Read more!

English | Telugu

సినిమా పేరు:అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం
బ్యానర్:ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌
Rating:3.00
విడుదలయిన తేది:May 6, 2022

సినిమా పేరు: అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం
తారాగ‌ణం: విష్వ‌క్ సేన్‌, రుక్ష‌ర్ ధిల్లాన్‌, రితికా నాయ‌క్‌, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, కాదంబ‌రి కిర‌ణ్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, వెన్నెల కిశోర్‌, డ‌బ్బింగ్ జాన‌కి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: ర‌వికిర‌ణ్ కోలా
సంగీతం: జై క్రిష్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప‌వి కె. ప‌వ‌న్‌
ఎడిట‌ర్‌: విప్ల‌వ్ నైష‌ధం
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ప్ర‌వ‌ల్య దుద్దుపూడి
స‌మ‌ర్ప‌ణ‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: బాపినీడు బి., సుధీర్ ఈద‌ర‌
ద‌ర్శ‌క‌త్వం: విద్యాసాగ‌ర్ చింతా
బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌

ఇటీవ‌ల సినిమా ప‌బ్లిసిటీ కోసం రోడ్డుపై చేసిన ఓ వీడియోతో కావ‌లిసినంత ప‌బ్లిసిటీ తెచ్చుకున్నాడు విష్వ‌క్ సేన్‌. దానివ‌ల్ల అంత‌దాకా ఆస‌క్తి చూప‌నివాళ్లు కూడా అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాపై చూపు తిప్పారు. ఒక మీడియా సంస్థ ఒక ఉద్దేశంతో చేసిన హ‌డావిడి ఆ సినిమాకు ఇంకో విధంగా లాభం చేకూర్చింది. ర‌వికిర‌ణ్ కోలా ర‌చ‌న చేయ‌గా, విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం' మూవీ ఎలా ఉందంటే...

క‌థ‌:- సూర్యాపేట‌కు చెందిన 33 సంవ‌త్స‌రాల‌ అర్జున్‌కుమార్ అల్లం (విష్వ‌క్ సేన్‌) గోదావ‌రి ప్రాంతంలోని అశోక్‌న‌గ‌ర్ అనే ఊరికి చెందిన ప‌సుపులేటి మాధ‌వి (రుక్ష‌ర్ ధిల్లాన్‌) అనే అమ్మాయితో నిశ్చితార్ధం జ‌రుపుకోడానికి ఆ ఊరికి బంధు స‌మేతంగా వెళ‌తాడు. నిశ్చితార్ధం అయ్యాక వాళ్లు వెళ్లిన బ‌స్సు మొరాయించ‌డంతో ఒక‌రోజు అక్క‌డే ఉండిపోవాల్సి వ‌స్తుంది. అప్పుడే క‌రోనా కార‌ణంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ విధిస్తారు. దాంతో మ‌రికొన్ని రోజులు వారంతా ఉండాల్సిన స్థితి. కోటి ఆశ‌ల‌తో మాధ‌వితో జీవితాన్ని ఊహించుకుంటున్న అర్జున్ ఏమాత్రం ఊహించ‌ని విధంగా, అత‌డి క‌ల‌ల్ని క‌ల్ల‌లు చేస్తూ మాధ‌వి తాను అదివ‌ర‌కే ప్రేమించిన యువ‌కుడితో ఓ రాత్రివేళ వెళ్లిపోతుంది. దాంతో అర్జున్ ఏం చేశాడు?  గాయ‌ప‌డ్డ అత‌ని మ‌న‌సుకి సాంత్వ‌న చేకూరిందా? మాధ‌వి తిరిగొచ్చిందా? లేక‌ అత‌ని జీవితంలోకి ఇంకెవ‌రైనా వ‌చ్చారా? అనేది మిగ‌తా క‌థ‌.


ఎనాలసిస్ :

ఈ సినిమా క‌థా వ‌స్తువు.. పెళ్లి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయికి, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చ‌యం అవ‌డం, అదీ కూడా ఇరువురివీ వేర్వేరు కులాలు కావ‌డం అనేది చూడ్డానికి అరుదైన విష‌యంగా అనిపిస్తుంది. త‌మ‌ కులానికి చెందిన అమ్మాయిలు దొర‌క్క‌పోవ‌డంతోటే మ‌రో కులానికి చెందిన అమ్మాయితో అర్జున్ కుటుంబం సంబంధం కుదుర్చుకుంటుంద‌ని చెప్ప‌డం స‌మాజంలో అమ్మాయిల‌కు ఎంత క‌రువొచ్చింద‌నే విష‌యాన్ని హైలైట్ చేసింది ఈ సినిమా. ఇదొక సీరియ‌స్ ఇష్యూ. పెళ్లికొడుకు, అత‌ని కుటుంబం త‌మ ఇంట్లో అతిథులుగా ఉండ‌గానే నిశ్చితార్ధం చేసుకున్నాక పెళ్లికూతురు మ‌రొక‌రితో లేచిపోవ‌డం అనేది ఇంకో సీరియ‌స్ విష‌యం. అలాంటి సీరియ‌స్ విష‌యాల్ని లైట‌ర్‌వీన్‌లో, కామెడీ జోడించి ప్రెజెంట్ చేయ‌డం వ‌ల్ల 'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం' సినిమా ఆద్యంతం ఆహ్లాదాన్నీ, వినోదాన్నీ పంచింది.

