English | Telugu
బ్యానర్:సన్ పిక్చర్స్
Rating:2.25
విడుదలయిన తేది:Apr 13, 2022
సినిమా పేరు: బీస్ట్
తారాగణం: విజయ్, పూజా హెగ్డే, యోగిబాబు, సెల్వరాఘవన్, రెడిన్ కింగ్‌స్లే, వీటీవీ గణేశ్, అంకుర్ వికల్, అంబిక, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫరూఖి
లిరిక్స్: చంద్రబోస్, శ్రీసాయికిరణ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఆర్ నిర్మల్
ఆర్ట్: డి.ఆర్.కె. కిరణ్
స్టంట్స్: అన్బరివ్
నిర్మాత: కళానిధి మారన్
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
బ్యానర్: సన్ పిక్చర్స్
విడుదల తేదీ: 13 ఏప్రిల్ 2022
విజయ్ సినిమా వస్తోందంటే దానిపై ఉండే అంచనాలు ఎప్పుడూ అసాధారణంగానే ఉంటాయి. 'బీస్ట్' అందుకు మినహాయింపు కాదు. 'డాక్టర్' లాంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా కావడం, 'బిగిల్', 'మాస్టర్' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో 'బీస్ట్'పై అంచనాలు రెట్టింపవడంతో పాటు ప్రి బిజినెస్ కూడా విపరీతంగా జరిగింది. నేటి టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే ఉందా...
కథ:- ఐసిస్ టెర్రరిస్టులు చెన్నైలో సముద్రతీరం దగ్గర ఉన్న ఈస్ట్ కోస్ట్ మాల్‌ను హైజాక్ చేస్తారు. జైల్లో ఉన్న తమ నాయకుడు, కరడుకట్టిన తీవ్రవాది ఉమర్ ఫరూఖ్‌ను విడుదల చేయాలనేది వారి డిమాండ్. లేదంటే మాల్‌లో తమ బందీలుగా ఉన్న 200కు మందికి పైగా పౌరుల్ని చంపేస్తామని బెదిరిస్తారు. అయితే అదే టైమ్‌లో మాజీ 'రా' ఏజెంట్ వీరరాఘవ (విజయ్) ఆ మాల్‌లో ఉన్నాడనే విషయం వారికి తెలీదు. ఒక సెక్యూరిటీ ఏజెన్సీ తరపున ఆ మాల్‌కు తన ప్రియురాలు ప్రీతి (పూజా హెగ్డే)తో కలిసి వెళ్లిన వీరరాఘవ ఏం చేశాడు, టెర్రరిస్టుల నుంచి ఆ మాల్‌ను, దాంతో పాటు బందీలుగా ఉన్న పౌరుల ప్రాణాల్ని ఎలా కాపాడాడనేది బీస్ట్ లోని ప్రధానాంశం.
ఎనాలసిస్ :
కథలో 80 శాతం పైగా ఈస్ట్ కోస్ట్ మాల్‌లోనే జరుగుతుంది. ఒక ప్రదేశంలో జరిగే కథను ఎక్కడా బిగువు సడలకుండా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా నడపడం కత్తిమీద సాము వ్యవహారం. ఈ విషయంలో డైరెక్టర్ నెల్సన్ ఫెయిలయ్యాడని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేయవచ్చు. సినిమా ఆరంభంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎంట్రీ ఇచ్చే వీరరాఘవ.. అక్కడ ఓ పాపకు బెలూన్లు కొనిపించడం, అక్కడ టెర్రరిస్టులను అంతం చేయడానికి అతను జరిపే ఆపరేషన్‌లో ఆ పాప చనిపోవడం ఎమోషనల్‌గా మనల్ని కదిలించే అంశం. దాంతో అతను 'రా'కు రాజీనామా చేసేసి చెన్నైకు వచ్చేస్తాడు. ఓ పార్టీలో అతడికి ప్రీతి తారసపడుతుంది. అప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిన ఆమెకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. వీరరాఘవకు ప్రపోజ్ చేస్తుంది. ఆమే అతడిని తను పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీకి తీసుకుపోయి, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తుంది.
ఆ తర్వాత కథంతా ఈస్ట్ కోస్ట్ మాల్‌లో జరుగుతుంది. అక్కడ టెర్రరిస్టులకు, వీరరాఘవకు మధ్య జరిగే డెత్ గేమ్‌ను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ తప్పటడుగులు వేశాడు. ఇలాంటి కథలు ఇప్పటికే మనం తెరమీద చాలా చూసేశాం. చిన్న లైన్ మీద ఆధారపడి తీసిన సినిమాకు కథనమే ప్రాణం. ఆ కథనం పేలవంగా, ప్రహసనంగా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేందుకు నిదర్శనంగా 'బీస్ట్' నిలుస్తుంది. సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని వీటీవీ గణేశ్‌తో పాటు యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే పాత్రలతో హాస్యాన్ని సృష్టించి వినోదం పంచాలని చూసినప్పటికీ అది పాక్షికంగానే వర్కవుట్ అయింది. కొన్నిచోట్ల డైలాగ్స్ నవ్వించాయి.
