Read more!

English | Telugu

సినిమా పేరు:24
బ్యానర్:2డి ఎంటర్ టైన్మెంట్
Rating:3.00
విడుదలయిన తేది:May 6, 2016

కొత్త క‌థ‌లెక్క‌డున్నాయి?  అన్న‌ది అంద‌రి మాట‌. కానీ కొత్త‌గా ఆలోచించాల‌న్న త‌ప‌న ఉండాలి గానీ, కొత్త క‌థ‌లు పుట్టుకొస్తుంటాయి.ఈ విష‌యాన్ని నిరూపించిన‌, నిరూపిస్తున్న ద‌ర్శ‌కుల్లో విక్ర‌మ్ కె.కుమార్ కూడా ఉంటాడు. 13 బి, మ‌నం సినిమాలు చూస్తే విక్ర‌మ్‌లోని క్రియేటివిటీ లెవల్స్ అర్థ‌మ‌వుతాయి. ఓ సంక్లిష్ట‌మైన క‌థ‌ని కొత్త‌దారిలో అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం విక్ర‌మ్ స్టైల్‌! సూర్య తర‌హా కూడా అంతే. కొత్త‌ద‌నం కోసం క‌మ‌ర్షియ‌ల్ విలువల్ని వ‌దిలేసి ఎంత దూరం వెళ్ల‌మ‌న్నా వెళ్తాడు. అందుకే విక్ర‌మ్ - సూర్య‌ల కాంబినేష‌న్ అంటే.. ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ సినిమా ఎంత వ‌ర‌కూ అందుకొంది?  24 లోని హైలెట్స్ ఏంటి? విక్ర‌మ్ స్టైల్‌, సూర్య త‌ప‌న ఈ సినిమాలో ఎంత వ‌ర‌కూ క‌నిపించాయి??  లెట్స్ గో..

కథ:
ఆత్రేయ (సూర్య).. శివకుమార్‌ (సూర్య) ఇద్ద‌రూ క‌వ‌ల సోద‌రులు. మూడు నిమిషాల తేడాతో పుడ‌తారు. కానీ.. ఇద్ద‌రి శైలి, ఆలోచ‌న‌లు విభిన్నం.  శివకుమార్‌  ప్రాజెక్ట్‌ 24 పేరుతో ఓ వాచీని కనిపెడ‌తాడు. ఆ వాచీ ఉంటే... భూత‌, భ‌విష్య‌త్ కాల‌ల్లో ప్ర‌యాణం చేయొచ్చ‌న్న‌మాట‌.  ఆ వాచీని ఎలాగైనా త‌న సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు ఆత్రేయ‌. శివ‌కుమార్‌నీ, అత‌ని భార్య ప్రియ‌ని(నిత్య‌మీన‌న్‌) హ‌త‌మార్చి.. ఆ వాచీని కాజేయాల‌నుకొంటాడు. అప్ప‌టికి శివ‌కుమార్‌కి మూడు నెల‌ల కొడుకు మ‌ణి (సూర్య‌) ఉంటాడు. త‌న‌కు ఆ వాచీ ఇచ్చి, మ‌రొక‌రి స‌హాయంతో అక్క‌డ్నుంచి పంపించేస్తాడు. స‌రిగ్గా 24 యేళ్ల త‌ర‌వాత మ‌ణి.. మ‌ళ్లీ ఆత్రేయ‌కు క‌నిపిస్తాడు. అప్పుడు ఆత్రేయ ఏం చేశాడు?  ఆ వాచీ ఏమైంది??  ప్రాజెక్ట్ 24 వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం చేకూరింది?  ఇలాంటి ఆసక్తిక‌ర‌మైన అంశాల‌తో సాగిన చిత్రం 24.


ఎనాలసిస్ :

అనాలిసిస్:
ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్‌. ఈ జోన‌ర్ నిజంగా మ‌న‌కు కొత్త‌!  ఆదిత్య 369లా... కాలంతో పాటు ప్ర‌యాణం చేయ‌డం అనేకాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంది గానీ.. దాన్ని విక్ర‌మ్ ఓ కొత్త స్టైల్‌లో వాడుకొని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేశాడు. అక్క‌డో విక్ర‌మ్  స‌క్సెస్ అయ్యాడు. ఈ క‌థ‌ని, జ‌ర‌గ‌బోయే స‌న్నివేశాల్నీ ప్రేక్ష‌కుడు ఏమాత్రం ఊహించ‌లేడు. త‌ర‌వాత ఇది జరుగుతుంది.. అని ప్రేక్ష‌కుడిని అనుకొనేలా చేసి, మ‌రొకటేదో తెర‌పై చూపించి థ్రిల్లింగ్‌కి గురిచేశాడు ద‌ర్శ‌కుడు. టైమ్ మిష‌న్‌లో ముందుకు వెళ్ల‌డ‌మే కాదు.. స‌మ‌యాన్ని ఆపేసి, ప్ర‌పంచాన్ని స్థంభింప‌చేస్తాడు. ఆ స‌మ‌యంలో ప్ర‌పంచం మొత్తం నిశ్చ‌లంగా ఉంటుంది. ఒక్క హీరో మాత్ర‌మే క‌దులుతాడు. లాజిక్ గురించి మ‌ర్చిపోతే.. ఇదో అద్బుత‌మైన ఆలోచ‌న‌. దాన్ని తెర‌పై అంతే గొప్ప‌గా చూపించ‌గ‌లిగాడు.

