English | Telugu

విజయారెడ్డి హత్యతో మొదలైన భయం.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించుకున్న ఎమ్మార్వో

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ హత్యతో అధికారుల గుండెల్లో భయం మొదలైంది. అంతేకాదు ఈ హత్య తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కూడా అధికారులను మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళా రైతు.. పాసు పుస్తకాలను ఇవ్వడంలో కొనసాగుతున్న జాప్యంపై సిబ్బందిని గట్టిగా నిలదీశారు. తన వద్ద నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ కొట్టినంత పనిచేసారు. దీంతో, షాక్ కు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక కడప జిల్లాలో తహసీల్దార్‌ చాంబర్‌ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్‌ పోసుకున్న ఘటన కలకలం రేపింది. కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ, పని జరగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే అక్కడున్న సిబ్బంది సమయానికి స్పందించి ఆ రైతుని కాపాడారు.

ఈ వరుస ఘటనలతో రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. తమ మీద ఎప్పుడు ఎవ్వరు దాడి చేస్తారోనన్న భయం వారిలో మొదలైంది. భయంతో బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. అదే భయంతో ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారు ఉమా మహేశ్వరి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తన చాంబర్ లో తను కూర్చునే కుర్చీ ముందు ఓ తాడును కట్టించారు. సిబ్బందిని మాత్రమే తాడు దాటి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. అర్జీలు ఇచ్చే వారు ఎవరైనా తాడుకు అవతల ఉండి మాత్రమే వాటిని అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులైతే.. రెవెన్యూ కార్యాలయాల ముందు భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి వారిలో భయం పోగొట్టి, వారు ప్రశాంతంగా పనిచేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.