Read more!

English | Telugu

సినిమా పేరు:అలా మొదలైంది
బ్యానర్:శ్రీ రంజిత్ మూవీస్
Rating:3.25
విడుదలయిన తేది:Jan 21, 2011
గౌతమ్(నాని)అనే ఒకబ్బాయి ప్రేమించిన అమ్మాయికి,నిత్య(నిత్య మీనన్)అనే అమ్మాయి ప్రేమించిన అబ్బాయికీ పెళ్ళవుతూంటే అక్కడ ఈ గౌతమ్,నిత్య ఫుల్ గా మందుకొట్టి కలుసుకుంటారు.ఆ తర్వాత బెంగుళూరుకు చెందిన నిత్య హైదరాబాద్ కి వస్తుంది.అక్కడ పింకీ అనే గౌతమ్ ఫ్రెండ్ కి నిత్య కూడా ఫ్రెండే కావటంతో హైదరాబాద్ లో మళ్ళీ గౌతమ్ ని కలుస్తుంది నిత్య.వీళ్ళు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా కొన్ని పరిస్థితుల కారణంగా కలుసుకుని ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరికి చెప్పుకోలేరు.ఎలాగంటే గౌతమ్ రెండవ సారి నిత్యను కలసినప్పుడు తాను నిత్యను ప్రేమిస్తున్న విషయం చెపుదామనుకుంటుండగా,నిత్యను పెళ్ళిచేసుకోబోయే కుర్రాడు నిత్యతో కనిపిస్తాడు.గౌతమ్ ని తాను ప్రేమిస్తున్నానని నిత్య హైదరాబాద్ కి వచ్చి చెబుదామనుకుంటే అక్కడ గౌతమ్ ఫియాన్సీ కావ్య (స్నేహా ఉల్లాల్)మెళ్ళో నల్లపూసలతో వచ్చి తలుపు తీస్తుంది.దాంతో నిత్య గౌతమ్ కి పెళ్ళయిపోయిందనే ఉద్దేశంతో తన ప్రేమను గౌతమ్ కి చెప్పకుండానే బెంగుళూరుకు వెనుతిరుగుతుంది.తనకు పెళ్ళయిందని నిత్య అపార్థం చేసుకుందనీ,అదే అపార్థంతో నిత్య పెళ్ళికి సిద్ధపడిందనీ,పింకీ ద్వారా తెలుసుకున్న గౌతమ్ నిత్యను కలవటానికి బెంగుళూరు బయలుదేరితే అతన్ని జాన్ (ఆశష్ విద్యార్థి)కిడ్నాప్ చేస్తాడు.గౌతమ్ ని జాన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు...?కిడ్నాపర్ జాన్ బారి నుంచి గౌతమ్ ఎలా బయటపడ్డాడు..?గౌతమ్,నిత్య చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్రం కథ
ఎనాలసిస్ :
నందినీ రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించినా ఎక్కడా ఆ తడబాటు కనిపించలేదు.తనకు ఏం కావాలో,తానేం తీయాలనుకుందో,ఏం చెప్పాలనుకుందో అన్న విషయంలో నందినీకి చాలా క్లారిటీ ఉందన్న విషయం ఈ సినిమా చూస్తే మనకర్థమవుతుంది.టేకింగ్ పరంగా ఈ చిత్రం చాలా నీట్ గా డీసెంట్ గా ఉంది.స్క్రీన్ ప్లే బాగుంది.ఫస్ట్ హాఫ్ లో సినిమా కాస్త స్లో అనిపించినా రాను రానూ సినిమా టెంపో బాగుంది.తెలుగు సినీ పరిశ్రమలో నందినీ రెడ్డి ఒక మంచి దర్శకురాలుగా నిలబడుతుంది. ఈమె నుండి ప్రేక్షకులు మంచి సినిమాలను ఆశించవచ్చు.నిర్మాణపు విలువలు బాగున్నాయి. నటన- ఈ చిత్రంలో హీరోగా నాని చాలా చక్కని నటన కనబరిచాడు.అతనికి అతి త్వరలో స్టార్ డమ్ వచ్చే సూచనలున్నాయి.ముఖంలో అతి చిన్న చిన్న భావాలు కూడా ప్రస్ఫుటంగా పలికించగల నేర్పు నానీకి బహుశా పుట్టుకతోనే అబ్బిందేమోననిపిస్తుంది.నిజానికి అతను ఈ చిత్రంలో నటించలేదు.