English | Telugu

సినిమా పేరు:భారతీయుడు 2
బ్యానర్:Lyca Productions, Red Giant Movies
Rating:2.00
విడుదలయిన తేది:Jul 12, 2024

నటీనటులు: కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా, ప్రియ భవానీ శంకర్‌, వివేక్‌, గుల్షన్‌ గ్రోవర్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవివర్మన్‌
ఎడిటింగ్‌: ఎ.శ్రీకరప్రసాద్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
మాటలు: హనుమాన్‌ చౌదరి
నిర్మాతలు: సుభాస్కరన్‌, ఉదయనిధి స్టాలిన్‌
బ్యానర్స్‌: లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌
రచన, దర్శకత్వం: శంకర్‌
విడుదల తేదీ: 12.07.2024
సినిమా నిడివి: 150 నిమిషాలు

సామాజిక స్పృహ, యాంటీ కరప్షన్‌, సామాజిక బాధ్యత వంటి వాటికి కేరాఫ్‌ అడ్రస్‌గా డైరెక్టర్‌ శంకర్‌ని చెబుతారు. అతను చేసే సినిమాలన్నీ అలాంటి కథాంశంతోనే ఉంటూనే కమర్షియల్‌ అంశాలతో నిండి ఉంటాయి. అయితే గతంలో ఉన్న ఫైర్‌ శంకర్‌లో ఇప్పుడు లేదన్నది అతను గతంలో చేసిన కొన్ని సినిమాలు ప్రూవ్‌ చేశాయి. ట్రెండ్‌కి తగినట్టుగా సినిమాలు చేయడంలో శంకర్‌ పదేపదే విఫలమవుతున్నాడని ఆ సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది. అయితే తాజాగా ‘భారతీయుడు2’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 28 సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో కూడా లంచం అనే అంశాన్నే తీసుకున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘భారతీయుడు2’ ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? కాన్సెప్ట్‌ పాతదే అయినా అందులో కొత్తదనం ఏమైనా కనిపించిందా? ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

కథ : 

చిత్రా అరవింద్‌ (సిద్దార్థ్‌) అనే కుర్రాడు తన స్నేహితులతో కలిసి ఓ ట్యూబ్‌ ఛానల్‌ను రన్‌ చేస్తుంటాడు. సొసైటీలో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తాడు. ఆ వీడియోలను తన ఛానల్‌లో పోస్ట్‌ చేయడం ద్వారా వ్యూస్‌ సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అంతేకాదు, కొందరు అవినీతి పరులను తన యానిమేషన్‌తో సెటైరికల్‌గా విమర్శిస్తుంటాడు. ప్రభుత్వ అధికారులు బాధ్యత మరచిపోయి ప్రవర్తించడం, లంచాలు దండుకోవడం, సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం వంటి విషయాల పట్ల చిత్రతోపాటు అతని స్నేహితులు కూడా రగిలిపోతుంటారు. ఇలాంటి అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఇండియన్‌ వచ్చి వాటిని అడ్డుకున్నాడని చిత్ర గుర్తు చేస్తాడు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటాడు. అందుకే ‘కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను బాగా ట్రెండ్‌ చేస్తాడు. అది ప్రపంచమంతా పాకుతుంది. దాంతో ఇండియన్‌(కమల్‌ హాసన్‌) మళ్ళీ రంగంలోకి దిగుతాడు. గతంలో అక్రమార్కుల ఆట కట్టించిన సేనాపతి ఇప్పుడు ఆ అవకాశం యువత చేతికి ఇస్తాడు. దాన్ని ఎలా అమలు పరచాలనేది సోషల్‌ మీడియా ద్వారా చెబుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌ అంటూ ఆహ్వానించిన దేశంలోని యువత గో బ్యాక్‌ ఇండియన్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తారు. సేనాపతి ఇచ్చిన సందేశం వల్ల యువతకు కలిగిన నష్టం ఏమిటి? 

అన్యాయాలను అడ్డుకునే ప్రయత్నంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? సేనాపతి గోబ్యాక్‌ ఇండియన్‌ అని ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? ఈసారి అవినీతిని అంతం చేయడంలో భారతీయుడు ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేమిటి?  అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ :

