English | Telugu
బ్యానర్:మైత్రి మూవీ మేకర్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 10, 2023
సినిమా పేరు: అమిగోస్
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాశ్, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్
సంగీతం: జిబ్రాన్
ఎడిటర్: తమ్మిరాజు
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023
కొత్త తరహా కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడు. అలా కొత్త దర్శకుడితో ఆయన చేసిన మరో విభిన్న చిత్రం 'అమిగోస్'. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నటించిన సినిమా కావడంతో పాటు.. మొదటిసారి ఆయన ట్రిపుల్ రోల్ పోషించడంతో అమిగోస్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ అమిగోస్ మూవీ ఎలా ఉంది? వరుసగా కళ్యాణ్ రామ్ కి మరో విజయాన్ని అందించేలా ఉందా?..
కథ:
హైదరాబాద్ కి చెందిన సిద్ధార్థ్(కళ్యాణ్ రామ్) తన తండ్రితో కలిసి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అతను ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్)పై మనసు పారేసుకుంటాడు. సిద్ధార్థ్ ఆమె ప్రేమను పొందే ప్రయత్నాల్లో ఉండగా.. ఒక వెబ్ సైట్ ద్వారా తనలాగా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుసుకుంటాడు. వారిలో ఒకరు బెంగళూరుకి చెందిన మంజునాథ్(కళ్యాణ్ రామ్), మరొకరు కలకత్తాకు చెందిన మైఖేల్(కళ్యాణ్ రామ్). ఈ ముగ్గురూ వెబ్ సైట్ ద్వారా పరిచయమై.. గోవాలో కలుసుకుంటారు. ముగ్గురి మధ్య ఎలాంటి బంధం లేకపోయినా.. ఒకరిని పోలి ఒకరు ఉండటంతో ముగ్గురూ తక్కువ సమయంలోనే మంచి స్నేహితులు అవుతారు. మరోవైపు ఎన్ఐఏ వాళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిపిన్(మైఖేల్)ని వెతుకుతుంటారు. అసలు మైఖేల్ అలియాస్ బిపిన్ ఎవరు? అతను సిద్ధార్థ్, మంజునాథ్ ల జీవితంలోకి ఎందుకొచ్చారు? అతను వచ్చాక వాళ్ళ జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? ఆ క్రిమినల్ నుంచి వాళ్ళు తప్పించుకోగలిగారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
రొటీన్ కథను ఎంచుకోకుండా డోపెల్‌గాంగర్(మనిషిని పోలిన మనుషులు) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో సినిమా రూపొందించిన దర్శకుడు రాజేంద్ర రెడ్డి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అయితే ఆయన ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఆయన పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ముఖ్యంగా ప్రథమార్థం తేలిపోయింది. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ కి తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. సాదాసీదా సన్నివేశాలతో కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా సాగిపోయింది. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పించలేదు. బ్రహ్మాజీ పాత్రతో కామెడీ పండించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ దర్శకుడు దానిని ఉపయోగించుకోలేకపోయాడు. ఇంటర్వెల్ డిజైన్ చేసిన తీరు బాగానే ఉంది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం మెరుగ్గా ఉంది. కాస్త ఆసక్తికరంగానే సాగింది.
ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. తరువాత ఏ జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగేలా చేయాలి. ఆ విషయంలో దర్శకుడు రాజేంద్రలోని రచయిత న్యాయం చేయలేకపోయాడు. ఆయన అనుకున్న కాన్సెప్ట్ బాగుంది. దానిని కథగా మలుచుకున్న తీరు బాగుంది. కానీ తెర మీద మెప్పించాలంటే అది సరిపోదు. ఆసక్తికరమైన కథనం తోడవ్వాలి. కాన్సెప్ట్ లాగానే సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉండాలి. సినిమా చూస్తే.. కేవలం కాన్సెప్ట్ ని నమ్ముకొని మిగతా విషయాల మీద దృష్టి పెట్టినట్లు లేదనిపిస్తోంది.
జిబ్రాన్ సంగీతం పరవాలేదు. 'ఎన్నో రాత్రులొస్తాయి' పాటలో ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా రీమిక్స్ చేసిన తీరు బాగుంది. ఎక ఎక సాంగ్ ఆకట్టుకునేలా లేదు. బిపిన్ పాత్ర థీమ్ సాంగ్ పర్లేదు. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
సిద్ధార్థ్, మంజునాథ్, బిపిన్(మైఖేల్) అనే మూడు విభిన్న పాత్రల్లో కళ్యాణ్ రామ్ చక్కగా రాణించాడు. పాత్రకు తగ్గట్లుగా ఆయన నడుచుకున్న తీరు, మాట తీరు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మంజునాథ్ లా అమాయకుడిలా, బిపిన్ లా పూర్తిస్థాయి విలన్ గా ఆయన మెప్పించాడు. ఇక ఆషికా రంగనాథ్ ఉన్నంతలో ఆకట్టుకుంది. బ్రహ్మాజీకి సిద్ధార్థ్ మామగా నిడివి ఎక్కువున్న పాత్ర లభించినప్పటికీ.. నవ్వించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. సెకండాఫ్ లో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సప్తగిరి సినిమాని అసలు కథలోకి తీసుకెళ్లే ఒక సన్నివేశంలో మెరిశాడు. పెద్దగా ఛాలెంజింగ్ గా లేని సిద్ధార్థ్ తండ్రి పాత్రలో జయప్రకాశ్ అలవోకగా నటించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎంచుకున్న కథాంశం బాగున్నప్పటికీ దానిని తెరమీదకు తీసుకురావడంలో తడబడ్డాడు. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్, కళ్యాణ్ రామ్ నటన కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.
-గంగసాని