English | Telugu

సినిమా పేరు:బ్రో
బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 28, 2023

సినిమా పేరు: బ్రో
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, యువలక్ష్మి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రాజా చెంబోలు, అలీ రెజా, సముద్రఖని, పృథ్వీరాజ్
సంగీతం: ఎస్. థమన్ 
సినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: నవీన్ నూలి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
కథ, దర్శకత్వం: సముద్రఖని
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్‌
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
విడుదల తేదీ: జూలై 28, 2023 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 25వ సినిమా కావడం విశేషం. తమిళ సినిమా 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని, మాతృకకి దర్శకత్వం వహించిన సముద్రఖనినే డైరెక్ట్ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మరి ఇన్ని విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బ్రో' చిత్రం ఎలా ఉంది?..

కథ:
చిన్న వయసులోనే తన తండ్రి చనిపోవడంతో పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు మార్క్ అలియాస్ మార్కండేయులు(సాయి ధరమ్ తేజ్). ఈ క్రమంలో కాస్త కఠినంగా ఉంటాడు. చిన్నతనం నుంచే బాగా కష్టపడటం అలవాటైన మార్క్, తాను లేకపోతే కుటుంబమే లేదు అన్నంతగా ప్రవర్తిస్తూ, తన కుటుంబసభ్యుల జీవితాన్ని కూడా తానే నిర్ణయించాలి అనుకుంటాడు. దానికితోడు టైం లేదు టైం లేదు అంటూ ఎప్పుడూ హడావుడిగా ఉంటూ, కనీసం తనవాళ్ళతో సమయం గడపటానికి కూడా లెక్కలు వేసుకుంటాడు. అలాంటి మార్క్ జీవితం ఒక్క యాక్సిడెంట్ కారణంగా ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి, మార్క్ మరణిస్తాడు. అప్పుడు మనిషి రూపంలో ఉన్న టైం(పవన్ కళ్యాణ్) ప్రత్యక్షమై, మార్క్ కోరికమేరకు మరో 90 రోజులు బ్రతికే అవకాశమిస్తాడు. ఆ 90 రోజుల్లో మార్క్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తన గురించి, తన కుటుంబం గురించి, జీవితం గురించి మార్క్ కొత్తగా ఏం తెలుసుకున్నాడు? అనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

రీమేక్ సినిమా చేయడం అంత తేలిక కాదు. మూలకథలోని ఆత్మను చెడగొట్టకుండా ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా చేయాలి. పైగా బ్రో మాతృకలో స్టార్స్ నటించలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే బిగ్ స్టార్ తోడయ్యారు. అందుకే ఆయన ఇమేజ్ కి సరిపోయేలా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగారు. కానీ త్రివిక్రమ్, రచన విషయంలో మరీ గీత ఎక్కువ దాటేశారు అనిపించింది. ఇది మాములుగా చూస్తే చిన్నకథ లాగే అనిపించవచ్చు. కానీ ఇందులో 'ఎలాంటి తప్పులు చేయకుండా మన వాళ్ళతో ఆనందంగా ఈ క్షణంలో బ్రతకడమే జీవితం' అనే మంచి సందేశం ఉంటుంది. అయితే మెయిన్ పాయింట్ మీద సినిమాని నడిపించడం కంటే, పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీదే ఎక్కువగా సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. దానివల్ల సినిమా చూసేటప్పుడు అభిమానులు ఎంజాయ్ చేస్తారు కానీ, సాధారణ ప్రేక్షకులు తృప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ.

మార్క్ పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగానే కథలోకి తీసుకెళ్ళాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ పరిచయం సన్నివేశం మెప్పిస్తుంది. పెద్దగా మలుపులు లేనప్పటికీ పవన్, సాయి తేజ్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, సంభాషణలతో ప్రథమార్థం బాగానే సాగుతుంది. అయితే సినిమాకి కీలకమైన ద్వితీయార్థంలో మాత్రం తడబాటు కనిపించింది. ఎమోషన్స్ ఆశించినస్థాయిలో పండలేదు. కథకి, అందులోని పాత్రలకు ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో రచయిత, దర్శకుడు విఫలమయ్యారు. పతాక సన్నివేశాలు మాత్రం బాగానే ఉన్నాయి.

సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలు ఎక్కువగా పవన్ ఇమేజ్ ని, ఆయన నిజజీవితాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా ఉన్నాయి. దానివల్ల తెరమీద మనకు టైం పాత్రను చూస్తున్నట్టు ఉండదు, పవన్ కళ్యాణ్ నే చూస్తున్నట్టు ఉంటుంది. చాలా సన్నివేశాలను పవన్ గత చిత్రాలలోని పాటలతో నింపేశారు. అవి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు కానీ, సాధారణ ప్రేక్షకులకు మాత్రం పవన్ నటించిన కొత్త సినిమా చూస్తున్నామా లేక ఆయన పాత సినిమాల క్లిప్స్ చూస్తున్నామా అనే భావన కలిగే అవకాశముంది.

పాటలతో థమన్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. నేపథ్య సంగీతం మాత్రం బాగానే ఉంది. సుజిత్ వాసుదేవ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నూలి ఉన్నంతలో సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశారు. నిడివి తక్కువ ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చిన ప్రధాన అంశాల్లో ఒకటి. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ పోషించిన టైం పాత్రకు ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

మనిషి రూపంలో వచ్చిన టైం పాత్రలో పవన్ కళ్యాణ్ మ్యాజిక్ చేశారు. తన స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వివిధ గెటప్పులు, పాటలతో అభిమానులకి వినోదాన్ని పంచడానికి తనవంతు కృషి చేశారు. సమయంలేదు సమయం లేదు అంటూ చివరికి ఆ కాలం ద్వారానే జీవితం అంటే ఏంటో తెలుసుకున్న మార్క్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఒదిగిపోయారు. ఆ పాత్ర స్వభావానికి తగ్గట్లుగా హావభావాలు బాగానే పలికించారు. అయితే ఆయనలో మునుపటి ఎనర్జీ కనిపించడంలేదు. సినిమా అంతా ఎక్కువగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దాంతో ఇతర పాత్రలకు స్క్రీన్ స్పేస్ తక్కువగానే దొరికింది. మార్క్ తల్లిగా రోహిణి, ప్రేయసిగా కేతికశర్మ, చెల్లెళ్లుగా ప్రియా ప్రకాష్‌, యువలక్ష్మి రాణించారు. బ్రహ్మానందం అతిథిపాత్రలో మెరిశారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, రాజా చెంబోలు, అలీ రెజా, సముద్రఖని, పృథ్వీరాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ, కంటెంట్ కంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని నమ్మకోని రూపొందించిన ఈ సినిమా, ఆయన అభిమానులను అలరించేలా ఉంది. కానీ ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.

-గంగసాని

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25