English | Telugu

ఆర్టీసీ జేఏసీ పై టియర్ గ్యాస్ ను ప్రయోగించిన పోలీసులు...

ఆర్టీసీ జేఏసీ పిలుపు నిచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బారికేడ్ లను దాటుకుని ఆందోళనకారులు ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు దూసుకురావడంతో పోలీసులు వాళ్లను అడ్డుకొని లాఠి చార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆర్టీసీ కార్మికులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వాళ్ల పైకి బాష్పవాయువు ప్రయోగించారు. ఈ పరిణామాలతో సెక్రటేరియట్ లిబర్టీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల లాఠీచార్జీ లో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటపడి మరీ తీవ్రంగా కొట్ట్టడంతో కొందరు కుప్పకూలిపోయారు. ఒళ్లంతా వాతలు తేలి కొందరు, మోహం నుంచి రక్తం కారుతూ మరికొందరు కనిపించారు. గాయపడ్డ వాళ్లను కూడా పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి తరలించారు.

మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు, అఖిల పక్షం నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి హిమాయత్ నగర్ లోని లిబర్టీ వద్ద అదుపు లోకి తీసుకొని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ కు తరలించారు. బైక్ మీద ట్యాంక్ బండ్ దగ్గరకు వెళుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇందిరా పార్కు దగ్గర కోదండరాంను అదుపు లోకి తీసుకున్నారు. బన్సీలాల్ పేటలో వీహెచ్ ను అరెస్టు చేశారు.ఛలో ట్యాంక్ కార్యక్రమం దేనికి దారి తీయబోతోందో వేచి చూడాలి.