English | Telugu

పావురాళ్ల గుట్ట ఘటనకు 16 ఏళ్లు..

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. తాను 2004 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డానికి పాద‌యాత్ర చేసే ముందు.. చాలా చాలా తీవ్రంగా బాధ ప‌డ్డారు. కార‌ణం చంద్రబాబు పాలన, విధానాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే అస‌లు మ‌నం సీఎం కావ‌డం క‌ల్ల అన్న‌ది అప్పటికి ఆయ‌న భావన, ఆవేద‌న‌. ఈ విష‌యం త‌న ఆత్మగా చెప్పుకునే కేవీపీ కి చెప్పుకుని బాధ ప‌డ్డారని చెబుతుంది ఆయ‌న బ‌యోపిక్ గా వ‌చ్చిన యాత్ర‌.

త‌ర్వాత ఆయ‌న మాస్ నాడి ప‌ట్టుకున్నారు. ఆ పాద‌యాత్రకు అప్పటి వ‌ర‌కూ వ్యతిరేకిస్తూ వ‌చ్చిన ప‌త్రిక‌లు కూడా బాగా హైలెట్ చేసి చూపించ‌డంతో.. ఆయ‌న అనూహ్యంగా 2004 ఎన్నిక‌ల‌ను గెలిచారు. అంత‌క‌న్నా ముందు చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ జ‌ర‌గ‌టం, ఆ సానుభూతి ప‌వ‌నాలు, ఆపై తాను మోడ్రన్ అడ్మినిస్ట్రేట‌ర్ గా పేరు సాధించ‌డం వంటి అంశాలేవీ ప‌ని చేయ‌లేదు. వైయ‌స్ పాద‌యాత్ర ద్వారా మాస్ లోకి మ‌రీ ముఖ్యంగా రైతాంగంలోకి వెళ్లడంతో.. ఆయ‌న పంట, కాంగ్రెస్ పంట ఒకేసారి పండాయి. అప్పటి వ‌ర‌కూ అంద‌ని ద్రాక్షగా ఉన్న అధికారం ఎట్టకేల‌కు వైయ‌స్ఆర్ ప‌ర‌మైంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయ‌స్ శ‌కం ఒక‌టి మొద‌లైంది.

ఎన్టీఆర్ అంటే, రెండు రూపాయ‌లకు కిలో బియ్యం, జ‌న‌తా వస్త్రాలు వంటి సంక్షేమ ప‌థ‌కాలు ఎలాగో, వైయ‌స్ అన‌గానే ట‌క్కున గుర్తుకొచ్చేవి ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇవి త‌ర్వాతి కాలంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిల‌వ‌డం, అటుంచితే కొన్ని విమ‌ర్శల‌ను సైతం మూట‌గ‌ట్టుకున్నాయి ఈ పథకాలు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు బాగు ప‌డ్డాయ‌న్న విమర్శలు రావ‌డం.. ఆపై ఫీజు రీఎంబ‌ర్స్ ద్వారా.. ప్రతి ఒక్కరూ ఇంజినీరింగ్ చేయ‌డం, దాని విలువ ప‌డిపోయి.. ఉద్యోగితా స్థాయి దారుణంగా దెబ్బతిన‌డం ఒక ఎత్తు. ఈ విష‌యంపై కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్నలిస్టులు ఆనాడే విమ‌ర్శలు గుప్పించిన ప‌రిస్థితి.

ఈ సామాజిక క్షేమం మ‌ర‌చి కూడా వైయ‌స్ఆర్, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తారు కాబ‌ట్టే.. వారికి ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్.. చంద్రబాబుకు ఉండేది కాదని చెబుతారు విశ్లేష‌కులు. బేసిగ్గా చంద్రబాబు థియ‌రీ వాట్ దే నీడ్. అదే వైయ‌స్ వాట్ దే వాంట్. దీంతో వైయ‌స్ మ‌హానేత అయ్యాడు. చంద్రబాబు చెడ్డ పేరు సాధించార‌ని చెబుతారు వీరంతా.

ఇదిలా ఉంటే.. 2009లో రెండో సారి గెలిచాక వైయ‌స్ఆర్ ఇక తిరుగులేని నేత‌గా ఎదుగుతార‌ని అనుకున్నారంతా. మ‌ధ్యప్రదేశ్ లో దిగ్విజ‌య్ సింగ్ త‌ర్వాత ఆ స్థాయిలో అధిష్టానం ముందు మంచి పేరు సాధించి.. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎంపీల‌ను అందించి.. అటు యూపీఏ కూట‌మిని సైతం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంతో.. వైయ‌స్ కి సోనియా కోట‌రీ ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉండేద‌ని అంటారు.

