Read more!

English | Telugu

సినిమా పేరు:800
బ్యానర్:Movie Train Motion Pictures
Rating:3.00
విడుదలయిన తేది:Oct 5, 2023

మూవీ : 800

నటీనటులు: మధుర్‌ మిట్టల్‌, మహిమ నంబియార్‌, యోగ్‌ జేపి, నాజర్‌, నారాయణ్‌, రిత్విక తదితరులు
సంగీతం: గిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.
నిర్మాత: వివేక్‌ రంగాచారి
రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.శ్రీపతి
బ్యానర్‌: మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ: 05.10.2023

ఈమధ్యకాలంలో బయోపిక్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ఒక ప్రముఖ వ్యక్తి జీవితంలోని అంశాలను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు కొందరు సినీ ప్రముఖులు, క్రికెటర్లు, రాజకీయ నాయకుల బయోపిక్స్‌ వచ్చాయి. అయితే వాటిలో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని ఆదరణకు నోచుకోలేదు. ఏది ఏమైనా ఒక సెలబ్రిటీ జీవిత చరిత్రను తెరకెక్కించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి దర్శకుడికి క్షుణ్ణంగా తెలిసి వుండాలి. అప్పుడే ఆ కథ ప్రేక్షకుల్లోకి వెళుతుంది. అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు ఎం.ఎస్‌.శ్రీపతి. అతను ఎంచుకున్న కథ శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌కు చెందినది. టెస్టుల్లో 800 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పిన మురళీధరన్‌ జీవిత చరిత్రను ‘800’ పేరుతోనే తెరకెక్కించాడు దర్శకుడు శ్రీపతి. ఈ సినిమాలో మురళీధరన్‌కు సంబంధించి ఎలాంటి అంశాలను దర్శకుడు తెరకెక్కించాడు? ప్రేక్షకులు మెచ్చేలా ఈ బయోపిక్‌ను తీర్చిదిద్దాడా అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
క్రికెట్‌ అంటేనే బ్రిటీష్‌ వారికి చెందిన ఆట. వారు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో క్రికెట్‌ను పాపులర్‌ చేసే ప్రయత్నం చేసేవారు. అలా శ్రీలంకలో క్రికెట్‌ను ఎక్కువగా ఆడేవారు. ఆ సమయంలో వారికి సేవలు చేసేందుకు కొందరు కూలీలు కావాల్సి వచ్చింది. అప్పుడు తమిళనాడు నుంచి భారీగా కూలీలను రప్పించారు. అలా వలస వచ్చిన వారిలో ముత్తయ్య కుటుంబం కూడా ఉంది. ముత్తయ్యకు చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. ఆడే అవకాశం లేకపోవడంతో బిస్కెట్‌ ఫ్యాక్టరీ నడుపుకునేవాడు. ఇక ముత్తయ్య కొడుకు మురళీధరన్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి. ఇదిలా ఉండగా.. క్రమంగా శ్రీలంకలో సింహళులకు, తమిళులకు మధ్య గొడవలు రాజుకున్నాయి. ఆ ఆందోళనల మధ్యనే అతని బాల్యం అంతా గడిచింది. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని మురళీధరన్‌ క్రికెట్‌లో ఎలా రాణించాడు? అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అతను బౌలింగ్‌ విషయంలో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించి శ్రీలంక దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగాడు అనే మిగతా కథ. 


ఎనాలసిస్ :

ఇది ఒక క్రికెటర్‌ బయోపిక్‌ అయినప్పటికీ అతని జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రధానంగా చూపించేందుకు దర్శకుడు ఎక్కువ మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది. శ్రీలంక, ఎల్‌టీటీఈ మధ్య ఉన్న వివాదం వల్ల శ్రీలంకలోని తమిళులు బిక్కుబిక్కుమంటూ దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మురళీధరన్‌ ఫ్యామిలీకి కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. శరణార్థిగా ఓ దేశానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంతటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనే విషయాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక సందర్భంలో మురళీధరన్‌ను అక్కడి సైనికులు రోడ్డు మీదే మోకాళ్లు వేయిస్తారు. ఆ సీన్‌లో మురళీధరన్‌ వ్యధను ఎంతో ఎమోషనల్‌గా చిత్రీకరించారు. ఆ పరిస్థితుల్లోనే ఎంతో కష్టపడి దేశం కోసం క్రికెట్‌ ఆడేందుకు విదేశాలకు వెళ్తాడు. కానీ,  అక్కడ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతాడు. తన సత్తా ఏమిటో చూపించాలని ప్రయత్నించినా ఏదో ఒక సమస్యతో విఫలమవుతుంటాడు. ఈ సీన్స్‌ను ఆకట్టుకునేలా  తీశారు. టెస్టు మ్యాచ్‌ను తన బౌలింగ్‌తో గెలిపించే సీన్స్‌,  ఒకే టెస్టులో 16 వికెట్లు తీసిన సందర్భాన్ని మంచి ఎమోషన్‌తో తెరకెక్కించారు. బౌలింగ్‌ విషయంలో మురళీధరన్‌ కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాన్ని పిక్చరైజ్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. మురళీధరన్‌ ఎల్‌టీటీఈని కలిసి మాట్లాడే సీన్‌, పాకిస్తాన్‌లో శ్రీలంక మీద జరిగిన కాల్పుల సీన్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే  ప్రథమార్థంలో ఉన్నంత ఎమోషన్‌ చివరలో మిస్‌ అయిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. 
నటీనటులు:
ముత్తయ్య మురళీధరన్‌గా నటించిన మధుర్‌ మిట్టల్‌ ఆ పాత్రకు ప్రాణం పోశాడని చెప్పాలి. అతని బౌలింగ్‌ స్టయిల్‌, బాడీ లాంగ్వేజ్‌, మేనరిజం వంటివి మురళీధరన్‌ని గుర్తుకు తెస్తాయి. ఇక మహిమ నంబియార్‌ క్యారెక్టర్‌కి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మిగతా పాత్రల్లో నాజర్‌, యోగ్‌ జెపి తదితరులు ఫర్వాలేదు అనిపించారు. అలాగే కపిల్‌దేవ్‌, రణతుంగ, షేన్‌ వార్న్‌ పాత్రల్లో నటించిన వారు కూడా బాగా చేశారు.

సాంకేతిక నిపుణులు:
ఆర్‌.డి. రాజశేఖర్‌ అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు. ప్రతి ఫ్రేమ్‌ కోసం ఎంతో కేర్‌ తీసుకున్నట్టు అర్థమవుతుంది. గిబ్రాన్‌ నేపథ్య సంగీతం కూడా బాగుంది. ప్రవీణ్‌  కె.ఎల్‌. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారు. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే సినిమా ఆద్యంతం ఎంతో కేర్‌ తీసుకొని చేసినట్టు అనిపిస్తుంది. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఒక క్రికెటర్‌ జీవిత చరిత్రను ఎంతో అందంగా చిత్రీకరించాడు దర్శకుడు శ్రీపతి. అయితే రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా చాలా స్లో నేరేషన్‌గా అనిపిస్తుంది. మురళీధరన్‌ బాల్యం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన తీరును బాగా ప్రజెంట్‌ చేశారు. క్రికెట్‌ లవర్స్‌ని ఈ సినిమా బాగా మెప్పించే అవకాశం ఉంది. అలాగే సాధారణ ప్రేక్షకులు ఆశించే ఎమోషన్స్‌, కొన్ని థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అయితే రెగ్యులర్‌ సినిమాల స్థాయిలో ఈ సినిమాకి ఆదరణ లభిస్తుందో లేదో చూడాలి.

 

-  జి.హరా