గౌతమ్ పాత్రలా బిహేవ్ చేశాడని చెపితే యాప్ట్ గా ఉంటుంది.ఇక నిత్య మీనన్ కాస్త పొట్టి అమ్మాయి అయినా చాలా మంచి నటి ఆ అమ్మాయిలో ఉంది.నానీకి ఆ అమ్మాయి నటనలో ఏ మాత్రం తీసిపోకుండా నటించింది.ఇక ఆశిష్ విద్యార్థి,ఉప్పలపాటి నారాయణరావు,ప్రగతి అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం- కళ్యాణి మాలిక్ ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు.అతను సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చక్కని ప్రేక్షకాదరణతో హిట్టయ్యాయి.ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగున్నాయి.రీ-రికార్డింగ్ కూడా సందర్భోచితంగా ఉండి బాగుంది. సినిమాటోగ్రఫీ - ఈ చిత్రంలోని కెమెరా వర్క్ బాగుంది.లైటింగ్ స్కీమ్ బాగుంది.కెమెరా యాంగిల్స్ కొత్తగా ఉండేలా అర్జున్ జాగ్రత్తపడ్డాడు. మాటలు -ఈ చిత్రానికి మాటలు పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి.ఈ చిత్రానికి మాటలు వ్రాసిన లక్ష్మీ భూపాల్ గతంలో "చందమామ"వంటి హిట్‍ చిత్రంతో సహా 20 కి పైగా చిత్రాలకు మాటలు వ్రాశారు.ఈ చిత్రంలోని మాటలు ఎక్కడా సినిమాటిక్ గా ఉండకుండా సహజంగా ఉండటం వల్ల ప్రేక్షకులను ఇట్టే సినిమాలోకి లాగేస్తాయి.అది దర్శకురాలికి ప్లస్సయ్యింది.రొటీన్ కి భిన్నంగా తెలుగు సినీ పరిశ్రమకు ఒక మంచి మాటల రచయిత,అలాగే లిరిక్ రచయిత కూడా దొరికాడని చెప్పొచ్చు. పాటలు - సాహిత్యపరంగా కూడా ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి.ముఖ్యంగా "ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే..నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే"పాట సింపుల్‍ పదాలతో గతంలో ఆచార్య ఆత్రేయ వ్రాసిన స్టైల్లో సాగుతూ ప్రేక్షకులు ఈజీగా హమ్ చేసుకునేలా ఉంది.భావాన్ని తేలికగా ఉండే వాడుక పదాలతో సింపుల్ గా చెప్పటం ఒక కళ.అది ఈ పాటలో మనకు కనపడుతుందీ, వినపడుతుంది. ఎడిటింగ్ - చాలా బాగుంది. ఆర్ట్ - చక్కగా ఉంది. కొరియోగ్రఫీ - ఈ చిత్రంలో కొరియోగ్రఫీ కొత్తపుంతలు తోక్కింది.పిచ్చి పిచ్చి గంతులు లేకుండా పాట భావానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి స్టెప్స్ కి రెండవ స్థానాన్నివ్వటం ఈ చిత్ర దర్శకురాలి అభిరుచిని తెలియజేస్తుంది.ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ - ఈ సినిమాలో యాక్షనే లేదు.అసలు ఈ సినిమాకి నిజానికి యాక్షన్ అవసరం లేదు కూడా.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ ఉన్న,క్లీన్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగుంటుంది.అదీ సకుటుంబంగాచూడొచ్చు.ఇక యూత్ కి ఈ సినిమా ఒక పండగలాంటిదే."ఆనంద్"తర్వాత ఈ చిత్రం మళ్ళీ "అలా మొదలయ్యింది".