Read more!

English | Telugu

సినిమా పేరు:ఆనంద తాండవం
బ్యానర్:ఆస్కార్ ఫిలింస్
Rating:---
విడుదలయిన తేది:Apr 10, 2009
రఘుపతి (సిద్ధార్థ) మెకానికల్‍ ఇంజనీరింగ్ చదివిన యువకుడు. అతనికి తండ్రి మాత్రమే ఉంటాడు. తల్లి అతను పుట్టగానే చనిపోతుంది. మదనపల్లిలో తండ్రి పనిచేస్తుండటంతో, రఘుపతి అక్కడికి వస్తాడు. అక్కడే చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గోపీనాథ్‌ తన కుటుంబంతో సహా అక్కడే ఉంటాడు. అతనికి భార్య, ఒక కూతురు (తమన్నా), కొడుకు ఉంటారు. వాళ్ళు చాలా అల్లరి పిల్లలు. వాళ్ళది చాలా హై ఫై కల్చర్. రఘుపతికి ఆ కుటుంబంతో పరిచయం అవుతుంది. పరిచయం అయిన పదిహేను రోజుల్లోనే వాళ్ళ అమ్మాయితో రఘుపతికి నిశ్చితార్థం జరిపిస్తాడు గోపీనాథ్. దీన్ని ఎందుకనో రఘుపతి వాళ్ళ నాన్న అంగీకరించలేకపోయినా, చివరికి ఒప్పు కుంటాడు. ఈ లోగా గోపీనాథ్ పలుకుబడి వల్ల రఘుపతికి ఉద్యోగం వస్తుంది. రఘుపతి ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళగానే పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాడు గోపీనాథ్. కానీ వివాహానికి పది రోజులు ముందుగా వచ్చేసరికి గోపీనాథ్ తన కూతురి పెళ్ళి రాధాకృష్ణ అనే అమెరికాలో సెటిలైన వ్యక్తితో సెటిల్‍ చేస్తాడు. గోపీనాథ్‌ని ఎందుకిలా చేశావని రఘుపతి అడిగితే, నీ తండ్రి ఒక పనిమనిషిని ఉంచుకున్నాడని కుంటి సాకు చెపుతాడు. ఆ బాధ తట్టుకోలేక చనిపోదామని ఆత్మహత్య చేసుకుంటాడు రఘుపతి. కానీ అతన్ని గోపీనాథ్ కారు డ్రైవర్ కాపాడతాడు. అప్పుడు రఘుపతి తండ్రి అతనికి హితబోధ చేసి, అమెరికాలో చదువుకోమని పంపిస్తాడు. అక్కడ చదువుకుంటున్న రఘుపతికి తన మాజీ ప్రియురాలు కనిపిస్తుంది. ఆమె భర్త కూడా వీరి పరిచయాన్ని అంగీకరిస్తాడు. కానీ ఆమె భర్త ఒక తిరుగుబోతని ఆమెకు చెప్పబోతే ఆమె రఘుపతిని ఒక మూర్ఖుడిలా చూస్తుందితన తప్పు తెలుసుకున్న రఘుపతి చివరికి తనంటే ఇష్టపడే ఒకమ్మాయితో పెళ్ళికి సిద్ధపడతాడు. ఆ పెళ్ళి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే వేళ, బాగా తాగి వున్న స్థితిలో రఘుపతి ప్రియురాలు వచ్చి, తన చేయి కోసుకుని, తన దీన స్థితి చెప్పి, "నువ్వు చెప్పింది నిజమే రఘూ. నువ్వు లేందే బ్రతకలేను. నువ్వు నాక్కావాలీ" అని అతన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయగా , రఘుపతి తండ్రి అతన్ని అక్కడనుండి తీసుకెళ్ళి ఆగిన నిశ్చితార్థం జరిపిస్తాడు. దాంతో బాగా తాగి వున్న స్థితిలో కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్‍కి గురై ఆమె చనిపోతుంది. ఆమె చావుకి కారణమైన ఆమె భర్త తాను ఆమెని చక్కగా చూసుకున్నానని చెప్పటం విన్న రఘుపతి అతన్ని చంపబోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇదొక విభిన్నమైన ప్రేమ కథ. నిజమైన ప్రేమను, అమ్మచెప్పిందనో, నాన్న చెప్పాడనో, లేక స్నేహితుడు చెప్పాడనో, స్వయం నిర్ణయం లేకుండా తిరస్కరిస్తే, ఆ తర్వాత అది