English | Telugu
జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్
Updated : Dec 21, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు.
ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి. 2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.
అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.