Read more!

English | Telugu

సినిమా పేరు:భగవంత్ కేసరి
బ్యానర్:షైన్ స్క్రీన్స్
Rating:3.00
విడుదలయిన తేది:Oct 19, 2023

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌, ప్రియాంక జవల్కర్‌, శరత్‌కుమార్‌, రఘుబాబు, జాన్‌ విజయ్‌ తదితరులు
సంగీతం: థమన్‌ ఎస్‌.
సినిమాటోగ్రఫీ: సి.రాంస్రసాద్‌
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఫైట్స్‌: వెంకట్‌
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది
బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌
రచన: దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
విడుదల తేదీ: 19.10.2023
సినిమా నిడివి: 164.30 నిమిషాలు

 

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ చేసే ప్రతి సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులో అతని క్యారెక్టర్‌ ఎంతో ఫెరోషియస్‌గా ఉంటుంది. అతని సినిమాల్లో హీరోయిజం వేరే లెవల్‌లో ఉంటుంది. బాలయ్య నోటి నుంచి డైలాగ్‌ వచ్చినా, యాక్షన్‌ సీక్వెన్స్‌లలో తొడకొట్టినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఫ్యాన్స్‌ హంగామా చేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో వైవిధ్యం ఉండాలని కోరుకునే బాలకృష్ణ ఈసారి తను చేసే సినిమా దర్శకుడు విభిన్నంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా ఎంచుకున్నారు. ఇప్పటివరకు అనిల్‌ రావిపూడి బాలకృష్ణ వంటి పవర్‌ఫుల్‌ హీరోతో సినిమా చేసింది లేదు. యాక్షన్‌ కామెడీ మిక్స్‌ చేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా సినిమాలు చేస్తూ వస్తున్న అనిల్‌ రావిపూడి ఈసారి నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్‌ఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ సబ్జెక్ట్‌తో ‘భగవంత్‌ కేసరి’ అనే ఒక డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చారు. మరి ఈ సినిమాలో బాలకృష్ణను కొత్తగా చూపించడంలో అనిల్‌ రావిపూడి ఎంత వరకు సక్సెస్‌ అయ్యాడు? ఈ దసరాకి బాలయ్య ఫ్యాన్స్‌కి ఏ రేంజ్‌ హిట్‌ అందించాడు అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
భగవంత్‌ కేసరి(నందమూరి బాలకృష్ణ) ఒక మాజీ ఖైదీ. అతను జైల్‌లో ఉన్నప్పుడు కొన్ని అరాచకశక్తుల నుంచి ఒక పెద్ద బిజినెస్‌ మేన్‌ కాపాడడంలో జైలర్‌(శరత్‌కుమార్‌)కి సాయపడతాడు. దాంతో భగవంత్‌ కేసరి, జైలర్‌ మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. జైలర్‌ కూతురైన విజ్జిపాపతో భగవంత్‌కి అనుబంధం ఏర్పడుతుంది. అడవిబిడ్డ అయిన భగవంత్‌ కేసరిని కొన ఊపిరితో ఉన్న తల్లి చూడాలనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న భగవంత్‌ తన తల్లిని కడసారి చూసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జైలర్‌ని కోరతాడు. నిబంధనలను పక్కన పెట్టి భగవంత్‌ని అడవికి తీసుకెళ్ళి తల్లిని కలిసేలా చేస్తాడు జైలర్‌. భగవంత్‌ చేతుల్లోనే అతని తల్లి ప్రాణాలు విడుస్తుంది. జైలు నిబంధనలను అతిక్రమించి ఒక ఖైదీని బయటకు తీసుకెళ్ళినందుకు జైలర్‌ను సస్పెండ్‌ చేస్తారు. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్‌లో జైలర్‌ ప్రాణాలు కోల్పోతాడు. కొన ఊపిరితో ఉన్న జైలర్‌ తన కూతుర్ని ఆర్మీ ఆఫీసర్‌ని చెయ్యాలన్నదే తన లక్ష్యమని భగవంత్‌కి తెలిసేలా చేస్తాడు. జైలర్‌ చనిపోయిన తర్వాత విజ్జిపాప(శ్రీలీల) బాధ్యతను భగవంత్‌ తీసుకుంటాడు. అతని లక్ష్యం విజ్జిపాపను ఆర్మీలో చేర్పించాలి. ఇదిలా జరుగుతుండగా విలన్‌ రాహుల్‌ సాంఘ్వి(అర్జున్‌ రాంపాల్‌) లైన్‌లోకి వస్తాడు. ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయని అప్పుడే రివీల్‌ అవుతుంది. అసలు భగవంత్‌ జైలు నుంచి వచ్చింది రాహుల్‌ సాంఫ్వీుని చంపేందుకేనని అప్పుడు రివీల్‌ అవుతుంది. అసలు భగవంత్‌ కేసరికి, రాహుల్‌ సాంఫ్వీుకి మధ్య ఉన్న విరోధం ఎలాంటిది? భగవంత్‌ కేసరికి రాహుల్‌ చేసిన అన్యాయం ఏమిటి? రాహుల్‌ని భగవంత్‌ ఎందుకు చంపాలనుకున్నాడు? విజ్జిపాపను ఆర్మీ ఆఫీసర్‌ను చెయ్యాలన్న జైలర్‌ కోరికను భగవంత్‌ నెరవేర్చగలిగాడా? ఆ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? చివరికి భగవంత్‌ కేసరి తన లక్ష్యాలను చేరుకోగలిగాడా? అనేది మిగతా కథ. 


