Read more!

English | Telugu

సినిమా పేరు:ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
బ్యానర్:మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 16, 2022

సినిమా పేరు: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
తారాగణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, అరుణా భిక్షు, వ‌డ్ల‌మాని శ్రీ‌నివాస్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్ర‌ఫీ: పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్‌
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేశ్‌
సమర్పణ:  గాజులపల్లె సుధీర్ బాబు
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
విడుద‌ల తేదీ: 16 సెప్టెంబ‌ర్ 2022

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో ఇదివ‌ర‌కు 'స‌మ్మోహ‌నం', 'వి' సినిమాలు వ‌చ్చాయి. వాటిలో 'స‌మ్మోహ‌నం'ను ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కులు మెచ్చారు. 'వి' మూవీ నేరుగా ఓటీటీలో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వ‌రుస‌గా త‌న మూడో సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'ని సుధీర్ బాబుతోటే తీసి మ‌నం ముందుకు తెచ్చాడు మోహ‌న‌కృష్ణ‌. సంచ‌ల‌న తార కృతి శెట్టి నాయిక‌గా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌

వ‌రుస‌గా ఆరు క‌మ‌ర్షియ‌ల్ హిట్లు ఇచ్చిన ఫిల్మ్‌ డైరెక్ట‌ర్ న‌వీన్ (సుధీర్ బాబు)కు ఓసారి చెత్త‌లో ఓ బాక్స్ దొరుకుతుంది. అది ఓ అమ్మాయి ఫొటో షూట్‌కు సంబంధించిన రీల్‌. ఆ అమ్మాయి కోసం అన్వేషిస్తే.. ఆమె కంటి డాక్ట‌ర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుస్తుంది. త‌న త‌ర్వాత సినిమాలో హీరోయిన్ ఆమే అని ఫిక్స‌యిపోతాడు న‌వీన్‌. కానీ ఆమెకు కానీ, ఆమె త‌ల్లితండ్రుల‌కు కానీ సినిమా అంటేనే గిట్ట‌ద‌నీ, పైగా త‌ను అంత దాకా తీసిన బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను వాళ్లు చెత్త సినిమాలుగా భావిస్తుంటార‌నీ తెలుస్తుంది. అలేఖ్య‌తో ప‌రిచ‌యం చేసుకొని, త‌న‌ ద‌గ్గ‌ర ఆమెకు చెందిన ఒక విలువైన వ‌స్తువు ఉన్న‌ద‌ని క‌న్విన్స్ చేసి, ఆమెకు ఆ రీల్ చూపిస్తాడు. అందులో ఉన్న‌ది త‌ను కాద‌నీ, త‌న అక్క అఖిల అనీ, తామిద్ద‌రం ట్విన్స్ అనీ చెప్పి షాకిస్తుంది అలేఖ్య‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అలేఖ్య చెప్పింది నిజ‌మే అయితే అఖిల ఏమైంది? అలేఖ్య‌తో సినిమా చెయ్యాల‌న్న న‌వీన్ కోరిక నెర‌వేరిందా? అనే విష‌యాలను మిగ‌తా క‌థ‌లో చూస్తాం.


ఎనాలసిస్ :

సినిమా రంగం అన్నా, సినిమా మ‌నుషుల‌న్నా సాధార‌ణ ప్ర‌జానీకంలో ఉండే అనేకానేక అపోహ‌ల‌కు స‌మాధానంగా మోహ‌న‌కృష్ణ ఈ సినిమా తీశాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసే డైరెక్ట‌ర్ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడుతూ, కేవ‌లం డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధానంగా వాటిని తీస్తుంటారంటూ విమ‌ర్శించే వారికి స‌మాధానంగా ఈ సినిమా తీశాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో లాజిక్‌కు అంద‌ని ఎన్ని విష‌యాలున్నా, వాటిలోని ఓ డైలాగో, ఇంకో విష‌య‌మో ప్రేక్ష‌కుల్ని ప్ర‌భావితం చేసి, వారిని మోటివేట్ చేస్తుంటాయ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అలాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ల‌కు ప్ర‌తినిధిగా సుధీర్ బాబు చేసిన‌ న‌వీన్ పాత్ర మ‌న‌కు క‌నిపిస్తుంది. ఒక‌చోట అత‌నంటాడు, "ఇంత‌దాకా న‌న్ను అమ్ముకొని సినిమాలు తీశాను, ఇప్పుడు న‌న్ను న‌మ్ముకొని సినిమాలు తియ్యాల‌నుకుంటున్నాను" అని. అంటే.. ఒక ర‌క‌మైన కాంట్రాడిక్ష‌న్ కూడా ఆ క్యారెక్ట‌ర్‌లో చూపించాడు. 

