Read more!

English | Telugu

సినిమా పేరు:ఆ ఒక్కటీ అడక్కు
బ్యానర్:చిలకా ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:May 3, 2024

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లివర్, హరితేజ, అరియానా తదితరులు 
సంగీతం: గోపి సుందర్ 
మాటలు: అబ్బూరి రవి 
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
కెమెరా: సూర్య 
దర్శకత్వం: మల్లి అంకం 
నిర్మాత: రాజీవ్ చిలక 

 

అప్పట్లో కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ మునుపటిలా కామెడీతో మ్యాజిక్ చేశాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:
గణపతి(అల్లరి నరేష్) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడుకి పెళ్ళయ్యి, ఒక పాప కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగమున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా గణకి మాత్రం వివాహం జరగదు. 50 సంబంధాలు చూసినా ఏదీ సెట్ అవ్వదు. బంధువులు, తెలిసినవాళ్లంతా "పెళ్ళెప్పుడు", "పప్పన్నం ఎప్పుడు పెడతావు" అని అడుగుతూనే ఉంటారు. అలాంటి గణ, అనుకోకుండా వివాహాలు కుదిర్చే హ్యాపీ మాట్రిమోనీని సంప్రదిస్తాడు. అక్కడ వచ్చిన వధువుల ప్రొఫైల్స్ ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. అప్పటికే సిద్ధిని బయట చూసి, ఆమెపై సదాభిప్రాయమున్న గణ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ సిద్ధి మాత్రం గణని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. గణకి సిద్ధి నో చెప్పడానికి కారణమేంటి? అసలు సిద్ధి ఎవరు? ఆమె గణ జీవితంలోకి ఎలా వచ్చింది? అసలు గణకి పెళ్లి ఆలస్యం అవ్వడానికి కారణమేంటి? చివరికి తాను ఇష్టపడిన సిద్ధిని పెళ్లి చేసుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
 


ఎనాలసిస్ :

మాట్రిమోనీ పేరుతో బయట ఎన్నో మోసాలు జరగడం చూస్తున్నాం. దానిని కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ సీరియస్ పాయింట్ ని తీసుకొని, ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లీడు దాటిపోతున్నా, ఇంకా సింగిల్ గా ఉండే యువకులకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందే. తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నతో ఇబ్బంది పెడతారు. అలా ఇబ్బంది పడే ఓ యువకుడి పాత్రే ఈ సినిమాలోని కథానాయకుడిది. 

ఓ వైపు పెళ్లికాని ప్రసాద్ లాంటి హీరో పాత్ర, మరోవైపు మాట్రిమోనీ పేరుతో మోసాలు.. ఈ రెండింటిని కలుపుతూ కథని అల్లుకున్నారు. కథ ఆలోచన బాగున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా మలిచి, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. అల్లరి నరేష్ కొంచెం గ్యాప్ తరువాత చేసిన కామెడీ సినిమా కావడంతో.. ప్రేక్షకులు కామెడీ ఓ రేంజ్ లో ఆశిస్తారు. అలా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే కొన్ని నవ్వులు ఉన్నాయి. మునుపటి అల్లరి నరేష్ సినిమాలతో పోలిస్తే కామెడీ డోస్ బాగా తగ్గిపోయింది.

హీరో పెళ్లి గోల, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని హీరో అనుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ పరవాలేదు అన్నట్టుగా సాగింది. ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అవకాశముంది. ఓ రకంగా సినిమాలో అదే హైలైట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో కామెడీ డోస్ మరింత తగ్గింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాల ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒకట్రెండు సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మొత్తానికి కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు అన్నట్టుగా సినిమా సాగింది. సన్నివేశాలను కొత్తగా రాసుకొని, కామెడీ డోస్ పెంచినట్లయితే.. సినిమా అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది.

 

నటీనటుల పనితీరు:
అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. సిద్ధి పాత్రకు ఫరియా అబ్దుల్లా పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మరదలు పాత్రలో నటించిన జామీ లివర్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. తనదైన కామెడీతో కట్టిపడేసింది. తెలుగులో ఆమెకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్, హరితేజ, అరియానా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చాలారోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమా చేశాడు.. ఓ రేంజ్ లో నవ్వుకోవచ్చు అనే అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో పరవాలేదు అనేలా ఉంది. పెళ్లికాని యువకుల బాధని, మాట్రిమోనీ పేరుతో బయట జరుగుతున్న మోసాలను చూపించిన ఈ సినిమాను.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు.

- గంగసాని