నిశ్చితార్ధం చేసుకోడానికి త‌మ ఇంటికి వ‌చ్చిన అర్జున్‌తో పెళ్లికూతురు మాధ‌వి కంటే ఆమె చెల్లెలు వ‌సుధ (రితికా నాయ‌క్‌) ఎక్కువ క‌లుపుగోలుగా ఉండ‌టం, అక్క‌కూ, కాబోయే బావ‌కూ మ‌ధ్య అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం సెకండాఫ్‌కు మంచి లీడ్‌ను ఇచ్చింది. అంటే ఏమిటి.. హీరో అర్జున్ ఎక్కువ‌గా మాట్లాడేది మాధ‌వితో కాదు వ‌సుధ‌తో. అర్జున్‌ను చూడాల‌న్నా, అత‌డితో మాట్లాడాల‌న్నా మాధ‌విలో బెరుకు, భ‌యం క‌నిపిస్తూ ఉంటే.. మ‌నం ఆమె చాలా బిడియ‌స్తురాల‌ని అనుకుంటాం. వ‌స‌పిట్ట‌లా వాగే వ‌సుధ‌ని చూసి, ఈ పిల్లేమిటి హీరో హీరోయిన్ల మ‌ధ్య దూరి వాళ్ల‌ను ఇబ్బంది పెడుతోంది అనుకుంటాం.. కానీ క‌థ‌కుడు ఆ స‌న్నివేశాల్ని అలా ఎందుకు క‌ల్పించాడు, మాధ‌వి క్యారెక్ట‌ర్ కంటే వ‌సుధ క్యారెక్ట‌ర్‌కు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడ‌నే విష‌యం సెకండాఫ్‌లో మ‌న‌కు తెలిసొస్తుంది.

33 ఏళ్లొచ్చినా పెళ్లి కాకుండా ఉండిపోవ‌డంతో, ఒక ర‌క‌మైన ఫ్ర‌స్ట్రేష‌న్‌తో ఏ అమ్మాయి త‌న‌కు ఓకే చెప్తుందా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అనే ఆత్రుత క‌నప‌రిచే యువ‌కుడి క‌థ ఎలా ఉంటుందో 'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం' సినిమా మ‌న‌కు క‌ళ్ల‌కు క‌డుతుంది. క‌రోనా ప్రారంభ కాలంలో నిశ్చితార్ధం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లి లాక్‌డౌన్ కార‌ణంగా అక్క‌డే మూడు వారాలకు పైగా చిక్కుకుపోయిన ఓ కుటుంబం ప‌డే పాట్లు, నిశ్చితార్ధం అయ్యాక పెళ్లి ముహూర్తం పెడ‌దామ‌ని అనుకొనేంత‌లోనే త‌మ కూతురు ప్రేమించిన‌వాడితో లేచిపోవ‌డంతో అవ‌మాన‌భారంతో ఇంకో కుటుంబం ప‌డే ఇబ్బందుల‌ను స‌ర‌దా స‌న్నివేశాల‌తో, ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా తియ్య‌డం అంత ఈజీ కాదు. ఈ విష‌యంలో కథ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన ర‌వికిర‌ణ్ కోలా, డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ చింతా ప్ర‌తిభ‌ను మెచ్చుకొని తీరాలి. క‌థ‌ను న‌డిపించే క్యారెక్ట‌ర్ల‌ను వారు తెర‌పై మ‌ల‌చిన విధానం వ‌ల్లే సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మ‌న‌ల్ని కుర్చీల్లో క‌ద‌ల‌కుండా కూర్చోబెట్టింది. 

