ్రీను, పొలిటీషియన్‌గా తనికెళ్ల భరణి, లాయర్‌గా హర్షవర్ధన్, టీకొట్టు మనిషిగా పమ్మి సాయి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఒక పాటల సునీల్, సప్తగిరి, హైపర్ ఆది కనిపించిన్రు. క్లైమాక్స్‌లో మేజిస్ట్రేట్‌గా బ్రహ్మానందం మెరిసిండు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అన్నీ మంచిగ కుదరడంతో కామెడీ లేకపోయినా 'భీమ్లా నాయక్' మస్తుగ ఎంటర్‌టైన్ చేస్తా, బాక్సాఫీస్‌ను దున్నేయడం షురూ చేసిండు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ చూసేయండి, ఎంజాయ్ చేయండి.
- బుద్ధి యజ్ఞమూర్తి