న‌వీన్‌, అలేఖ్య మ‌ధ్య ప‌రిచ‌యం, ఆమె అత‌డి సినిమా ప్ర‌పోజ‌ల్‌ను తిర‌స్క‌రించ‌డం, ఆమె పేరెంట్స్‌కు సినిమా మీద ఉన్న తీవ్ర వ్య‌తిరేక అభిప్రాయాల‌ను ఫ‌స్టాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు. రీల్‌లో ఉన్న‌ది అలేఖ్య కాద‌నీ, ఆమె అక్క అఖిల అనే విష‌యం తెలియ‌డాన్ని ఇంట‌ర్వెల్ ట్విస్ట్ కింద పెట్టుకొని, సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు. సినిమా న‌టి కావాల‌నుకొనే అమ్మాయిల క‌ల‌ల్ని వారి పేరెంట్స్ ఎలా న‌లిపి వేస్తుంటారనేందుకు అలేఖ్య పేరెంట్స్ క్యారెక్ట‌ర్స్ నిద‌ర్శ‌నం. బ‌య‌టి స‌మాజంలోనూ ఎక్కువ‌మంది త‌ల్లితండ్రులు అదే ఒపీనియ‌న్‌తో ఉంటార‌నేది నిజమే క‌దా! అలేఖ్య క్యారెక్ట‌ర్ చాలా స‌హ‌జ‌మైన‌దిగా అనిపించ‌డానికి కార‌ణం.. ఆ క్యారెక్ట‌ర్ డిజైన్‌. ఇదివ‌ర‌కు మ‌నం సినిమా నేప‌థ్యంలో వ‌చ్చిన కొన్ని సినిమాలు చూశాం. దాస‌రి నారాయ‌ణ‌రావు 'శివ‌రంజ‌ని', వంశీ 'సితార' ఒక కోవ‌కు చెందిన‌వైతే, పూరి జ‌గ‌న్నాథ్ తీసిన 'నేనింతే' మ‌రో త‌ర‌హా సినిమా. వీట‌న్నింటికీ భిన్నంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' క‌నిపిస్తుంది. ఒక క్రియేటివ్ డైరెక్ట‌ర్ తాన‌నుకున్న‌ది తియ్య‌డానికి ఎలా త‌పిస్తాడో ఈ సినిమాలో మ‌నం చూస్తాం. ఒక‌సారి నిర్ణ‌యం తీసుకున్నాక‌, త‌ల్లితండ్రుల్ని ఎదిరించైనా ఆ ప‌ని చెయ్య‌డానికి వెనుకాడ‌ని అమ్మాయిల ధైర్యాన్ని చూస్తాం.

అలేఖ్య‌, ఆమె త‌ల్లితండ్రుల మ‌ధ్య వ‌చ్చే సీన్లు చాలామందికి క‌నెక్ట‌వుతాయి, వారిని ఆలోచింప‌జేస్తాయి. న‌వీన్‌, అలేఖ్య క్యారెక్ట‌రైజేష‌న్స్‌, అలేఖ్య పేరెంట్స్, కో డైరెక్ట‌ర్ బోస్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను బాగా డిజైన్ చేశాడు మోహ‌న‌కృష్ణ‌. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఇలాంటి క‌థ‌ల‌ను ఆస‌క్తిక‌రంగా చూపించ‌డానికి క‌థ‌నం వేగంగా ఉండాలి. ఆ వేగం లేక‌పోవ‌డ‌మే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లోని లోపం. కొన్ని కొన్ని స‌న్నివేశాలు, కొన్ని ఘ‌ట‌న‌లు, కొన్ని మాట‌లు చాలా బాగా ఉన్నాయ‌నిపిస్తాయి. అంత‌లోనే స్క్రీన్‌ప్లే ఫ్లాటైపోవ‌డంతో.. అంత‌కు ముంద‌రి అనుభూతి, భావోద్వేగం చ‌ల్లారిపోతుంది. 

