English | Telugu

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్.. ఆ తరువాత సభ నుంచి బయటకు వెళ్లి పోయారు.

అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.

తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు. అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా.. పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె.. రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.

కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు. కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు. ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.