English | Telugu
బ్యానర్:మహాతేజ క్రియేషన్స్, యస్ ఒరిజినల్స్
Rating:2.75
విడుదలయిన తేది:Nov 19, 2021
సినిమా పేరు: అద్భుతం
తారాగణం: తేజ సజ్జా, శివాని రాజశేఖర్, శివాజీ రాజా, తులసి, సత్య, దేవీప్రసాద్, అంజలి, కృష్ణచైతన్య, మిర్చి కిరణ్, చమ్మక్ చంద్ర, బుల్లెట్ భాస్కర్
కథ: ప్రశాంత్ వర్మ
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: లక్ష్మీ భూపాల
పాటలు: కృష్ణకాంత్
సంగీతం: రథన్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
స్టంట్స్: వెంకట్, రియల్ సతీశ్
కొరియోగ్రఫీ: విజయ్ బిన్నీ, యశ్
సహనిర్మాత: సృజన్ యరబోలు
నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి
దర్శకత్వం: మల్లిక్ రామ్
బ్యానర్స్: మహాతేజ క్రియేషన్స్, యస్ ఒరిజినల్స్
నిడివి: 2:21 గంటలు
విడుదల తేదీ: 19 నవంబర్ 2021
ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఓటీటీ)
రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమాగా 'అద్భుతం' ప్రచారం పొందింది. 'జాంబీరెడ్డి' హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవడం కొంతమందికి అసంతృప్తికి కలిగించి వుండవచ్చు కానీ, సేఫ్ గేమ్‌లో భాగంగా ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌నే ఆప్షన్‌గా ఎంచుకోవడంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఇలా వచ్చిన 'అద్భుతం' టైటిల్‌కు తగ్గట్లే ఉందా?
కథ:- తండ్రిని కోల్పోయి, ప్రేమలో వైఫల్యం చెంది ఇక జీవితంలో సాధించేదేమీ లేదనుకున్న సూర్య (తేజ), తండ్రి తెచ్చిన పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టంలేక, చదువులో ముందుకు వెళ్లలేక ఫ్రస్టేషన్‌కు గురైన వెన్నెల (శివానీ) ఒకే టైమ్‌లో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చనిపోయే ముందు తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని తన ఫోన్ నంబర్‌కే మెసేజ్ పెట్టుకుంటాడు సూర్య. ఆ మెసేజ్ వెన్నెల ఫోన్‌కు వస్తుంది. ఆత్మహత్యా ప్రయత్నం మాని, ఇద్దరి ఫోన్ నెంబర్లు ఒకటే ఎందుకున్నాయనీ, అదెలా సాధ్యమనీ అన్వేషణలో పడతారు. అప్పుడు తాము వేర్వేరు కాలాల్లో వున్నామనే విషయం వెల్లడవుతుంది. 2014లో ఉన్న వెన్నెల, 2019లో ఉన్న సూర్య ఫోన్‌లో ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకోగలిగారు, వారి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి, ఆ ఇద్దరూ ఎప్పటికైనా కలుసుకోగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
టైమ్ ట్రావెల్ కథలతో ఇటీవల హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తయారవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'డార్క్' ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో చాలామందికి తెలుసు. తెలుగులో చాలా ఏళ్ల క్రితమే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు 'ఆదిత్య 369'ను తీసి, విజయం సాధించారు. 'అద్భుతం' విషయానికి వస్తే.. దీనికి కథ అందించింది డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ. మకోటో షింకై డైరెక్ట్ చేసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ 'యువర్ నేమ్' (2016) స్టోరీ ఆధారంగా 'అద్భుతం' కథను ప్రశాంత్‌వర్మ రాశాడనే విషయం ఆ సినిమా చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.
సైన్స్ ఫిక్షన్ కాబట్టి నేటి లాజిక్‌ను పక్కనపెట్టేసి, సైన్స్‌కు అందని అద్భుతమైన విషయాలు ఈ లోకంలో చాలానే ఉన్నాయనే అవగాహనతో ఈ సినిమాని చూస్తే.. 'అద్భుతం' మూవీని డైరెక్టర్ మల్లిక్ రామ్ బాగానే హ్యాండిల్ చేశాడనిపిస్తుంది. కథనంలో ఇంట్రెస్ట్‌ను కలిగించడంలో అతను చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో క్రెడిట్ స్క్రీన్‌ప్లే రైటర్ అయిన లక్ష్మీ భూపాలకు ఎక్కువగా చెందుతుంది. తనకంటే ఐదేళ్ల కాలం వెనకున్న వెన్నెలతో సూర్య జరిపే సంభాషణలు, ఆమె సాయంతో తన జీవితంలో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను మార్చడానికి సూర్య ప్రయత్నించడం ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ సందర్భంగా వచ్చే మలుపులు ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి.
సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ నేటివిటీని మిస్సవకపోవడం 'అద్భుతం'కు సంబంధించి ఒక ప్లస్ పాయింట్. కూతురి పెళ్లి చేయడానికి ఓ మధ్యతరగతి తండ్రి పడే ఆరాటం వెన్నెల తండ్రి (దేవీప్రసాద్) పాత్ర ద్వారా, కొడుకు బాగా చదువుకొని, మంచి ఉద్యోగంలో చేరకుండా మ్యూజిక్ అంటూ కెరీర్ పాడు చేసుకోబోతున్నాడని ఆందోళన చెందే ఓ సగటు తండ్రి (శివాజీరాజా) పాత్ర ద్వారా మన సెన్సిబిలిటీస్‌ను చూపించారు. వెన్నెలను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే చమ్మక్ చంద్ర పాత్రతో, వెన్నెల గురించి సూర్య చెప్పే విషయాలను నమ్మకుండా తనదైన ధోరణిలో ఉండే సత్య పాత్రతో వినోదాన్ని అందించే ప్రయత్నం చేశారు కానీ అందులో పాక్షికంగానే సఫలమయ్యారు. కొన్నిసార్లు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించే వారి సీన్లు, కొన్నిసార్లు కథనానికి అడ్డుపడ్డట్లు తోస్తాయి.
అయినప్పటికీ ఏదైనా అద్భుతం జరిగి సూర్య, వెన్నెల కలుసుకుంటే బాగుండుననే ఫీలింగ్ తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. వారు కలుసుకోవాలనుకున్నప్పుడల్లా ప్రకృతి స్పందించే తీరు 'యువర్ నేమ్' మూవీ సీన్స్‌ను గుర్తుకు తెచ్చింది. అక్కడిలాగే ఆకాశంలో గులాబీ రంగు మేఘాలను సృష్టించడం యాదృచ్ఛికమేనా?! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా గులాబీ సేన (టీఆర్ఎస్) సంబరాలు చేసుకునే సందర్భాన్ని ఒక సీన్‌లో ఉపయోగించుకున్నారు.
టెక్నికల్‌గా చూస్తే.. స్క్రీన్‌ప్లే, సంభాషణలు ఈ సినిమాకు ఎస్సెట్. రథన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల్లోని మూడ్‌కు తగ్గట్లే సాగింది. కృష్ణకాంత్ రాసిన పాటలు గొప్పగా లేకపోయినా, పంటికింద రాళ్లలా అయితే లేవు. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రెండు కాలాలకు సంబంధించిన వేరియేషన్‌ను చూపించాడు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఇంప్రెసివ్‌గా ఉంది.
"కొన్ని కథల్లో నిజాలుంటాయి.. కొన్ని కథల్లో అబద్ధాలుంటాయి.. నిజానికి, అబద్ధానికి దూరంగా ఉండే కథలు అద్భుతంగా ఉంటాయి." అని ఆఖరులో చెప్పారు. అది నిజమే కదా!
నటీనటుల పనితీరు
సూర్య, వెన్నెల పాత్రల్లో తేజ, శివానీ చక్కగా రాణించారు. బాలనటుడి నుంచి ఎదిగిన వాడు కావడంతో తేజ తన పాత్రను అనాయాసంగా చేసేశాడు. సెంటిమెంట్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో పరిణతి చూపించాడు. నిజానికి '2 స్టేట్స్' రీమేక్ ద్వారా ఇంట్రడ్యూస్ కావాల్సిన శివాని ఆ సినిమా ఆగిపోవడంతో 'అద్భుతం' ద్వారా తొలిసారి మనముందుకు వచ్చింది. అక్కడక్కడా కొన్ని షాట్స్ మినహా చాలావరకు వెన్నెల పాత్రకు న్యాయం చేకూర్చింది. ఎమోషనల్ సీన్స్‌ను పండించగలనని నిరూపించుకుంది. అందంగానూ ఉంది. సూర్య తండ్రిగా శివాజీరాజా ఆడియెన్స్ సానుభూతి పొందే పాత్రను చేశారు. సగటు ఆడపిల్ల తండ్రిగా దేవీప్రసాద్ తన పాత్రకు న్యాయం చేకూర్చారు. వెన్నెల నాయనమ్మ ('యువర్ నేమ్'లోనూ ఈ నాయనమ్మ పాత్ర ఉంటుంది.. గమనించగలరు) పాత్రకు తులసి సరిగ్గా సరిపోయారు. చమ్మక్ చంద్ర, సత్య తమకిచ్చిన పాత్రల్లో ఇమిడిపోయారు. బుల్లెట్ భాస్కర్ కనిపించేది ఒక సీన్‌లో అయినా తన ముద్ర వేశాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
లాజిక్‌ల జోలికి పోకుండా సైన్స్ ఫిక్షన్.. అందులోనూ టైమ్ ట్రావెల్ కథలు ఎలా ఉంటాయనే తెలివిడి ఉన్నవాళ్లతో పాటు.. ఒక కొత్త తరహా అనుభవం, అనుభూతి కావాలనుకొనే ప్రేక్షకులకు 'అద్భుతం' నచ్చుతుంది. మిగతావాళ్లకు ఈ టైమ్ ట్రావెల్ సంగతేంటో బోధపడక కథలో వచ్చే పలు మలుపులకు తికమకపడి, 'ఏంటీ కథ, ఏంటీ సినిమా?' అనిపించవచ్చు.
- బుద్ధి యజ్ఞమూర్తి