ఇది మన ప్రియతమ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి,దివంగతనేత,స్వర్గీయ డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర.రాజశేఖర్ రెడ్డి కుటుంబ నేపథ్యం,ఆయన పుట్టినప్పుడు బాగా కరువుతో అల్లాడిపోతున్న రాయల సీమలో బ్రహ్మాండంగా,ఆ కరువు తీరేలా వర్షాలు పడ్డాయని మొదలుపెట్టి,ఆయన డాక్టర్ కావటం,ఒకరూపాయకే పేదప్రజలకు వైద్యసేవలనందించటం,ఆయన వివాహం,పిల్లలు,ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం,ఆయన రాజకీయ జీవితం గురించిన పూర్తి సమాచారాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ గా చూపించారు ఈ చిత్రంలో.ఇక ఇంతకంటే వేరే కథంటూ ఇంకేంలేదీ చిత్రంలో.
ఎనాలసిస్ :
ఈ చిత్ర నిర్మాత,దర్శకుడు అయిన గిరిరెడ్డికి డాక్టర్ వై.యస్.ఆర్.ఉన్న అపారమైన ప్రేమ,భక్తి వల్లే ఈ చిత్రాన్నితీయగలిగాడు గాని, ఆయనకు నిజానికి సినీ పరిశ్రమలో అణుమాత్రం కూడా అనుభవం లేకపోవటం గమనార్హం.తన మేధస్సు అనుమతించిన పరిధిలో ఈ చిత్రాన్ని బాగా తీయటానికి శాయశక్తులా ప్రయత్నించాడు అందులో కొంతలో కొంతవరకూ సఫలీకృతుడయ్యాడయ్యాడనే చెప్పాలి.ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డివి కొన్ని వాస్తవ దృశ్యాలను కూడా జోడించారు.వాటి ప్రభావం ఈ చిత్రం చూసే ప్రేక్షకుడి మీద కొద్దో గొప్పో ఉంటుందనటంలో సందేహం లేదు.ఇక నటీనటులు రాజశేఖర్ రెడ్డిగా నటించిన సినియర్ నటులు వినోద్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి.అలాగే నటి యమున కూడా.వీళ్ళిద్దరూ కలసి నటించి సుమారు ఓ ఇరవై యేళ్ళయ్యుంటుంది.మిగిలిన వారిలో ఒక పాటలో సుత్తివేలు నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
సంగీతం- ఈ చిత్రంలోని సంగీతంలో ఒక గొప్పదనం ఉంది.కొత్తదనం ఉండకపోవటంతో పాటు సంప్రదాయ జానపద బాణీలతో ఈ చిత్రంలోని సంగీతం సాగుతుంది.దాదాపు పాటలన్నీ బాగున్నాయనే చెప్పాలి.రీ-రికార్డింగ్ కూడా ఫరవాలేదు.
కెమెరా - ఈ సినిమాని బాగా చూపించటంలో కేమేరా పనితనం బాగుంది.పాటల్లోనే ఇంకాస్త మెరుగ్గా ఉంది.
మాటలు - యావరేజ్ గా ఉన్నాయి.
పాటలు -పాటల్లోని సాహిత్యం మాస్ కి బాగా నచ్చే విధంగా ఉంది.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - ఫరవాలేదు.
కొరియోగ్రఫీ - ఈ చిత్రానికి ఏ స్థాయిలో కావాలో ఆ స్థాయిలో కోరియోగ్రఫీ ఉంది.
యాక్షన్ - ఫరవాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది ఖచ్చితంగా స్వర్గీయ,డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అభిమానుల కోసం తీసిన చిత్రం.మీరు గనుక ఆయన అభిమానులైతే ఈ చిత్రాన్ని తప్పక చూడండి.