టెక్నిక‌ల్‌గా ఈ మూవీ ఉన్న‌త స్థాయిలోనే ఉంది. వివేక్ సాగ‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్, పీజీ విందా సినిమాటోగ్ర‌ఫీ ప‌లు స‌న్నివేశాల్ని మ‌న‌సులో ముద్రించుకొనేట్లు చేశాయి. ఫ‌స్ట్ టైమ్ త‌న స్వ‌భావానికి విరుద్ధంగా ఒక ఐట‌మ్ సాంగ్ పెట్టాడు మోహ‌నకృష్ణ‌. అయితే అది.. న‌వీన్ తీసే సినిమాలో భాగంగా వ‌స్తుంది. అది ఆక‌ట్టుకొనే రీతిలో లేదు. మిగ‌తా పాట‌లు సంద‌ర్భానుసారం వ‌చ్చేవే కాబ‌ట్టి, త‌ల ప‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం క‌లుగ‌దు. మార్తాండ్ కె. వెంక‌టేశ్ త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి, ఒక ఎమోష‌న‌ల్ మూవీని మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేశాడు కానీ, క‌థ‌నం కార‌ణంగా ఆయ‌న కొంత‌మేరే స‌క్సెస‌య్యాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు:

ఈ సినిమాలో ఒక‌రిద్ద‌రి కంటే ఎక్కువ మంది అభిన‌యాల‌ను వండ‌ర్‌ఫుల్‌గా మ‌న‌ముందు ఆవిష్క‌రింప‌జేసింది. నిజం చెప్పాలంటే ట్విన్స్ అఖిల‌, అలేఖ్య పాత్ర‌ల‌ను చేసిన కృతి శెట్టికి అంద‌రికంటే ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. చిన్న వ‌య‌సులోనే ఆ క్యారెక్ట‌ర్స్‌లోని పెయిన్‌ను ఆమె ఆవిష్క‌రించిన తీరు అమోఘం. తొలి చిత్రం 'ఉప్పెన‌'లోనే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న కృతి, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో న‌టిగా మ‌రో మెట్టు ఎదిగింద‌నేది నిర్వివాదం. ఫిల్మ్ డైరెక్ట‌ర్ న‌వీన్‌గా సుధీర్ బాబు ఉన్న‌త స్థాయి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. అత‌ని హావ‌భావాలు, డైలాగ్ డిక్ష‌న్ ఇదివ‌ర‌క‌టికంటే ఎంతో మెరుగ‌నిపించాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుధీర్‌, కృతిల‌కు ఇవే బెస్ట్ పెర్ఫార్మెన్సెస్‌. 

కో డైరెక్ట‌ర్ బోస్ పాత్ర‌లో వెన్నెల కిశోర్ ఒదిగిపోయాడు. ఇటీవ‌ల చాలా సినిమాల్లో ఓవ‌ర్ యాక్టింగ్ చేస్తూ వ‌చ్చిన అత‌ను, ఈ సినిమాలో సెటిల్డ్‌గా యాక్ట్ చేసి, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్ట్‌ను త‌న భుజాల మీద వేసుకున్నాడు. న‌వీన్ ఫ్రెండ్ వెంక‌ట‌ర‌మ‌ణ‌గా రాహుల్ రామ‌కృష్ణ ఓకే. స‌మాజంలోని అనేకానేక మంది అమ్మాయిల త‌ల్లితండ్రుల‌కు ప్ర‌తినిథులైన అలేఖ్య పేరెంట్స్‌గా శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణీ న‌ట‌రాజ‌న్ పాత్రోచితంగా న‌టించారు. అలేఖ్య‌ను పెళ్లిచేసుకోవానుకొనే సైంటిస్ట్ వ‌రుణ్ పాత్ర‌లో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ సునాయాసంగా ఒదిగిపోయాడు. ఫ్యాన్సీ ప‌ర‌మేశ్వ‌ర్ అనే ప్రొడ్యూస‌ర్ క్యారెక్ట‌ర్‌లో వ‌డ్ల‌మాని శ్రీ‌నివాస్‌, న‌వీన్ తండ్రిగా గోప‌రాజు ర‌మ‌ణ క‌నిపించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

క‌థ‌న వేగంగా ఉన్న‌ట్ల‌యితే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా వ‌చ్చి ఉండేది. న‌టి కావాల‌నుకొనే అమ్మాయిల‌కు ఇంటి నుంచే ఎలాంటి అడ్డంకులు వ‌స్తాయ‌నే విష‌యాన్ని సెన్సిబుల్‌గా చెప్పిన ఈ సినిమాని ఓసారి చూడొచ్చు. అలాగే.. కృతి శెట్టి, సుధీర్ బాబు ప‌ర్ఫార్మెన్స్‌ల కోసం కూడా.

 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి