English | Telugu

రక్షా బంధన్ రోజున వంగలపూడి అనిత ఏం చేశారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత రక్షా బంధన్ ను వినూత్నంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి రోజున ఆమె విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. శనివారం (ఆగస్టు 9) ఉదయం ఆమె తన నివాసం వద్ద విధి నిర్వహణలో ఉన్న గార్డులకు ముందుగా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు.

ఆ తర్వాత ఎం.వి.పి నుండి ఉషోదయ జంక్షన్ వరకు ర్యాపిడో ద్వారా ఆటో బుక్ చేసుకుని అందులో ప్రయాణించిన హోం మంత్రి అనిత ఆ ఆటో డ్రైవర్ గిరీష్ యోగక్షేమాలు అడిగితెలుసుకుని అతడికి కూడా రాఖీ కట్టారు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి తన ఆటోలో ప్రయాణించి తనకు రాఖీ కట్టడంతో గిరీష్ షాక్ కు గురయ్యారు. అనంతరం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఆ తరువాత హోంమంత్రి నేరగా అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి ఆయనకు కూడా రాఖీ కట్టారు. కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అతని కుటుంబ సభ్యులలో ధైర్యం నింపారు.

అనంతరం విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీలకు రాఖీలు కట్టారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె సెంటర్ జైలుకు వెళ్లి రిమాండ్ లో ఉన్న పలువురు ఖైదీలను కలిశారు వారి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఖైదీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు వచ్చే ఏడాది సత్ప్రవర్తనతో జైలు విడిచి కుటుంబ సభ్యులతో రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని ఆశీర్వదించారు.