అందని ద్రాక్షే అవుతుందనీ, జీవితం సర్వనాశనం అవుతుందనీ తెలిపే ప్రేమకథ ఈ చిత్రం. ఈ చిత్రాన్ని దర్శకుడు రఘుపతి పాత్ర ఆత్మహత్య చేసుకోవటంతో ప్రారంభిస్తాడు. అతని పుట్టుక, అతని ప్రేమ, అది విఫలమవటం, తర్వాత ఆత్మహత్య నుండి బయటపడి అమెరికా వెళ్ళటం, అక్కడ అమెరికా అంటే అసహ్యం వేసి, అక్కడి నుండి తిరిగి ఇండియా రావాలనుకోవటం, అక్కడ మోహన్ అనే పాత్ర తన జీవితం గురించి చెప్పి అతన్ని ఓదార్చటం, ఇవన్నీ చిత్రీకరించిన విధానం కొత్తగా ఉంటుంది. అంటే స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది.అలాగే కథకు ఎప్పుడు ఏ పాత్ర అవసరమో ఆ యా పాత్రలను ప్రవేశపెట్టి, ఆ పాత్రలను దర్శకుడు వాడుకున్న తీరు బాగుంది. ఇక నటన విషయానికొస్తే కొత్తవాడైనా హీరో బాగానే నటించాడు. ఇక తమన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒక హీరోయిన్‌కి ఇలాంటి విభిన్నమైన పాత్రలో నటించాలంటే చాలా ధైర్యం ఉండాలి. మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం:- రెహమాన్ మేనల్లుడు ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇతని సంగీతంలో రెహమాన్ పోలికలెక్కువగా ఉన్నాయి. పాటల్లో తొలి పాట, చివరి పాట బాగున్నాయి. రీ-రికార్డింగ్ బాగుంది. కెమెరా:- ఈ చిత్రానికున్న ఎస్సెట్స్ లో కెమెరా ఒకటి. ప్రతీది ఒక దృశ్య కావ్యంలా మలిచే ప్రయత్నం చేశాడు కెమెరామెన్‌ జీవా శంకర్. ముఖ్యంగా పాటల్లో కెమెరా పనితనం బాగుంది. కెమెరామెన్‌ అమెరికా అందాలను చాలా చక్కగా చూపించాడు. ఎడిటింగ్:- గ్రేట్‍ డైరెక్టర్‍ శంకర్‍ చిత్రాలకు ఎడిటర్‍గా పనిచేసే విజయన్‍ ఈ చిత్రానికి ఎడిటింగ్‍ చేశాడు. అతని పనితనం గురించి చెప్పటం ఇంకా అవసరమంటారా...? పాటలు:- డబ్బింగ్ చిత్రానికి వ్రాసిన పాటల్లా ఉన్నాయే కానీ పాటల్లో జీవం లేదు. మాటలు:- "నిన్ను చీ కొట్టిన వాళ్ళకు నువ్వు బాగుపడి పైకొచ్చి చూపించటమే, నువ్వు వాళ్లమీద తీర్చుకునే పగ" వంటి మాటలు బాగున్నాయి. తండ్రి వెన్నెలకంటి పేరుని నిలబెట్టే కొడుకవుతాడు శశాంక్ వెన్నెలకంటి. మాటలు బాగున్నాయి. ఇదొక విభిన్నమైన ప్రేమ కథ. నిజమైన ప్రేమను, అమ్మచెప్పిందనో, నాన్న చెప్పాడనో, లేక స్నేహితుడు చెప్పాడనో, స్వయం నిర్ణయం లేకుండా తిరస్కరిస్తే, ఆ తర్వాత అది అందని ద్రాక్షే అవుతుందనీ, జీవితం సర్వనాశనం అవుతుందనీ తెలిపే ప్రేమకథ ఈ చిత్రం. ఇలాంటి అమ్మాయిలు, అబ్బాయిలు మన ప్రస్తుత సమాజంలో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ సినిమా చూస్తే వాళ్లు తమ జీవితం విలువ తెలుసుకుంటారేమో. అసలు నిజమైన ప్రేమంటే నేడు ఎంతమందికి తెలుసో అర్థం కాని పరిస్థితి మన ప్రస్తుత సమాజంలో ఉంది. ప్రేమకు, ఆకర్షణకూ మధ్య ఉండే ఒక సన్నటి గీత తెలుసుకోగలిగితే నేటి యువతరం తమ జీవితంలో ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడకుండా, తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఈ చిత్రం ఉద్దేశ్యం బహుశా అదేనేమో.