Read more!

English | Telugu

సినిమా పేరు:10th క్లాస్ డైరీస్
బ్యానర్:ఎస్ ఆర్ మూవీ మేకర్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jul 1, 2022

సినిమా పేరు: 10th క్లాస్ డైరీస్
తారాగ‌ణం: శ్రీరామ్, అవికా గోర్, నాజర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, శివ బాలాజీ, అర్చన, హిమజ
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: అచ్యుత్‌ రామారావు, రవి
సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: గరుడ వేగ అంజి
విడుద‌ల తేదీ: జులై 1, 2022

ఎందరో సినిమాటోగ్రాఫర్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'గరుడవేగ' ఫేమ్ అంజి చేరిపోయారు. సినిమాటోగ్రాఫర్ గా తన 50వ సినిమాతో ఆయన దర్శకుడిగా మారడం విశేషం. అదే '10th క్లాస్ డైరీస్'. ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు, స్కూల్ మెమొరీస్ ని గుర్తుచేసే సినిమా కావడంతో దీనిపై సినీ ప్రియుల్లో కాస్తోకూస్తో ఆసక్తి నెలకొంది. మరి 10th క్లాస్ మెమోరీస్ ని గుర్తు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:- ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోము(శ్రీరామ్) ఫారెన్ లో సొంతంగా కంపెనీ పెట్టే స్థాయికి ఎదుగుతాడు. బోలెడంత డబ్బు, కావాల్సినంత ఎంజాయ్ మెంట్. అయినా ఏదో అసంతృప్తి. అసలు తనకేం కావాలో తనకే తెలీదు. ఆ క్లారిటీ లేకనే పెళ్ళాం, పిల్లలను కూడా దూరం చేసుకుంటాడు. అసలు తన జీవితంలో ఉన్న అసంతృప్తికి కారణమేంటో తెలుసుకోవడం కోసం ఓ సైకాలజిస్ట్ ని కలుస్తాడు. అప్పుడు తెలుస్తుంది తను జీవితంలో ఎదుగుతూ వచ్చాడు కానీ తన మనసు మాత్రం ఫస్ట్ లవ్ దగ్గరే ఆగిపోయింది అని. స్కూల్ టైమ్ లో తాను ప్రేమించిన చాందిని(అవికా గోర్) దగ్గర తన ఆనందం ఉందని తెలుసుకొని, ఆమెని కలవడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి 10th క్లాస్ రీయూనియన్ ప్లాన్ చేస్తాడు. కానీ ఆ రీయూనియన్ కి చాందిని తప్ప అందరూ వస్తారు. అసలు చాందిని ఎక్కడుంది? ఆమెను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో సోము తెలుసుకున్న విషయాలు ఏంటి? వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.


ఎనాలసిస్ :

రీయూనియన్ కాన్సెప్ట్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కాన్సెప్ట్ నే తీసుకొని '10th క్లాస్ డైరీస్'లో కొంచెం కొత్తగా చూపే ప్రయత్నం చేశారు. అతిగా ప్రేమించే తండ్రి, ప్రేమ విలువ తెలియని ప్రియుడు కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా నాశనమైంది అనే పాయింట్ ని తీసుకొని, నిర్మాత అచ్యుత రామారావు మరియు ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే పలు సన్నివేశాలు సహజంగా అనిపించాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు అసహజంగానూ, అసందర్భంగానూ అనిపించాయి. దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ సినిమాటోగ్రాఫర్ గా 50 సినిమాలకు పనిచేసిన అనుభవంతో గరుడవేగ అంజి చక్కగా తెరకెక్కించారు. అయితే కమర్షియల్ టచ్ కోసం అవసరంలేని ఫైట్స్, స్పెషల్ సాంగ్ ఇరికించారు. ప్రస్తుతం శ్రీరామ్, అవికా గోర్ వంటి యాక్టర్స్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కమర్షియల్ టచ్ కంటే నేచురల్ గానే తెరకెక్కించి ఉంటే.. తమ మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ మరింతమంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశముండేది.

