English | Telugu
బ్యానర్:లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 25, 2023
సినిమా పేరు: బెదురులంక 2012
నటీనటులు: కార్తికేయ, నేహాశెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, రాంప్రసాద్,
వెన్నెల కిశోర్, సత్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ఎల్.బి.శ్రీరామ్, దివ్య నార్ని తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సాయికుమార్ ఉమ్మడిసింగు, సన్ని కూరపాటి
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గారావు గుండా
కో`ప్రొడ్యూసర్స్: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నాల
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని(బెన్నీ)
బేనర్: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్లాక్స్
విడుదల తేదీ: 25 ఆగస్టు, 2023
సినిమా నిడివి: 148 నిమిషాలు(2 గంటల 28 నిమిషాలు)
ఆర్‌ఎక్స్ 100 వంటి సంచలన చిత్రంతో యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత ఓ అరడజను సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అవేవీ అతనికి ప్లస్ అవ్వలేదు. అయినా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘బెదురులంక 2012’ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు కార్తికేయ. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఏమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? కార్తికేయకు సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
2012 సంవత్సరం డిసెంబర్ 21న యుగాంతం రాబోతోందని, ప్రపంచమంతా నాశనమవుతుందనే వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. దాన్ని కథాంశంగా తీసుకొని దాని చుట్టూ కథని అల్లుకున్నాడు దర్శకుడు క్లాక్స్. యుగాంతం అనే విషయాన్ని ఆసరగా చేసుకొని ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నించడం దాన్ని హీరో టెక్నాలజీ సాయంతో తిప్పి కొట్టి ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పడంతో కథ సుఖాంతం అవుతుంది. ఇదీ క్లుప్తంగా ‘బెదురులంక 2012‘ కథ.
ఎనాలసిస్ :
వాస్తవానికి ఈ కథతో సినిమా తియ్యాలని దర్శకుడు అనుకోవడమే సిల్లీగా అనిపిస్తుంది. 2012కి ముందు ఇలాంటి కథతో ఓ ప్రయత్నం చేసి వుంటే ఫలితం మరోలా ఉండేది. ఎందుకంటే హాలీవుడ్ మూవీ 2012 చిత్రం మూడు సంవత్సరాల ముందే అంటే 2009లో వచ్చింది. ఒకవేళ యుగాంతం అనేది వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఎంతో స్పష్టంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆ సినిమాలో చూపించారు. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బెదురులంక సినిమా విషయానికి 2023లో 2012కి సంబంధించిన కథని తీసుకొని నాసిరకం కథనం, నాసిరకం డైలాగులు, వెకిలి కామెడీ, వల్గర్ సీన్స్‌తో సినిమాని నింపేశారు.
అసలు దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ కథతో ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్ చెయ్యాలనుకున్నాడు అనేది అస్సలు అర్థం కాదు. కథ మొదలైన తీరు, యుగాంతం గురించి జనాన్ని భయపెట్టాలనుకునే ఓ పూజారి, ఓ చర్చి ఫాదర్‌తో చేయించే విన్యాసాలు ఎంతో ఎబ్బెట్టుగా, మరెంతో వల్గర్‌గా అనిపిస్తాయి. అసహజమైన సన్నివేశాలు, సిట్యుయేషన్స్‌తో సినిమాని నింపేశాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు ఏ దశలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలగకుండా దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతో సినిమా పూర్తయ్యేవరకు ఆడియన్స్ ఎంతో అయోమయంగా కనిపిస్తారు. ఈ కథ గురించి, కథనం గురించి ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు.
నటీనటుల పనితీరు:
ఇక ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక్కరి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కార్తికేయ నటనగానీ, యాక్షన్ సీక్వెన్స్‌లుగానీ ఎంతో సాధారణంగా అనిపిస్తాయి. ఇక నేహాశెట్టి క్యారెక్టర్‌కి కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. దానికి తగ్గట్టుగానే పెర్‌ఫార్మెన్స్ కూడా ఉంది. ఇక సినిమా మొత్తం వీళ్ళే అన్నట్టుగా ప్రతి సీన్‌లోనూ అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాంప్రసాద్ కనిపిస్తుంటారు. వాళ్ళ పెర్‌ఫార్మెన్స్ కూడా షరా మామూలే.
టెక్నీషియన్స్ గురించి చెప్పాల్సి వస్తే...
సినిమాకి పెద్ద మైనస్ ఫోటోగ్రఫీ. ఎంతో నాసిరకంగా ఉన్న ఫోటోగ్రఫీ వల్ల డి గ్రేడ్ సినిమాలా అనిపించింది. చాలా సీన్స్ ఔట్ ఫోకస్‌లో ఉండడం మనం గమనిస్తాం. ఇక మణిశర్మ సంగీతం కూడా అంతంత మాత్రమే. ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడనే పేరు ఉంది. కానీ, ఈ సినిమాలో మణిశర్మ ఆ ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. దాదాపు రెండున్నర గంటల సినిమాను మరో 20 నిమిషాలు ఎంతో అలవోకగా తగ్గించవచ్చు. కానీ, ఎడిటర్ విప్లవ్ నైషధం ఆ పనిచేయలేదు. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఒక ఔట్ డేటెడ్ కథని తీసుకొని దానికి కొత్త రంగులు అద్ది సినిమా చేసేసి సక్సెస్ కొట్టాలని చేసిన అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. నాసిరకమైన సీన్స్, టీవీలో రిపీటెడ్‌గా వచ్చే యుగాంతం న్యూస్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. అతని టేకింగ్ కూడా ఎలాంటి కొత్తదనం లేకపోగా ఒకే సీన్‌ని ఎంతో సేపు సాగదీయడంలో ఎక్కువ శ్రద్ధ చూపించాడు. ఇక మేకింగ్ విషయానికి వస్తే ఒక అర్థంలేని కథతో, అంతగా ఆకట్టుకోలేని నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌తో, టెక్నికల్‌గా ఎంతో నాసిరకంగా సినిమాని తీసి ప్రేక్షకుల మీదకు వదిలారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
థియేటర్లకు జనం రావాలంటే సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమాని తియ్యాలి. దానికి తగ్గట్టుగానే మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా సినిమా ఉండాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ నుంచి మంచి ఔట్‌పుట్‌ని రాబట్టుకునే దర్శకుడై ఉండాలి. బెదురులంక సినిమాలో అవేవీ కనిపించవు. అర్థం పర్థం లేని కథ, కథనాలు, వల్గర్ సీన్స్, ఎబ్బెట్టుగా అనిపించే డైలాగులు సినిమాని మరింత దెబ్బ తీశాయి. హీరో కార్తికేయ కెరీర్‌లో మరో మైనస్ సినిమాగా ఇది నిలిచింది. ఒక రేంజ్ సినిమాలకే ఒక వారం, రెండు వారాలు రన్ కష్టమవుతున్న ఈరోజుల్లో ఈ తరహా సినిమా నిలబడి, ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించి నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో!
- జి.హరా