1996లో కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ ఓ సంచలనం. సమాజంలో వున్న అవినీతిని కడిగేయడంలో కన్నకొడుకుని కూడా వదిలిపెట్టని తండ్రిగా సేనాపతి అందరి మనసుల్లో నిలిచిపోతాడు. 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నారనే న్యూస్‌ వచ్చినపుడు లంచం మీద మళ్ళీ సినిమా చేస్తే ఎవరు చూస్తారు అనే కామెంట్స్‌ వినిపించాయి. అయితే ఇప్పటి ట్రెండ్‌కి తగ్గినట్టుగా సినిమాను తీసి ఉంటారని అంతా భావించారు. కానీ, సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయినపుడే అందరికీ అర్థమైపోయింది. అలాంటి కథాంశాన్నే తీసుకొని బడ్జెట్‌ను భారీగా పెంచారు తప్ప కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ఇండియన్‌ మళ్ళీ వచ్చే అవసరం ఉంది అని చెప్పేందుకు చేసిన సీన్స్‌ అన్నీ ఆడియన్స్‌కి చిరాకు తెప్పించేవే. ఫస్ట్‌హాఫ్‌ మొత్తం అలాంటి సీన్స్‌తో నిండిపోయాయి. కొన్ని పాటల్లో, కొన్ని సీన్స్‌లో స్క్రీన్‌ మీద భారీతనం కనిపిస్తుంది తప్ప ప్రేక్షకుల మనసును తట్టిలేపే ఒక్క సీన్‌ కూడా సినిమాలో ఉండదు. సెకండాఫ్‌ కూడా అదే ప్యాట్రన్‌లో వెళుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అయితే చివరి 45 నిమిషాలు మాత్రం శంకర్‌ స్టైల్‌లో సినిమా నడుస్తోందేమో అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఈ సినిమా మూడో భాగం కూడా ఉందని చెబుతూ ఆ సినిమాకి సంబంధించి ఐదు నిమిషాల ట్రైలర్‌ను జోడిరచారు. ‘భారతీయుడు 3(వార్‌ మోడ్‌)’ పేరుతో వచ్చే ఏడాది ఆ సినిమా రాబోతోందని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈమధ్యకాలంలో సీక్వెల్స్‌ గొడవ ఎక్కువైపోయింది. సినిమాని చూసి ఎంజాయ్‌ చేద్దామని వచ్చే ఆడియన్స్‌ సహనానికి పరీక్షగా మారాయి ఈ సినిమాలు. అసలు విషయాన్ని సెకండ్‌ పార్ట్‌లో చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్‌ పార్ట్‌ని అనవసరమైన సీన్స్‌, చెత్తా చెదారంతో నింపేస్తున్నారు. రెండు పార్టులుగా చేస్తే పెట్టిన పెట్టుబడిని ఈజీగా లాగెయ్యవచ్చు అనే కాన్సెప్ట్‌ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ సీక్వెల్స్‌ వెంటపడుతున్నారు. 

నటీనటులు : 

ఈ సినిమాలో నటీనటులకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. సినిమాలోనూ ఏ క్యారెక్టరూ చెప్పుకోదగ్గదిగా లేదు. అయితే సేనాపతిగా కమల్‌హాసన్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే చిత్రా అరవింద్‌ క్యారెక్టర్‌లో సిద్ధార్థ్‌  సెట్‌ అయ్యాడు. సినిమాలోని మిగతా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం గ్లామర్‌ ఉండాలన్న ఉద్దేశంతో రకుల్‌ ప్రీత్‌ని సినిమాలో పెట్టారే తప్ప ఆ క్యారెక్టర్‌కి తగిన ప్రాధాన్యం లేదు. 

సాంకేతిక నిపుణులు :

టెక్నికల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో ఆకట్టుకునేది ఫోటోగ్రఫీ, రెండు పాటల కొరియోగ్రఫీ, ఆర్ట్‌ డైరెక్షన్‌, స్టంట్‌ కొరియోగ్రఫీ. రవివర్మన్‌ చక్కని ఫోటోగ్రఫీ అందించారు. మోడల్స్‌తో కూడిన ఓ పాట, భారతీయుడ్ని ఎస్టాబ్లిష్‌ చేస్తూ యూత్‌ పాడే పాట కొరియోగ్రఫీగానీ, బ్యాక్‌గ్రౌండ్‌గానీ బాగా సెట్‌ అయ్యాయి. అలాగే సినిమాలోని ఆర్ట్‌ వర్క్‌ అంతా ఎంతో రిచ్‌గా కనిపించింది. ఇక సినిమాలో యాక్షన్‌ సీన్స్‌కి కొదవ లేదు. వాటన్నింటినీ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ఐదుగురు ఫైట్‌మాస్టర్స్‌ పనిచేయడం విశేషం. ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. ఒకవిధంగా ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఎడిట్‌ చేసెయ్యొచ్చు అనిపిస్తుంది. చూసిన సీన్సే మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అన్నింటినీ మించి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. దానికి తగిన బ్యాక్‌గ్రౌండ్‌ లొకేషన్‌ కూడా ఎంతో గ్రాండియర్‌గా చూపించారు. భారతీయుడు చిత్రం అప్పట్లో పెద్ద మ్యూజికల్‌ హిట్‌. ఇప్పటికీ ఆ పాటల్ని వింటున్నారంటే రెహమాన్‌ ఎలాంటి మ్యూజిక్‌ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. భారతీయుడు2 దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అనిరుధ్‌ మంచి మ్యూజిక్‌ ఇవ్వడంలో విఫలమయ్యాడు. సినిమాలోని ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా పేలవంగా ఉంది. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌ అని పిలిపించుకొని తలనొప్పి తెచ్చుకున్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలుగుతుంది. భారతీయుడు చూసిన కళ్లతో భారతీయుడు 2ని చూడలేం. ఆ సినిమాలో థ్రిల్‌ చేసే అంశాలతోపాటు కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. కానీ, ఈ సినిమాలో అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఎన్ని సీన్స్‌ చూపించినా ఎక్కడా ఆడియన్స్‌ దానికి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వరు. మనం సినిమా చూస్తున్నామనే భావనే కలుగుతుంది తప్ప ఎలాంటి ఫీలింగ్‌ రాదు. ఒకప్పటి శంకర్‌ ఈ సినిమాలో కనిపించలేదు. అందుకే ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వారు కమ్‌ బ్యాక్‌ శంకర్‌ అంటున్నారు. అలాగే ఈ ఇండియన్‌ని మేం చూడలేకపోతున్నాం గో బ్యాక్‌ ఇండియన్‌ అని కూడా అంటున్నారు. 

 

- జి.హరా

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25