ఎనాలసిస్ :

సాధారణంగా బాలకృష్ణ సినిమాల్లో ఉండే గర్జనలు, ఫెరోషియస్‌ డైలాగులు ఈ సినిమాలో ఉండవు. అలాగే అనిల్‌ రావిపూడి సినిమాల్లోని కామెడీ ట్రాక్స్‌, పంచ్‌లు ఈ సినిమాలో ఉండవు. అంటే ఈ ఇద్దరూ తమ మార్క్‌ను పక్కన పెట్టి ఒక కొత్త సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. రొటీన్‌కి భిన్నంగా ఉండే ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ని బాలకృష్ణ కోసం తయారు చేశాడు అనిల్‌ రావిపూడి. బాడీ లాంగ్వేజ్‌ నుంచి డైలాగ్‌ డెలివరీ వరకు ప్రతి విషయంలోనూ కేర్‌ తీసుకున్నాడు. ఈ సినిమాలో మొదటి సారి బాలకృష్ణ తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్‌ చెప్పారు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ బాగా పేలాయి. ఇక డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కథను చెప్పిన విధానం బాగుంది. విలన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరిన హీరో అనుకోకుండా ఒక చిన్న పాపకు గార్డియన్‌గా ఉండాల్సి రావడం, ఆమె తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు తన పగను కూడా పక్కన పెట్టడం.. ఈ తరహా కథలు ఇంతకుముందు చాలా వచ్చాయి. అయితే అలాంటి పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు అనిల్‌ రావిపూడి. సినిమా ప్రారంభంలో విలన్‌ వల్ల భయభ్రాంతులైన ఒక జడ్జి ఫ్యామిలీకి భగవంత్‌ కేసరి కథను చెప్పడం మొదలు పెడతాడు రవిశంకర్‌. అలా పార్టులు పార్టులుగా కథను ముందుకు నడిపించాడు అనిల్‌. ఫస్ట్‌హాఫ్‌ అంతా బాలకృష్ణ, శ్రీలీల మధ్య జరిగే కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, మధ్య మధ్యలో బాలకృష్ణను లవ్‌లో దింపేందుకు కాజల్‌ అగర్వాల్‌ చేసే ప్రయత్నాలు, అక్కడక్కడ బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే సన్నివేశాలు.. ఇలా నడుస్తుంది ప్రీ ఇంటర్వెల్‌కి హీరోకి, విలన్‌కి మధ్య జరిగిన అసలు కథ రివీల్‌ చేసేందుకు లీడ్‌ తీసుకున్నాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా హీరో, విలన్‌ ఒకరినొకరు ఎలా చంపుకోవాలి అనే దానిపైనే కథ నడుస్తుంటుంది. మధ్యలో శ్రీలీల ఆర్మీ ట్రైనింగ్‌కి సంబంధించిన సీన్స్‌ వస్తాయి. చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ ఈమధ్య వార్తలు బాగా వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు బాలకృష్ణ ఒక స్కూల్‌లో చెప్పిన మూడు విషయాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సన్నివేశంలో చిన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మంచి మెసేజ్‌ ఇచ్చాడు అనిల్‌ రావిపూడి. బాలకృష్ణ అంటేనే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండాల్సిందే. వాటిని ఏమాత్రం తక్కువ చేయకుండా సినిమాలో చాలా చోట్ల జొప్పించారు. అలాగే ఒక బస్‌ ఫైట్‌ను తన స్టైల్‌లో చేసి అందర్నీ నవ్వించాడు అనిల్‌ రావిపూడి. ఎన్‌.టి.రామారావు హిట్‌ సాంగ్‌ ‘కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు..’ పాటతో కామెడీగా ఫైట్‌ను చిత్రీకరించారు. చాలా కాలం తర్వాత బాలకృష్ణ చేసిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా అకట్టుకునేలా ఉంది. హీరో బాలకృష్ణ, దర్శకుడు అనిల్‌ రావిపూడి మంచి అండర్‌స్టాండింగ్ తో సినిమాను చేశారు. 