సైన్స్ ఫిక్ష‌న్స్‌లో లాజిక్ వెద‌క్కూడ‌దు. అవి వ‌దిలిపెడితే... ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. స‌మంత‌, సూర్య‌ల లవ్ ట్రాక్ కూడా కొత్త‌గా అనిపిస్తుంది. మ‌రోవైపు కాలంతో ముడిప‌డిన క‌థ న‌డుస్తుంటుంది. ఈ రెండింటితో ప్రేక్ష‌కుడు ఎంగేజ్డ్ అయిపోతాడు. తొలి అర్థ‌భాగంలోనే ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్సీ అర్థ‌మైపోతుంది. రెండో స‌గం చూడాల‌న్న ఆత్రుత మొద‌ల‌వుతుంది. సెకండాఫ్ కూడా అంతే ప‌క‌డ్బందీగా టేకాఫ్ చేశాడు ద‌ర్శ‌కుడు. కానీ స‌డ‌న్ గా సినిమా గ్రాఫ్ ప‌డిపోతూ వ‌స్తుంది. ఇంత చేసింది.. ఈ మాత్రం దానికా.. అన్న ఫీలింగ్ వ‌స్తుంది. స‌న్నివేశాల్ని ముడి వేసిన నేర్ప‌రిత‌నం.. విప్పేట‌ప్పుడు చూపించ‌లేక‌పోయాడు. దానికి తోడు క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు వ‌దులుకోకూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల విక్ర‌మ్‌లో ఈసారి క‌నిపించింది. అందుకే వీలున్న చోట‌ల్లా క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇస్తూ వ‌చ్చాడు. క్లైమాక్స్ లో మాత్రం విక్ర‌మ్ కుమార్ మ‌ళ్లీ రెచ్చిపోయాడు. దాంతో ఓ మంచి ప్ర‌యోగాత్మ‌క క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూశామ‌న్న ఫీలింగ్‌తో ఆడియ‌న్ థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు.

పెర్ఫామెన్స్:
సూర్యలోని న‌టుడి గురించి కొత్త‌గా చెప్పేదేముంది?  ఈసారీ పూర్తిగా ద‌ర్శ‌కుడికి స‌రైండ‌ర్ అయిపోయాడు. మూడు పాత్ర‌ల్లోనూ వైవిధ్యం చూపించాడు. ఆత్రేయ‌గా ఎంత భ‌యంక‌రంగా క‌నిపించాడో.. మ‌ణిగా అంత క్యూట్‌గా ఉన్నాడు. ఈ సినిమా సూర్య వ‌న్ మేన్ షో అనే చెప్పాలి. స‌మంత ఓకే అనిపిస్తుంది. నిత్య‌ది చిన్న పాత్రే. అజ‌య్ న‌ట‌న‌, రెండు పార్శ్వాల్లో అత‌ను చూపించిన వైవిధ్యం ఆక‌ట్టుకొంటుంది.

టెక్నికల్ గా:
ఇది ద‌ర్శ‌కుడి సినిమా. విక్ర‌మ్ రాసుకొన్న కథ‌, దానికి అల్లిన స్ర్కీన్ ప్లే ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. స్ర్కిప్టు ని ప‌టిష్టంగా రాసుకొంటే త‌ప్ప ఇలాంటి సినిమాలు చేయ‌లేం. ఆ విష‌యంలో విక్ర‌మ్ ఎఫెక్ట్ మెచ్చుకొని తీరాలి. సాంకేతికంగా అన్ని విభాగాల నుంచి త‌న‌కు మంచి మ‌ద్ద‌తు ల‌భించింది. సినిమాటోగ్రఫీని చాలా బాగుంది. ప్రతీ సీన్ ను పెయింటింగ్ లా తీర్చిదిద్దారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీపడని సినిమా. ఇలాంటి సినిమాకు చాలా కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ కూడా తమ పాత్రను అద్భుతంగా నిర్వహించారు. ఓవరాల్ గా టెక్నికల్ టీం కు ఫుల్ మార్కులేయచ్చు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తెలుగువన్ వ్యూ :
అద్భుతంగా సాగిన ఫ‌స్ట్ హాఫ్‌ కు సెకండాఫ్ నుంచి సరైన సహకారం లభించలేదు. బ్రిలియ‌న్సీ తగ్గుతూ వచ్చింది. సినిమా కూడా స్లో అయ్యింది. కొన్ని పాట‌లు కథనానికి అడ్డు వచ్చి న‌స పెట్టాయి. ఈ లోపాల్ని మిన‌హాయించి చూస్తే... 24 ఖ‌చ్చితంగా ఓ కొత్త అనుభూతినిస్తుంది. ష్యూర్ సమ్మర్ వాచ్..