English | Telugu
ట్రంప్ ఇండియా టూర్ రద్దు.. మోడీ చైనా పర్యటన ఎఫెక్టేనా?
Updated : Aug 31, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ లో జరపాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది చివరిలో ఇండియాలో జగరనున్న క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన దానిని రద్దు చేసుకున్నారు. భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్.. ప్రతిగా ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన నేపథ్యంలో ట్రంప్ టూర్ రద్దు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు ఆపరేషన్ సిందూర్ తరువాత నుంచి భారత్ - అమెరికాల మధ్య సంబంధాలు ఒకింత చెడ్డాయనే చెప్పాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెప్పుకుంటూ తనకు తానే శెహభాష్ అంటూ భుజ కీర్తులు తగిలించేసుకుంటున్న ట్రంప్ కు పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం ప్రమేయం ఇసుమంతైనా లేదనీ, పాక్ బతిమలాడుకుని కాళ్ల బేరానికి రావడం వల్లనే సీజ్ ఫైర్ కు అంగీకరించామనీ భారత్ కుండబద్దలు కొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ అభ్యంతరాలను ఇండియా ఇసుమంతైనా ఖాతరు చేయకపోవడంతో కంగుతిన్న అమెరికా అధ్యక్షుడు భారత్ పై అదనపు సుంకాలు విధించారు. దీనిని కూడా లేక్క చేయని ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో తగ్గేదే లే అని చేతల ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీతో చర్చించేందకు ట్రంప్ పలు మార్లు ఫోన్ చేశారనీ, అయితే ఆ ఫోన్ కాల్స్ కు మోడీ స్పందించలేదనీ వార్తలు వినవచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ట్రంప్ తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.