నటీనటులు: 
ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఒక విధంగా చెప్పాలంటే ఇది వన్‌ మ్యాన్‌ షో. ప్రతి సీన్‌ను తన నటనతో రక్తి కట్టించాడు బాలకృష్ణ. తెలంగాణ స్లాంగ్‌ చెప్పిన డైలాగ్స్‌ నవ్వులు పూయించాయి. సెంటిమెంట్‌ సీన్స్‌లో, ఎమోషనల్‌ సీన్స్‌లో, ఫైట్‌ సీక్వెన్స్‌లలో బాలకృష్ణ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. విజ్జిపాపగా శ్రీలీల పాత్రకు న్యాయం చేసింది. ఈ క్యారెక్టర్‌కి శ్రీలీలే యాప్ట్‌ అనేంతగా పాత్రలో లీనమైపోయి నటించింది. ఇక కాజల్‌ అగర్వాల్‌ క్యారెక్టర్‌కు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఒక రొటీన్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌. నటనకు ఏమాత్రం ఆస్కారం లేని పాత్ర. అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా కొత్తగా కనిపించినా, బాలకృష్ణ గత చిత్రాలతో పోలిస్తే అంత పవర్‌ఫుల్‌ విలన్‌ అనిపించలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు:
టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ సి.రాంప్రసాద్‌ గురించి. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించడంలో ఫుల్‌ సక్సెస్‌ అయ్యాడు. సినిమాకి సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్‌ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ ప్రతి ఫైట్‌ను ఎంతో రిస్క్‌ తీసుకొని చేసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో జైలు ఫైట్‌ను ఎంతో అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత వచ్చే ఫైట్స్‌ రెగ్యులర్‌గా మనం సినిమాల్లో చూసే ఫైట్సే. ఇక సంగీతం గురించి చెప్పాలంటే థమన్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగా చేశాడు. అతని బిజిఎం సినిమాకి ఒక గ్రాండ్‌ లుక్‌ని తీసుకొచ్చింది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి చెప్పాలంటే.. బాలకృష్ణను కొత్తగా చూపించే ప్రయత్నంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండిరగ్‌ వరకు కథను నడిపించిన తీరు కూడా బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

బాలకృష్ణ అభిమానులకు ‘భగవంత్‌ కేసరి’ ఒక పండగనే చెప్పాలి. తమ అభిమాన హీరో ఈ సినిమాలో ఒక కొత్త లుక్‌లో కనిపించడం, ఫస్ట్‌టైమ్‌ తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్‌ చెప్పడం వంటివి వారికి మంచి కిక్‌ ఇచ్చే అంశాలు. బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి సినిమాలకు భిన్నంగా ఇద్దరూ కలిసి ఒక కొత్త మార్క్‌తో క్రియేట్‌ చేసిన ‘భగవంత్‌ కేసరి’ ప్రేక్షకుల్ని హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ దసరాకి నందమూరి అభిమానులకు ‘భగవంత్‌ కేసరి’ పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- జి.హరా