English | Telugu

సినిమా పేరు:భజే వాయు వేగం
బ్యానర్:యూవీ కాన్సెప్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:May 31, 2024

సినిమా పేరు: భజే వాయు వేగం 
తారాగణం: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రవి శంకర్, తనికెళ్ళ భరణి ,రాహుల్ హరిదాస్, శరత్ లోహితస్వ, పృథ్వీరాజ్ తదితరులు 
రచన, దర్శకత్వం : ప్రశాంత్ రెడ్డి 
సంగీతం : రాధాన్
బ్యానర్  : యువి క్రియేషన్స్ 
నిర్మాతలు: వంశీ ,ప్రమోద్ మరియు అజయ్ కుమార్ రాజు  
సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్  
విడుదల తేదీ: మే  31 , 2024 

 

ఆర్ఎక్స్ 100 తో యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన హీరో కార్తికేయ. గత కొంతకాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.  లేటెస్ట్ గా  భజే వాయువేగం అంటు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా యు వి క్రియేషన్స్ లాంటి అగ్ర సంస్థ నిర్మించడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం

 

కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన  వెంకట్ (కార్తికేయ) చిన్నపటినుంచి పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటాడు. అందుకు తగ్గ అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. అనుకోకుండా  తండ్రి రాజయ్య (తనికెళ్ళ భరణి) అనారోగ్యం బారిన పడటంతో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. ఇంకో పక్క రౌడీ స్థాయి నుంచి హైదరాబాద్ నగరానికి మేయర్ అయిన  జార్జ్ (శరత్ ) అతని తమ్ముడు డేవిడ్ (రవిశంకర్) లు వెంకట్ ని చంపటానికి తిరుగుతుంటారు. పైగా  వెంకట్ మీద డ్రగ్స్  డీలర్ అనే ముద్రతో పాటు హత్య కేసు కూడా పడుతుంది.దీంతో వెంకట్ కోసం  పోలీసులు వెతుకుతుంటారు.   వెంకట్ కి జార్జ్, డేవిడ్ లకి సంబంధం ఏంటి? డ్రగ్స్ కేసు మర్డర్ కేసు వెనుక ఉన్న కథ ఏంటి? అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డాడు? చివరకి తన తండ్రి ఆపరేషన్ చేయించాడా? అనేదే ఈ కథ.

 


ఎనాలసిస్ :

ఈ కథలో కొత్త దనం ఏముందని కార్తికేయ ఒప్పుకున్నాడో  గాని  సినిమా స్టార్ట్ అయిన అరగంటకే మనకి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అవసరం లేకపోయినా తండ్రి కొడుకుల మధ్య కొంచం ఎక్కువ కథని నడిపాడు. ఎంతసేపు ఆపరేషన్ కోసం డబ్బులని చెప్పించారు. అలా కాకుండా క్రికెటర్ అయిన హీరోకి క్రికెట్ లో అత్యునత స్థాయికి చేరుకోవాలంటే వచ్చే అడ్డంకులు గురించి చెప్పాల్సింది.పైగా హీరో కి క్రికెట్ మీద  బెట్టింగ్ లు వేసే  అలవాటు ఉందని చెప్పారు. కాబట్టి ఆ అంశం చుట్టూ  క్రికెట్ చుట్టు ఫస్ట్ హాఫ్ కథ అల్లుకుంటే బాగుండేది. హీరోయిన్ ని కూడా అందులో లింక్ చేస్తే బాగుండేది. హీరో మొదటి నుంచి కూడా డల్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక సెకండ్ హాఫ్ ని చూసుకుంటే హీరోకి విలన్ కి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ తేలిపోయాయి. అన్యాయంగా తన మీద కేసులు పడుతుంటే వీర తాండవం చేయాల్సిన హీరో కామన్ మాన్ లా  మాములుగా ఉంటాడు. అలా కాకుండా  హీరో అనే పదానికి అర్ధం వచ్చేలా చేసుంటే బాగుండేది. పైగా ఎంత పేద వాళ్ళైనా ఈ రోజులో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అలాంటిది హీరో మాములు ఫోన్ వాడటం పెద్ద విచిత్రం. పైగా ఫోన్  మాట్లాడంలోనే సెకండ్ హాఫ్ సగం నడిచింది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
కార్తికేయ పెర్ఫార్మన్స్  విషయానికి వస్తే  పెద్దగా నటనకి అవకాశం లేకుండా పోయింది. సెంటిమెంట్ సీన్స్ లో బాగా చేసినా కూడా సబ్జెక్టు వీక్ గా ఉండటం వలన తేలిపోయింది. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవాలిసిన  పని లేదు. కార్తికేయ తమ్ముడు గా చేసిన రాహుల్ చక్కగానే చేసాడు. ఇక తనికెళ్ల భరణి  రాజయ్య క్యారక్టర్ లో జీవించాడు.అలాంటి పెర్ ఫార్మ్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. విలన్ గా చేసిన రవిశంకర్ ది రొటీన్ నటనే. మేయర్ గా చేసిన శరత్ లోహితస్వ రూపంలో తెలుగు తెరకి ఇంకో చక్కని విలన్ దొరికాడు.

సాంకేతిక నిపుణల విషయానికి వస్తే ఆర్ ఆర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్ లో ఓపిగ్గా కుర్చున్నామంటే  ఆయన వల్లే. ఇక దర్శకుడు విషయానికి వస్తే  కొత్త దర్శకుడు  ఎవరైనా ఒక వెరైటీ కథ తో తెరంగ్రేటం చేస్తాడు. కానీ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథ తో వచ్చాడు. అతని టేకింగ్ బాగానే ఉన్న  స్క్రీన్ ప్లే  మాత్రం రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంతంత మాత్రమే.

 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే మరోసారి కార్తికేయ ని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగా అర్ధం తెలియలేదు. 2024 లో ప్రేక్షకాదరణ కష్టమే.

- అరుణాచలం