English | Telugu

ఏటా 10వేలు... ఐదేళ్లలో 50వేలు... ఏపీలో కొత్త పథకం

మరో ఎన్నికల హామీని జగన్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంది. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ఆటో ఓనర్ కమ్‌ డ్రైవర్లకు ఏటా పదివేల రూపాయలిచ్చే వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పాదయాత్రలో ఆటో-ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను చూసి, 2018 మే 14న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాటిచ్చానని గుర్తుచేసుకున్న జగన్... ఇప్పుడు ఇక్కడ్నుంచే వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షా 74వేల మంది ఆటో-ట్యాక్సీ డ్రైవర్లకు 10వేల ఆర్ధికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ నడుపుకుంటూ జీవిస్తోన్న పేదలకు ఆర్ధిక భద్రత కల్పించడం కోసమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌కు ఏటా పదివేలు అందజేస్తామన్న సీఎం జగన్... ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే, అక్టోబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉండి, కుటుంబ సభ్యుల పేరుతో ఆటో ఉంటే చాలని, వైట్ రేషన్‌కార్డులకైతే నేరుగా పథకం వర్తించేలా ఆదేశాలిచ్చామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.