English | Telugu

ప్రియురాలి కోసం వెళ్లాడా? లేక రా ఏజెంటా? పాక్ మీడియా ఉగ్రవాద ముద్ర ఎందుకేస్తోంది?

పాకిస్తాన్‌ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ను క్షేమంగా భారత్‌ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత యువకుల అరెస్ట్‌పై వివరాలు ఇవ్వాలని ఇప్పటికే పాకిస్తాన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ.... పాక్‌ సమాధానం తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పాస్ పోర్ట్‌, వీసా లేకుండా తమ భూభాగంలోకి ప్రవేశించారంటూ ప్రశాంత్‌ను పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రశాంత్‌తోపాటు మధ్యప్రదేశ్ వాసి వారిలాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి...జైలుకు తరలించారు. ప్రశాంత్‌పై పాక్ చట్టం 334/4 కింద అభియోగాలు నమోదు చేశారు. అలాగే, విశాఖ గాజువాకలో ప్రశాంత్ అదృశ్యమైనట్లు పాకిస్తాన్ తన ఎఫ్‌ఐఆర్‌తో పేర్కొంది. అయితే, ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసిన పాకిస్తాన్ మీడియా... ఉగ్రకోణంలో కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రశాంత్ సాఫ్ట్ వేర్ కావడంతో.... అధునాతన పద్ధతిలో ఉగ్రదాడి చేయడానికి పాక్‌‌లోకి పంపారంటూ అనుమానాలను వ్యక్తంచేస్తోంది.

అయితే, ప్రశాంత్... అసలు పాకిస్తాన్ బోర్డర్‌ దగ్గరకు ఎందుకు వెళ్లాడో తెలియదంటున్నారు తండ్రి బాబూరావు. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సహ ఉద్యోగి స్వప్నికతో ప్రేమలో పడ్డాడని, ఆమె కోసం కుటుంబంతో విభేదించి వెళ్లిపోయాడని తెలిపారు. అయితే, ప్రశాంత్ రెండేళ్ల నుంచి కనిపించడం లేదంటోన్న బాబూరావు.... గతంలో చైనా, ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చాడని తెలిపారు. ఇక, ప్రశాంత్ అదృశ్యమైనట్లు 2017లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు.

అయితే, ప్రశాంత్ ...ఎందుకు సరిహద్దులు దాటి వెళ్లాడు? నిజంగానే పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాక్‌లో ప్రవేశించాడా? ఒకవేళ వెళ్తే ఎందుకెళ్లాడు? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. తన ప్రియురాలిని వెతుక్కుంటూ వెళ్లాడని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ వదంతులు చెలరేగాయి. మరి, ప్రశాంత్ ఇష్యూ... భారత్‌-పాక్ మధ్య మరో దౌత్య వివాదంగా మారుతుందో? లేక విడిచిపెడుతుందో చూడాలి. అయితే, ఉగ్రదాడుల కోసమే పాకిస్తాన్లోకి ప్రవేశించారంటూ పాక్ మీడియా కథనాలు ప్రసారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.