Read more!

English | Telugu

సినిమా పేరు:అంబాజీపేట మ్యారేజి బ్యాండు
బ్యానర్:గీతా ఆర్ట్స్‌ 2
Rating:2.75
విడుదలయిన తేది:Feb 2, 2024

సినిమా పేరు: అంబాజీపేట మ్యారేజి బ్యాండు
తారాగణం: సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
డీఓపీ: వాజిద్ బేగ్
ఎడిటర్: కొదాటి పవన్ కల్యాణ్
రచన, దర్శకత్వం: దుశ్యంత్‌ కటికినేని
నిర్మాత: ధీరజ్ మోగిలినేని
బ్యానర్స్: గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2024

కమెడియన్ నుంచి హీరోగా మారిన సుహాస్.. విభిన్న చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అతను హీరోగా నటించిన 'కలర్ ఫొటో', 'రైటర్ పద్మభూషణ్' సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ప్రచారం చిత్రాలతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి రా అండ్ రస్టిక్ గా రూపొందిన ఈ సినిమా సుహాస్ కి మరో విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మల్లి(సుహాస్) తన కులవృత్తి అయిన క్షవరం చేస్తూనే, అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఒక సభ్యుడిగా ఉంటాడు. అతని అక్క పద్మ(శరణ్య ప్రదీప్) బాగా చదువుకొని వాళ్ళ ఊరి స్కూల్ లోనే టీచర్ ఉద్యోగం చేస్తుంటుంది. ఆ ఊరిలోనే ధనవంతుడైన వెంకట్ బాబు(నితిన్ ప్రసన్న) ఉంటాడు. అతని వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో పుకారు మొదలవుతుంది. మరోవైపు వెంకట్ బాబు చెల్లి లక్ష్మి(శివాని నాగరం), మల్లి ప్రేమలో పడతారు. ఇంకో పక్క స్కూల్ విషయంలో వెంకట్ బాబు తమ్ముడికి, పద్మకి మధ్య గొడవ జరుగుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న వెంకట్ బాబు.. మల్లి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? మల్లి కుటుంబాన్ని వెంకట్ ఎలాంటి ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశాడు? మల్లి, లక్ష్మి ఒక్కటయ్యారా? వెంకట్ కి మల్లి, పద్మ సరైన బుద్ధి చెప్పారా? అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరిగిన పోరాటంలో విజయం ఎవరిని వరించింది? అనేవి సినిమాలో చూడాల్సిందే.


ఎనాలసిస్ :

అగ్ర కులానికి చెందిన డబ్బున్న అమ్మాయిని, తక్కువ కులానికి చెందిన పేదింటి కుర్రాడు ప్రేమించడం.. ఆ విషయం అమ్మాయి కుటుంబం వారికి తెలిసి హీరోని, అతని కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడం అనే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రం కూడా ఆ తరహా కథతోనే రూపొందింది. అయితే దర్శకుడు ప్రేమ చుట్టూ కంటే కూడా ప్రధానంగా ఆత్మాభిమానం చుట్టూ కథని నడిపే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమా తెలిసిన కథే అయినప్పటికీ కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఆసక్తికర కథనం.. దానికి తగ్గ మంచి సన్నివేశాలు, భావోద్వేగాలు తోడైతే తెలిసిన కథని కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చెప్పవచ్చు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు విషయంలో అదే జరిగింది. సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనట్లు అనిపించినప్పటికీ.. కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఫస్టాఫ్ లో వచ్చే మల్లి, లక్ష్మి ప్రేమ సన్నివేశాలు యూత్ కి కనెక్ట్ అవుతాయి. కథలోకి వెళ్తున్న కొద్దీ సీరియస్ గా సాగుతుంది. అప్పటిదాకా ఒక రకంగా సాగిన కథ ఇంటర్వెల్ కి ముందు మరో మలుపు తీసుకుంటుంది. సెకండాఫ్ ని ఎమోషనల్ గా మలిచాడు దర్శకుడు. అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినప్పటికీ.. కథ నుంచి ఎక్కడా పక్కకి వెళ్లకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడు. హీరో మల్లి పాత్ర కంటే కూడా అతని అక్క పద్మ ఆత్మాభిమానం చుట్టూ ప్రధానంగా కథని నడుపుతూ.. ఒకానొక సమయంలో ఈ కథకి హీరో శరణ్యనే అనుకునేలా చేశాడు. పతాక సన్నివేశాలు కూడా మెప్పించాయి. అక్కడక్కడా సాగదీత, కొన్ని సినిమాటిక్ గా అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు మెప్పించేలా ఉంది.

ఈ సినిమాకి రచన ప్రధాన బలంగా నిలిచింది. సన్నివేశాలు సహజంగా, సంభాషణలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. అన్ని సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. తెలుగులో అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ చంద్ర.. మరోసారి పాటలతో, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. వాజిద్ బేగ్ కెమెరా పనితనం కథా నేపథ్యానికి తగ్గట్టుగా ఉండి, కట్టి పడేసింది. ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సుహాస్ తన సహజమైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కట్టిపడేసాడు. శరణ్య ప్రదీప్ ఈ సినిమాకి మరో హీరోలా అనిపించింది. ఆమె పాత్ర ఎంత బలంగా ఉందో.. అందుకు తగ్గట్టే ఆ పాత్రలో జీవించేసింది శరణ్య. ఈ సినిమాతో ఆమెకి మరిన్ని మంచి పాత్రలు లభించే అవకాశముంది. లక్ష్మీగా శివాని నాగరం, వెంకట్ బాబు గా నితిన్ ప్రసన్న వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మల్లి స్నేహితుడి పాత్రలో జగదీష్ ఆకట్టుకున్నాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఆత్మాభిమానం కోసం ఓ మహిళ సాగించే పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మెప్పిస్తుంది. ప్రేమ, పరువు చుట్టూ నడిచే.. బాగా తెలిసిన కథే అయినప్పటికీ.. బలమైన సన్నివేశాలు, భావోద్వేగాలతో దర్శకుడు ఈ సినిమాని చక్కగా మలిచాడు. అక్కడక్కడా సాగదీత, కొన్ని సినిమాటిక్ గా అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రం ఆకట్టుకునేలా ఉంది.