'ఏ అమ్మాయినైనా వెన‌క్కి తిరిగిచూసి, ఆమెను మిస్ చేసుకుంటే జీవిత‌మంతా మిస్ చేసుకున్న‌ట్లే అనే ఫీలింగ్ క‌లిగితే, ఆమెను వ‌దులుకోవ‌ద్దు' అనే వ‌సుధ మాట‌లు, 'పెళ్లంటే న‌లుగురి కోసం చేసుకునేది కాదు, మ‌న‌కు న‌చ్చిన‌వాళ్ల‌ను న‌చ్చిన‌ప్పుడు చేసుకొనేది' అనే అర్జున్‌ డైలాగ్ ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. ఫ‌స్ట్ లాక్‌డౌన్ కాలంలో ఎవ‌ర్నీ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ మైకు ప‌ట్టుకొని ఆ ఏరియా ఎమ్మెల్యే మెరుపుల రాజారామ్ (వెన్నెల కిశోర్‌) చేసే ప్ర‌చారం, ఆ సంద‌ర్భంగా అర్జున్‌ కుటుంబంతో మాట్లాడే సీన్లు అల‌రిస్తాయి. మెలోడీ పాట‌లు, ఆహ్లాద‌క‌ర‌మైన బీజియంతో జై క్రిష్ సంగీతం విన‌సొంపుగా ఉంది. ప‌వి కె. ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఎలాంటి హంగామా లేకుండా స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లు చ‌క్క‌టి మూడ్‌ను తెచ్చింది. విప్ల‌వ్ నైష‌ధం ఎడిటింగ్ బాగుంది. కొన్ని సీన్ల నిడివిని ఇంకాస్త క‌త్తిరిస్తే ఇంకా బాగుండేది. ప్ర‌వ‌ల్య దుద్దుపూడి క‌ళా ద‌ర్శ‌క‌త్వం గురించి కూడా ప్ర‌స్తావించుకోవాలి.

న‌టీన‌టుల ప‌నితీరు:- 'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం' సినిమా అంతా అర్జున్‌కుమార్ అల్లం క్యారెక్ట‌ర్ మీదా, ఆ క్యారెక్ట‌ర్ ప‌డే సంఘ‌ర్ష‌ణ మీదా ఆధార‌ప‌డింది. ఆ క్యారెక్ట‌ర్‌లో విష్వ‌క్ సేన్ చాలా బాగా రాణించాడు. త్రాసులో ఇంత‌దాకా అత‌ను చేసిన పాత్ర‌ల‌న్నీ ఒక‌వైపు, అర్జున్ పాత్ర ఒక‌వైపూ పెడితే, అర్జున్ పాత్ర వైపే మొగ్గు తూగుతుంది. త‌న భుజ‌స్కంధాల మీద ఈ సినిమాని తీసుకుపోయాడు విష్వ‌క్‌. జోవియ‌ల్ సీన్ల‌లో న‌టించ‌డం అత‌నికి చాలా సునాయాస‌మైన ప‌ని. భావోద్వేగ‌పూరిత‌, మాన‌సిక ఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌వించే సీన్ల‌నూ అత‌ను చేయ‌గ‌ల‌డ‌ని ఈ సినిమా నిరూపించింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు బాగా బ‌రువు పెర‌గ‌డ‌మే కాకుండా, కాస్త పొట్ట కూడా పెంచాడు విష్వ‌క్‌. ఈ సినిమా అత‌నికి గేమ్ చేంజ‌ర్ అయితే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. 

మాధ‌విగా రుక్ష‌ర్ ధిల్లాన్‌కు ఎక్కువ‌గా న‌టించే అవ‌కాశం ల‌భించ‌లేదు. వ‌సుధ‌గా న‌టించిన రితికా నాయ‌క్ గ్లామ‌ర్ త‌క్కువైనా న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు రావొచ్చు. హీరోయిన్ల మేన‌మామ సూరిబాబుగా కాదంబ‌రి కిర‌ణ్ త‌న చ‌లాకీ న‌ట‌న‌, గోదావ‌రి యాస‌తో ఆక‌ట్టుకున్నారు. హీరో మేన‌మామ‌గా గోప‌రాజు ర‌మ‌ణ మ‌రోసారి త‌న స‌త్తా చాటారు. ఫొటోగ్రాఫ‌ర్‌గా రాజ్‌కుమార్ క‌సిరెడ్డి హావ‌భావాలు, డైలాగ్స్‌ను ఎంజాయ్ చేస్తాం. ఎమ్మెల్యే మెరుపుల రాజారామ్‌గా ఒకే ఎపిసోడ్‌లో క‌నిపించినా అద‌ర‌గొట్టేశాడు వెన్నెల కిశోర్. మిగ‌తావాళ్లు కూడా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వ‌య‌సు మీద‌ప‌డుతున్న ఓ యువ‌కుడు నిశ్చితార్ధం చేసుకోవ‌డానికి మ‌రో ప్రాంతానికి వెళ్లి, క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా అక్క‌డే చిక్కుకుపోయి ఎలాంటి అవ‌స్థ‌లు ప‌డ్డాడు, నిశ్చితార్ధం చేసుకున్న అమ్మాయి మ‌రొక‌రితో వెళ్లిపోతే మాన‌సికంగా ఎంత సంఘ‌ర్ష‌ణ అనుభ‌వించాడు అనే పాయింట్‌ను ఆహ్లాద‌భ‌రిత‌మైన స‌న్నివేశాల‌తో, చ‌క్క‌ని క‌థ‌నంతో చూపించిన సినిమా.. 'అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం'. ఇది.. విష్వ‌క్ సేన్‌ను న‌టునిగా ఓ మెట్టు పైకెక్కించిన సినిమా.

- బుధ్ది య‌జ్ఞ‌మూర్తి