English | Telugu

కాళేశ్వరం రిపోర్టుపై స్టేకు హైకోర్టు నో .. కేసీఆర్, హరీష్ రావులకు చుక్కెదురు!

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా.. ముందే చర్యలు తీసుకుంటారా అన్నదానిపై క్లారిటీ కావాలని హైకోర్టు గురువారం (ఆగస్టు 21) విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని అడిగింది.

దీనిపై శుక్రవారం (ఆగస్టు 22) న అడ్డకేట్ జనరల్ ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫుర కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలు ఇస్తామని.. సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

జస్టిస్ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని న్యాయ నిపుణులు అంటున్నారు. కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత, ఇప్పుడు ఆ నివేదిక తమకు వ్యతిరేకంగా వచ్చిందని దానికి చట్టబద్ధత లేదని విమర్శించడం సరికాదని అంటున్నారు.