English | Telugu
చర్చల కోసం వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ అర్మీ కాల్పులు...
Updated : Oct 18, 2019
బంగ్లాదేశ్ ఆర్మీ కర్కశంగా ప్రవర్తించింది. చర్చల కోసం వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపింది. మత్స్యకారులను విడిపించడానికి వెళ్ళిన వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. మరో కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటన భారత్, బంగ్లా సరిహద్దు లో హీట్ ని పెంచింది. బంగ్లా సరిహద్దులో ఉన్న పద్మా నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను బంగ్లా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. తరువాత వారిలో ఇద్దరిని విడిచిపెట్టారు. మిగిలిన ఒకర్ని విడిపించడానికి బిఎస్ఎఫ్ అధికారులు బంగ్లా సైనికాధికారులతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బంగ్లా సైనికులు భారత జవాన్ లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెనుదిరిగిన బీఎస్ఎఫ్ జవాన్లపై వెనుక నుంచి బంగ్లా సైనికులు కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ ఇక్బాల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోగా మరొక బుల్లెట్ట్ కానిస్టేబుల్ కుడిచేయి నుంచి వెళ్ళింది. వీరిద్దరినీ తోటి జవాన్ లు హాస్పిటల్ కు తరలించగా హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన పరిణామాలపై చర్చించేందుకు బంగ్లా సైనిక ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు. బంగ్లా సైనికులు ఇలా ఎందుకు చేశారో భారత జవాన్ లకు అర్ధం కాలేదు. చర్చలలో ఏం జరగనుందో వేచి చూడాలి.