ఎదుటివాడు ఎలాంటి కిరాతకుడైనా, అతి సునాయాసంగా చంపిపారేసే వీరరాఘవ పాత్రను విజయ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ, సాధారణ ప్రేక్షకులు ఆ పాత్రతో కనెక్ట్ కావడం కష్టం. విజయ్‌తో ఫైట్‌మాస్టర్ అన్బరివ్ చేయించిన ఫైట్లు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి. పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్ బలంగా లేదు. హీరోతో పరిచయ సీన్లలో తప్పితే, ఆమె ప్రెజెన్స్ సినిమాకు అవసరం లేదన్నట్లు ఉంది. ఆమె క్యారెక్టర్ లేకపోయినా కథకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక టెర్రరిస్ట్ మంచివాడైపోయి వీరరాఘవకు హెల్ప్ చేయడమేంటో అర్థం కాని వ్యవహారం. టెర్రిరిస్టుల్లోనూ మంచివాళ్లు ఉంటారని చెప్పడం దర్శకుడి ఉద్దేశమా!
అనిరుధ్ రవిచందర్ బీజీయం సన్నివేశాలకు తగ్గట్లు అర్థవంతంగా ఉంది. అతను బాణీలు కూర్చిన రెండు పాటలు బయట బాగున్నాయి కానీ, సినిమాలో ఏమంత ఎఫెక్టివ్‌గా లేవు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ క్వాలిటీగా ఉంది. కాకపోతే టెర్రరిస్టులు నేరుగా ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపినా ఒక్క బుల్లెట్ కూడా అతడికి తగలకుండా గురితప్పడం, అతను కాలిస్తే గురితప్పకపోవడం సినిమాలోనే సాధ్యమయ్యే విషయం. ఈ తరహా సీన్లు 'బీస్ట్'లో బోలెడన్ని ఉన్నాయి. గన్ లేదా నైఫ్.. ఈ రెండింటితో టెర్రరిస్టులనందర్నీ కసకసా చంపేసుకుంటూ పోతాడు వీరరాఘవ. ఇలాంటి సినిమాకు ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఎడిటర్‌కు పెద్ద పరీక్ష. నిర్మల్ ఆ పరీక్షలో నెగ్గలేదు.
నటీనటుల పనితీరు:- వీరరాఘవ క్యారెక్టర్ విజయ్ తనదైన స్టైల్‌లో సునాయాసంగా చేసుకుపోయాడు. ఆయన నటనా కౌశలానికి అద్దంపట్టే సరైన సీన్ ఒక్కటి కూడా సినిమాలో లేకపోవడం మైనస్. కేవలం యాక్షన్ స్టార్‌గానే ఈ సినిమాలో కనిపించి, ఆ మేరకు తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ప్రీతిగా పూజ ఎప్పట్లా అందంగా ఉంది. కానీ ఈ పాత్రకు ఆమెను తీసుకోవడం శుద్ధ దండగ. రెండు పాటల్లో డాన్సులు వేయడం తప్ప ఆ పాత్రలో ఆమె చేయగలిగిందేమీ లేదు. టెర్రరిస్టులతో ఫైట్ చేయడానికి ప్రీతి పాత్ర వీరరాఘవకు బాగా ఉపయోగపడినట్లు చూపిస్తే, ఆ పాత్రకూ, సినిమాకూ మేలు చేకూరేది. ప్రభుత్వం తరపున టెర్రిరిస్టులతో అనుసంధానమై, వారితో మాట్లాడే పోలీస్ ఆఫీసర్ అల్తాఫ్ హుస్సేన్ క్యారెక్టర్‌కు సెల్వరాఘవన్ అతికినట్లు సరిపోయాడు. సెక్యూరిటీ ఏజెన్సీ ఓనర్‌గా వీటీవీ గణేశ్, మాల్‌లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేసే వ్యక్తులుగా యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కొంత హాస్యాన్ని పంచడానికి ఉపయోగపడ్డారు. ముఖ్యంగా వీటీవీ గణేశ్ నోటివెంట వచ్చే డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. మాల్‌లో టెర్రిరిస్ట్ లీడర్‌గా అంకుర్ వికల్, వీరరాఘవకు మేలుచేసే టెర్రిరిస్టుగా షైన్ టామ్ చాకో, హోమ్ మినిస్టర్ భార్యాకూతుళ్లుగా సీనియర్ నటి అంబిక, అపర్ణా దాస్, టెర్రిరిస్ట్ ఉమర్ ఫరూఖ్‌గా లిల్లీపుట్ ఫరూఖ్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'బీస్ట్' మూవీని విజయ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలరు కానీ, సాధారణ ప్రేక్షకులు తట్టుకోవడం కష్టం. పసలేని కథాకథనాలు, అర్థంపర్ధంలేని యాక్షన్ డ్రామా ఈ సినిమాకు బిగ్ మైనస్.
- బుద్ధి యజ్ఞమూర్తి