బేసిగ్గా వైయ‌స్ఆర్.. గాంధీ కుటుంబ వ్యతిరేకి. ఆయ‌న తొలి రోజుల్లో ఆనాడు దేశ వ్యాప్తంగా న‌డుస్తోన్న కుటుంబ రాజ‌కీయాల‌ను, గాంధీలు కాని గాంధీల దాష్టీకాన్ని స‌హించ‌లేక పోయేవారని చెబుతుంది ఇటీవ‌ల వ‌చ్చిన మ‌య‌స‌భ అనే సీరీస్. మీరు కావాలంటే చూడొచ్చు. ఆయ‌నేం పెద్ద ఇందిరాగాంధీ విధేయుడు కారు. పైపెచ్చు ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత‌.. కేవ‌లం ఒకే ఒక్కడుగా ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ నుంచి గెలిచి చ‌రిత్ర సృష్టించారు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ఆ త‌ర్వాత వైయ‌స్ గెలిచిన ఒరిజిన‌ల్ నేష‌న‌ల్ కాంగ్రెస్ ను, కాంగ్రెస్- ఐలో క‌లిపేయ‌డంతో.. విధిలేని ప‌రిస్థితుల్లో మాత్రమే వైయ‌స్ ఇందిర అధినాయ‌క‌త్వంలోని పార్టీలో టెక్నిక‌ల్ గా చేరారంతే!

ఆపై సోనియాగాంధీ సైతం వైయ‌స్ తో ఎంత ఇష్టం లేకున్నా స‌రే.. ఆమె వైయ‌స్ ని కొన‌సాగించేవారంటే అందుకు కార‌ణం.. శ్యాంపిట్రోడా వంటి వారు చేసిన స‌ల‌హా సూచ‌న‌గా చెబుతారు కొంద‌రు సునిశిత రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్ అన‌గానే సీఎంల‌ను త‌ర‌చూ మార్చేస్తుంటార‌ని ఒక అప‌వాదు ఉండేది అప్పట్లో. ఇక‌పై ఏ రాష్ట్రంలో.. ఎవ‌రు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారో.. వారు ఎన్నిసార్లు పార్టీని అధికారంలోకి తెస్తే అన్ని సార్లు ముఖ్యమంత్రిని చేయాల‌న్న విధాన ప‌ర‌మైన నిర్ణయం కార‌ణంగా వైయ‌స్ఆర్ రెండో సారి కూడా సీఎం కాగ‌లిగార‌ని అంచ‌నా వేస్తారు.

ఆపై వైయ‌స్ రెండోసారి అధికారంలోకి రావ‌డానికి ఇటు ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో పాటు.. అటు ఇక హైద‌రాబాద్ రావాలంటే పాస్ పోర్టు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని జ‌నాన్ని రెచ్చగొట్టడం కూడా.. ప‌ని చేసింది. దీంతో ఆయ‌న ద్వితీయ విఘ్నం లేకుండా అధికార పీఠం రెండో సారి కూడా ఎక్కగ‌లిగారని చెబుతారు.

అయితే 2009, సెప్టంబ‌ర్ 2న పావురాల గుట్టలో ఆయ‌న ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవ‌డంతో.. ఆయ‌న శ‌కం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో మొద‌లైన ఆరో ఏటే ముగిసిపోయింది. ఒక వేళ వైయ‌స్సే బ‌తికి ఉంటే.. తెలంగాణ వ‌చ్చి ఉండేది కాదేమో. ఈ మాట స్వయంగా కేసీఆరే అనేవారు.
అలా వైయ‌స్ తాను చ‌నిపోయే నాటికి సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా జ‌నం గుండెల్లో గుర్తుండి పోవ‌డం.. ఆపై కొంద‌రు ఆయ‌న మ‌ర‌ణ వార్త విని త‌ట్టుకోలేక చ‌నిపోయార‌న్న పేరు రావ‌డం. ఆపై వారిని ఓదార్చడానికంటూ జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టడంతో ఆయ‌న త‌ర్వాతి త‌రం విభ‌జిత ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేయ‌డం మొద‌లైంది.

ఏది ఏమైనా వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ, ఫీజురీఎంబర్స్ మెంట్ వంటి వాటితో పాటు జ‌ల‌య‌జ్ఞం లాంటి ప‌థ‌కాల‌తో జ‌నానికైతే ఇంకా గుర్తే. ఆయ‌న మ‌ర‌ణించి నేటికి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆయ‌న కొంద‌రి విష‌యంలో మ‌హానేత. ఈ విష‌యం మ‌న‌మెవ‌రం కొట్టిపారేయ‌లేం.