Read more!

English | Telugu

సినిమా పేరు:భారతీయన్స్
బ్యానర్:భారత్ అమెరికన్ క్రియేషన్స్
Rating:1.50
విడుదలయిన తేది:Jul 13, 2023

సినిమా పేరు: భార‌తీయ‌న్స్
తారాగణం: నీరోజ్ పుచ్చా, సుభా రంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్
సంగీతం: సత్య కశ్యప్, కపిల్ కుమార్
సినిమాటోగ్రాఫర్: జయపాల్ రెడ్డి నిమ్మల
ఎడిటర్: శివ సర్వాణి
రచన, దర్శకత్వం: దీన రాజ్
నిర్మాత: శంకర్ నాయుడు అడుసుమిల్లి
బ్యానర్: భారత్ అమెరికన్ క్రియేషన్స్
విడుదల తేదీ: జూలై 14, 2023 

దేశభక్తి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. ఆ బాటలో పయనిస్తూ దేశభక్తి కథతో తెలుగు, హిందీ భాషల్లో ద్విబాషాచిత్రంగా రూపొందిన సినిమా 'భారతీయన్స్'. భారత్ పై చైనా దురాగతాలను వెల్లడిస్తూ రూపొందిన ఈ సినిమాలో చైనా అనే మాటను మ్యూట్ చేయాలని సెన్సార్ అభ్యంతరం తెలపడంతో ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. పైగా 'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా', 'కలిసుందాం రా' వంటి పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా వ్యవహరించిన దీన రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా దీన రాజ్ కి శుభారంభాన్ని ఇచ్చిందా?...

కథ:
భారతదేశంలోని ఆరు ప్రాంత్రాలకు చెందిన ఆరుగురి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందులో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉంటారు. ఆయా భాషల పేర్లతోనే ఆ పాత్రలు మనకు పరిచయమవుతాయి. అందులో తెలుగు, భోజ్ పురి, నేపాలి(సిక్కిం), పంజాబీ, బెంగాలీ, త్రిపుర పాత్రలు ఉంటాయి. వీరికి దేశభక్తి ఎక్కువ. అయితే ఈ ఆరుగురిని వేరు వేరు సమస్యలు చుట్టుముడతాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారికి అజ్ఞాతల వ్యక్తుల నుంచి పిలుపు వస్తుంది. మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, మీ కుటుంబానికి అండగా నిలుస్తామని, కానీ దానికోసం మీరొక పని చేయాల్సి ఉంటుందని చెప్తారు. మీ దేశభక్తే మిమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిందని, ఆ దేశభక్తితోనే ఒక సీక్రెట్ మిషన్ కోసం మీరు బోర్డర్ దాటి చైనాలోకి ప్రవేశించాల్సి ఉంటుందని చెప్తారు. అసలు ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? వారు అప్పగించిన సీక్రెట్ మిషన్ ఏంటి? ఆ మిషన్ కోసం ఆ ఆరుగురినే ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి? ఆ ఆరుగురికి ఉన్న సమస్యలేంటి, వాటి నుంచి వారు బయటపడగలిగారా? వారికి అప్పగించిన సీక్రెట్ మిషన్ ని వియవంతంగా పూర్తి చేయగలిగారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

ఒక రచయిత దర్శకుడిగా మారాలనుకున్నప్పుడు తాను ఏ జోనర్ లో బాగా రాయగలరో, ఆ జోనర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని అనుకుంటారు. ఎన్నో విజయవంతమైన ప్రేమకథా చిత్రాలకు కథలు అందించిన సీనియర్ రచయిత దీన రాజ్ మాత్రం దానికి భిన్నంగా దేశభక్తితో కూడిన ఓ యాక్షన్ సినిమాతో దర్శకుడిగా మారారు. విభిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావాలనుకున్న ఆయన ఆలోచన బాగున్నా, కథాకథనాల్లో గానీ, మేకింగ్ లో గానీ ఆయన సీనియారిటీ ఎక్కడా కనిపించలేదు. ఏమాత్రం అనుభవం లేని, కథాకథనాలపై పెద్దగా పట్టులేని, విభాగాలపై అవగాహన లేని ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా ఉంది.

