English | Telugu

సాహోకి ఇవ్వలేదు... మరి సైరాకి ఎలా ఇచ్చారు... మెగాస్టార్ కోసం కాపు మంత్రుల లాబీయింగ్..!

మెగాస్టార్ చిరంజీవి... సైరా సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులపాటు అదనపు షోలకు అనుమతి వెనుక కాపు మంత్రుల హస్తముందట. అంతేకాదు సైరా సినిమాకి మీడియా పార్టనర్ గా సాక్షి వ్యవహరించడం వెనుకా పెద్ద కథే నడిచిందని చెబుతున్నారు. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా ఫస్ట్ వీక్ లోనే భారీ కలెక్షన్లు రాబట్టాల్సి ఉండటంతో... రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోల కోసం చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది. అయితే, ప్రభాస్ సాహో సినిమాకి అనుమతి ఇవ్వకపోవడంతో... సైరాకి ఇస్తారో లేదోనన్న టెన్షన్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ ను వెంటాడింది. అయితే, భారీ బడ్జెట్ సినిమా కావడం, మొదటి వారంలోనే మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టుకోవాల్సి ఉండటంతో... కాపు మంత్రుల ద్వారా చిత్ర యూనిట్ లాబీయింగ్ చేసిందట. అయితే, రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి ఆందోళనలో పడ్డారు. ఒకవైపు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ తదితరులు.... సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డిల ద్వారా ప్రయత్నించగా, మరోవైపు చిరంజీవి... మంత్రి కన్నబాబుతో మాట్లాడారట. మెగాస్టార్ తో తనకున్న సాన్నిహిత్యం... పీఆర్పీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేను చేశారన్న గౌరవంతో... కన్నబాబే స్వయంగా రంగంలోకి దిగి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారట. అదే సమయంలో మంత్రి బొత్స కూడా ఓ చేయి వేశారని తెలిసింది. మంత్రులు కన్నబాబు, బొత్స కలిసి మాట్లాడటంతో... సైరా అదనపు షోలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెలగపూడి వర్గాలు చెబుతున్నాయి. ఇలా కాపు నేతలంతా చిరంజీవి సైరా సినిమా కోసం పనిగట్టుకుని సీఎంతో చర్చించి, అనుమతి ఇప్పించడంలో సక్సెస్‌ అయ్యారని అంటున్నారు.

అయితే, ఎన్నికల సమయంలో కన్నబాబును తిట్టిన తిట్టకుండా జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం విలీనంపై చిరంజీవిని తప్పుదోవ పట్టించింది కన్నబాబేనని తీవ్ర పదజాలంతో దూషించారు. కాకినాడ వెళ్లి మరీ తిట్ల దండకం అందుకున్నారు. దాంతో మెగా ఫ్యామిలీతో కన్నబాబుకి గ్యాప్ చాలా పెరిగిందని అంతా భావించారు. కానీ చిరంజీవికి మాత్రం, జనసేనానికి ఉన్నంత కోపం, కన్నబాబుపై లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే, మొన్న కన్నబాబు సోదరుడు మరణించడంతో, కన్నబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి ఏకంగా చిరంజీవే కాకినాడ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే, సైరా సినిమా అదనపు షోలకు పర్మిషన్ ఇప్పించడంలో కన్నబాబు కీలక పాత్ర పోషించారట.