English | Telugu
గవర్నర్ హోదాలో తమిళిసై ఫస్ట్ యాక్షన్... యూనివర్శిటీల్లో పరిస్థితులపై ఫోకస్...
Updated : Oct 5, 2019
టీఆర్ఎస్ కు... కేసీఆర్ కు... చెక్ పెట్టడానికే ఏరికోరి తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా పంపారనే ప్రచారం జరిగినా, ఇప్పటివరకు అలాంటి సిగ్నల్స్ గానీ, యాక్షన్ గానీ రాజ్ భవన్ నుంచి కనిపించలేదు. కానీ, గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణలో పరిస్థితులపై ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చివచ్చారు. ఇక, ఇఫ్పుడు బతుకమ్మ పండగ రావడంతో, ప్రతిరోజూ రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ, మహిళలతో కలిసి ఆడిపాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను వంటబట్టించుకుంటూ, ప్రజల్లో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, గవర్నర్ హోదాలో తన అధికారాలను ఉపయోగిస్తూ, ఫస్ట్ యాక్టివిటీ చేశారు. రాష్ట్రంలో యూనివర్శిటీల స్థితిగతులపై ఫోకస్ చేశారు. వీసీలు, ఉన్నతాధికారులతో సమావేశమై... విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. యూనివర్శిటీల్లో ఖాళీలు, వీసీల నియామకం, ఇతర ఖాళీలు, అమలవుతోన్న కోర్సుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, యూనివర్శిటీల్లో సమస్యలు, విద్యాప్రమాణాలపై చర్చించారు. మూడు గంటలకు పైగా ఈ మీటింగ్ జరిగింది. అయితే, సమస్యలపై వీసీలు, ఉన్నతాధికారులు గవర్నర్ కు వివరించారు. దాంతో, సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. అయితే, ఛాన్సలర్ హోదాలో గవర్నర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే మాట వినిపిస్తోంది.