English | Telugu

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.... సరూర్ నగర్ లో సమరభేరికి అనుమతి...

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే సభ తలపెట్టినట్లు న్యాయస్థానానికి విన్నవించింది. సభను జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు... సభకు ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం సరైన వివరాలు అందించకపోవడంతో... ఆర్టీసీ కార్మికులు ముందుగా నిర్ణయించుకున్న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలిచ్చింది.

హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సభా నిర్వాహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వం దిగి రావాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను చూసి ప్రభుత్వం భయపడుతోందన్న జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి... కార్మికుల పట్ల కేసీఆర్ అనుసరిస్తోన్న కఠిన వైఖరిని సభలో ఎండగడతామని హెచ్చరించారు. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దన్న అశ్వద్ధామరెడ్డి... తమకు అన్నివర్గాలూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.