English | Telugu
బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం
Updated : Jan 2, 2026
ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.