ఒకరికొకరు అసలు పరిచయంలేని ఆరుగురు అపరిచితులు, చేతికి కాషాయ రుమాలు కట్టుకొని తమని పిలిపించిన అజ్ఞాత వ్యక్తులను కలవడం కోసం సిక్కింలోని బుద్ధ పార్క్ వద్ద ఎదురుచూసే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సినిమాలోని పాత్రధారులకే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాదు. ఆ ఆరుగురికి ఆర్మీ ట్రైనింగ్ తరహాలో శిక్షణ ఇస్తారు. అసలు ఆ ట్రైనింగ్ దేనికో కూడా తెలియకుండానే వారు శిక్షణ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఆ ఆరుగురు ఎవరు? వారు అక్కడికి ఎలా వచ్చారు? అనే విషయాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటాయి. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడంతో ప్రథమార్థం విసిగించేలా సాగింది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక ట్విస్ట్.. అప్పటికే విసుగుచెందిన ప్రేక్షకులకు కాస్త ఊరటను అయితే ఇస్తుందే కానీ, ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వదు. 

ఒక సీక్రెట్ మిషన్ మీద బోర్డర్ దాటి, శత్రు దేశంలోకి రహస్యంగా ప్రవేశించాలంటే సన్నివేశాలు ఎంత ఉత్కంఠకరంగా సాగాలి?. కానీ ఆ ఉత్కంఠత ఈ సినిమాలో కనిపించదు. క్రికెట్ ఆడుతుంటే పక్కింట్లో బాల్ పడితే దొంగచాటుగా గోడదూకి వెళ్లి తెచ్చుకున్నంత తేలికగా, శత్రు దేశంలోకి ప్రవేశిస్తారు. అక్కడ హాస్యసన్నివేశాలు లేనప్పటికీ మనకి నవ్వొస్తుంది అంటే, ఆ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ దేశభక్తి సినిమా చూసేటప్పుడు మనం రోమాలు నిక్కబోడుచుకునే సన్నివేశాలు ఆశిస్తాం. కానీ ఇందులో సన్నివేశాలు, సంభాషణలు, నటీనటుల హావభావాలు అన్నీ కూడా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. సినిమా మొత్తంలో ఒక రెండు ట్విస్ట్ లు మాత్రమే కాస్త అలరిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ సర్ ప్రైజ్ లా ఉంటుంది. ఆ సమయంలోనే ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అదే తంతు. సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనుకునేలా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

అందరిలా కాకుండా, ఒక దేశభక్తి సినిమా చేయాలన్న ప్రయత్నం మంచిదే.. కానీ ఆ ప్రయత్నానికి తగిన శోధన, నైపుణ్యత తోడవ్వాలి. అప్పుడే ప్రేక్షకులు సెల్యూట్ కొడతారు. కొన్ని కథలు పేపర్ మీద బాగానే ఉంటాయి కానీ వాటిని తెరమీదకు తీసుకురావాలంటే అన్ని విభాగాల సమిష్టి కృషి అవసరం. కానీ ఈ సినిమా విషయంలో దాదాపు అన్ని విభాగాలు విఫలయమయ్యాయి. రచయితగా దీన రాజ్ అంతోఇంతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ, దర్శకుడిగా మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. జయపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమాని కొన్ని మంచి లొకేషన్స్ లో చిత్రీకరించినప్పటికీ, జయపాల్ రెడ్డి తన కెమెరా పనితనంతో ఆకట్టుకోలేకపోయారు. నటీనటుల సంభాషణలు, హావభావాలు బంధించే క్రమంలో ఆయన పెట్టిన కొన్ని ఫ్రేమ్ లు మనం నిజంగా సినిమానే చూస్తున్నామా అనే సందేహాన్ని కలిగించేలా ఉన్నాయి. ఉన్నంతలో అంతోఇంతో ఆసక్తికరంగా సినిమాని ప్రజెంట్ చేయడంలో ఎడిటర్ శివ సర్వాణి కూడా ఫెయిల్ అయ్యారు. ద్వితియార్థం నిడివిని కూడా కుదించాల్సింది. సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతం కూడా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం దారుణంగా నిరాశపరిచింది.

నటీనటులు పనితీరు:

దర్శకుడు అలాంటి నటనను రాబట్టుకున్నాడో లేక, వారి నటన శైలే అలాంటిదో తెలీదు కానీ.. ఒకరిద్దరు తప్ప దాదాపు నటీనటులంతా అవసరానికి మించిన హావభావాలు, అరుపులతో నటించారు. చాలా సన్నివేశాలు అలాంటి నటన కారణంగానే ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఓ దేశభక్తి సినిమా అంటే మనం రోమాలు నిక్కబోడుచుకునే సన్నివేశాలు ఆశిస్తాం. కానీ ఇందులో సన్నివేశాలు, సంభాషణలు, నటీనటుల హావభావాలు అన్నీ కూడా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. దర్శకుడిగా మారిన ఒక సీనియర్ రచయిత నుంచి ఇలాంటి అవుట్ పుట్ వస్తుందని ఏమాత్రం ఊహించలేం.

-గంగసాని