కోట్ల ఆస్తి ఉన్నా కొందరికి జీవితంలో ఏదో తెలియని వెలితి ఉంటుంది. అసలు తమ ఆనందం దేనిలో ఉందో తెలుసుకోలేరు. అలాంటి క్యారెక్టరే సోముది. తన ఆనందం 10th క్లాస్ లో తను ప్రేమించిన చాందిని దగ్గర ఉందని తెలుసుకొని, ఆమెని కలవాలనుకోవడంతో సినిమా మొదలవుతుంది. స్కూల్ ఎపిసోడ్ లో చాందినిని సోము ప్రేమించడం, చాందిని తన వైపు ఒక్కసారైనా చూస్తే చాలు అనుకోవడం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక రీయూనియన్ ఎపిసోడ్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి ట్రాక్ నవ్వులు పూయించింది. చక్కని డైలాగ్స్ కి శ్రీనివాస్ రెడ్డి టైమింగ్ తోడవ్వడంతో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండాఫ్ అంతా చాందిని కోసం ఫ్రెండ్స్ తో కలిసి సోము వెతుకులాటే ఉంటుంది. స్కూల్ డేస్ లో చాందిని ఒక్కసారైనా తనవైపు చూస్తే బాగుండు అనుకునే సోము.. ఇన్నేళ్ళ తర్వాత చాందినిని ఒక్కసారి చూడాలని ఆరాటపడటం ఆకట్టుకుంది. అలాగే సోము కోరుకున్న జీవితాన్ని చాందిని బతుకుతున్నట్లు చూపించిన ఆలోచన బాగుంది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించాయి. క్లైమాక్స్ కూడా అసహజంగా ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ చిత్రం అభినందించదగ్గ ప్రయత్నమే.

డైరెక్టర్ గా, సినిమాటోగ్రాఫర్ గా అంజి న్యాయం చేసినప్పటికీ రైటింగ్ మీద మరింత శ్రద్ధ పెడితే ఇంకా బాగుండేది. కామెడీ, డైలాగ్స్ బాగున్నప్పటికీ, ఆడియన్స్ ని కట్టిపడేసే బలమైన సన్నివేశాలు పెద్దగా లేవు. బడ్జెట్ పరిమితుల కారణంగా టెక్నికల్ గా కూడా ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించేలా ఉంది. అవసరంలేకపోయినా కొడితే గాలిలో ఎగిరే సన్నివేశాలు పెట్టారు.. అవీ స్టాండర్డ్ గా లేవు. అలాగే క్లైమాక్స్ లో అవికా గోర్ మేకప్ చాలా సాదాసీదాగా అనిపించింది. అలాగే అఘోరాగా తాగుబోతు రమేష్ గెటప్ కూడా నాసిరకంగా ఉంది. లొకేషన్స్, కొన్ని కొన్ని సీన్స్ లో ఆర్ట్ వర్క్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇక ఇలాంటి సినిమాలకు సంగీతమే బలం. కానీ సురేష్ బొబ్బిలి సంగీతం పర్లేదు అనిపించుకుంది అంతే.

నటీనటుల పనితీరు:- ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన శ్రీరామ్ కి సోము క్యారెక్టర్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. తన ఫస్ట్ లవ్ ఎక్కడుంది? తనకి ఏమైంది? తెలుసుకునే క్రమంలో ఆయన నటన ఆకట్టుకుంది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఎందుకనో ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. ఇక అవికా గోర్ విషయానికొస్తే పేరుకి ఈ సినిమా కథ అంతా ఆమె చుట్టూనే తిరిగినప్పటికీ ఆమె పాత్ర మాత్రం సెకండాఫ్ లోనే వస్తుంది. నిజానికి ఇది చాలా బలమైన పాత్ర. గుండెల్లో ప్రేమని, బాధని మోస్తూ.. కళ్ళల్లో ఆనందాన్ని చూపించడానికి ప్రయత్నించే పాత్ర. ఉన్నంతలో అవికా గోర్ ఆ పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ పాత్ర ఆమె వయసుకి, అనుభవానికి మించిన పాత్ర కావడంతో తేలిపోయింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పొచ్చు. అమాయకపు ఎక్స్ ప్రెషన్స్, కామెడీ టైమింగ్ తో సినిమాని చాలావరకు ఆయనే నిలబెట్టాడు. అర్చన కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఓ వైపు తను స్కూల్ లో ప్రేమించిన వ్యక్తితో ఫ్రెండ్ లా ఉంటూనే, అలా అని అతి చనువు ఇవ్వకుండా పద్ధతిగా ఉండే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె స్లాంగ్ ఆకట్టుకుంది. కీలకమైన మరో పాత్రలో వెన్నెల రామారావు(అచ్యుత రామారావు) ఉన్నంతలో మెప్పించాడు. నాజర్, హిమజ, శివ బాలాజీ తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

పాఠశాల సమయంలోని ప్రేమకు, స్నేహానికి అందరి హృదయాల్లో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానముంటుంది. ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ జ్ఞాపకాలను తట్టిలేపే సినిమానే '10th క్లాస్ డైరీస్'. అద్భుతమైన సినిమా అని చెప్పలేము గాని స్కూల్ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకోవడం కోసం ఒక్కసారి చూడొచ్చు.

-గంగసాని