English | Telugu
బ్యానర్:విష్ణు విశాల్ స్టూడియోస్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 7, 2025
సినిమా పేరు: ఆర్యన్
తారాగణం: విష్ణు విశాల్, సెల్వ రాఘవన్, శ్రద్ద శ్రీనాధ్, మానస చౌదరి,కరుణాకరన్, తారక్ పొన్నప్ప తదితరులు
మ్యూజిక్: జిబ్రాన్
ఎడిటర్: సాన్ లోకేష్
రచన, దర్శకత్వం: ప్రవీణ్
సినిమాటోగ్రాఫర్: హరీష్ కన్నన్
బ్యానర్ : విష్ణు విశాల్ స్టూడియోస్
నిర్మాత: విష్ణు విశాల్
విడుదల తేదీ: నవంబర్ 7 2025
విష్ణు విశాల్(Vishnu Vishal)పోలీస్ ఆఫీసర్ గా, విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్(Selva Raghavan)ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఆర్యన్(Aaryan). క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తమిళనాట అక్టోబర్ 30 న విడుదలై మంచి మౌత్ టాక్ తో రన్ అవుతుంది. నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
నంది (విష్ణు విశాల్) సిన్సియర్ పోలీస్ అధికారి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేస్తుంటాడు. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా చాకచక్యంగా డీల్ చెయ్యగల సమర్థుడు. ఆత్రేయ(సెల్వ రాఘవన్) పేరెన్నిక గన్న టీవీ ఛానల్ లో ఒక హీరోతో జరుగుతున్న లైవ్ డిబేట్ కి ఆడియన్ లాగా వెళ్తాడు. రివాల్వర్ తో హీరోని గాయపరిచి అక్కడి వాళ్ళందర్నీ చంపుతానని బెదిరించి ఛానల్ ని తన గుప్పిట్లో ఉంచుకుంటాడు. ఛానల్ యాంకర్ నయన(శ్రద్ద శ్రీనాధ్) ఆత్రేయ ని ఇంటర్వ్యూ చేస్తుంది. నాతో సహా ఆరుగురిని చంపబోతున్నానని చెప్తాడు.అన్నట్టుగానే తనని తాను కాల్చుకొని లైవ్ లో సమాజం మొత్తం చూస్తుండగానే చనిపోతాడు. కానీ తను చెప్పినట్టుగానే ఐదుగురిలో ఒక్కకొకర్ని చంపుతు ఉంటాడు. పైగా తను చంపే వాళ్లంతా ఎంతో మంచి వాళ్ళు. చనిపోయిన వ్యక్తి వేరే వాళ్ళని చంపడం ఎలా సాధ్యమవుతుంది? ఆ హత్యల వెనక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? అసలు ఆత్రేయ ఎవరు? ఈ కేసుని నంది ఎలా ఛేదించాడు. ఆత్రేయ చెప్పినట్టుగానే ఐదుగురిని పూర్తిగా చంపేశాడా? అసలు ఆర్యన్ అనే పేరు వెనక ఉన్న కథ ఏంటనేదే చిత్ర కథ.
ఎనాలసిస్ :
ఏ ఉద్దేశ్యంతో అయితే ఆర్యన్ ని తెరకెక్కించారో ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ప్రతి సీన్ ఆసక్తిని కలగచెయ్యడంతో పాటు, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. కాకపోతే పోలీస్ ఇన్విస్టిగేషన్ ని ఎక్కువగా చూపించాల్సింది. పకడ్బందీ స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ ఫార్మెన్స్ బాగుండటంతో ఇన్విస్టిగేషన్ లోటు తెలియలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభమే ఆత్రేయ టీవీ ఛానల్ డిబేట్ కి రావడం, హీరోని కాల్చి తన లక్ష్యం చెప్తాడు. దాంతో మనకి తెలియకుండానే సినిమాకి సరెండర్ అవుతాం.
అందుకు తగ్గట్టే ప్రతి సన్నివేశం వచ్చింది. ముఖ్యంగా చనిపోయిన సెల్వరాఘవన్ చేస్తున్న హత్యలు క్యూరియాసిటీని కలిగిస్తాయి.స్క్రీన్ పై సినిమా రన్ అవుతున్నంత సేపు ఆ హత్యల వెనక కారణం ఏమై ఉంటుందనే ఆసక్తితో లీనమైపోతాం. మేకర్స్ అందుకు తగ్గట్టే ఎక్కడ లాగ్ అనేది లేకుండా చూసుకున్నారు. నంది, అతని భార్య అనిత మధ్య వచ్చిన సీన్స్ కూడా ఎంతో క్వాలిటీ తో ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి తగ్గట్టే వేగంగా కదిలింది. ఆత్రేయ ఎందుకు చంపుతున్నాడో తెలిసి ఆశ్చర్యపోతాం.
ఆత్రేయ చంపేది మంచి వాళ్లనే కాబట్టి, వాళ్ళ సీన్స్ ని సినిమా మొదట నుంచి రివర్స్ స్క్రీన్ ప్లేలో చెప్తూ ఉండాల్సింది. ఆత్రేయ వాళ్ళని ఎందుకు చంపుతున్నాడనే విషయంతో పాటు, నెగిటివ్ రోల్ గా మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. కథ లక్ష్యం ప్రకారం సమాజంలో మార్పు మొదలవ్వడం కూడా చూపించాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుండటంతో పాటు చివర్లో ఇచ్చిన ఫజిల్ బాగుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
డిసిపి నందిగా విష్ణు విశాల్ అత్యద్భుతమైన ప్రదర్శనని కనపరిచాడు. నటనలో విభిన్న కోణాలు లేకపోయినా క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కి పెట్టింది పేరైన సెల్వ రాఘవన్ ఆత్రేయగా మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తన హవా చాటాడు. శ్రద్ద శ్రీనాధ్, మానస చౌదరి నటనలో పెద్దగా మెరుపులు లేవు. ఈ కథకి అంతకంటే ఎక్కువగా చెయ్యడానికి కూడా ఏముండదు. ఆ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన క్యారక్టర్ అంటు లేకపోయినా కెమెరా ముందు తళుక్కుమన్న వాళ్లంతా తమ పరిధి మేరకు నటించి సినిమాని నిండుతనాన్ని తెచ్చారు. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రధాన బలంగా నిలిచింది. తను లేకపోతే ఈ సినిమాని ఊహించలేం. అంతలా మెస్మరైజ్ చేసాడు. ఫొటోగ్రఫీ కూడా అదే పరిస్థితి. ఆర్యన్ కి ప్రాణంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా, రచయితగా రెండు విభాగాల్లోను ప్రవీణ్(Praveen k)సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్, సదరు షాట్ కి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ ని ఆర్యన్ మెప్పిస్తుంది. కాకపోతే కథ మెయిన్ పాయింట్ లో దాగి ఉన్న అసలు విషయంలో క్లారిఫికేషన్ ని పూర్తిగా ఇవ్వలేదు. టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో ఉంది.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.