English | Telugu
రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి రాచమర్యాదలు.. ఒకే రోజు రెండు ములాఖత్ లు!
Updated : Aug 6, 2025
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అంటే జగన్ హయాంలో నారా చంద్రబాబునాయుడిని వైసీపీ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు మగ్గేలా చేశారు. అప్పట్లో అధికారులు ఆయన్ని ఎన్నో ముప్పతిప్పలు పెట్టారు. అప్పట్లో రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో వైసీపీ రాజ్యాంగం నడిచిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పరిస్థితులు ఏమీ మారలేదనీ, ఇప్పుడు కూడా ఆ జైలులోనూ, బయనా కూడా వైసీపీ రాజ్యాంగమే నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ములాఖత్‌లకే ముప్పుతిప్పలు పెట్టారు. జైలు పరిసరాల్లోకి టీడీపీ నేతలను అనుమతించనేలేదు. మరిప్పుడో.. మద్యం స్కాంలో ఏ-4 నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి రాజమహేందరవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు సెంట్రల్ జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు.
అడిగింది లేదనకుండా.. కోరింది కాదనకుండా సెల్యూ ట్ చేసి మరీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడికి రోజుకు ఒకసారి ములాఖత్ అంటేనే కష్టం. కానీ మిథున్‌రెడ్డికి మాత్రం రోజుకు రెండు సార్లు ములాఖత్ లకు అవకాశం ఇస్తున్నారు.
అంతేకాదు.. సెంట్రల్ జైలు ప్రధాన గేటు ఎదుట వైసీపీ నాయకులు, శ్రేణులు గుంపులు గుంపులుగా గుమిగూడి.. హంగామా చేస్తు న్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. మిథున్‌రెడ్డిని మంగళవారం (ఆగస్టు 5) ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్‌లో కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా ఉన్నారు. సాధారణంగా ములాఖత్‌కు ముగ్గురికే అనుమతి ఉంది. ప్రధాన గేటు గుండా పెద్దిరెడ్డి, తలశిల, రాజా కలిసి సెంట్రల్ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకూ వెళ్లారు. వారిని నల్లకోటు లేని న్యాయవాది హుస్సేన్ కూడా అనుసరించారు. ఆయన్ను పోలీసులు గానీ, సెంట్రల్ జైలు అధికారులు గానీ ఆపలేదు.
తర్వాత పెద్దిరెడ్డి, తలశిల కలిసి ముందుగా మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. వారు వచ్చేసిన తర్వాత జక్కంపూడి రాజా ప్రత్యేకంగా మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఆయనతో హుస్సేన్ కూడా వెళ్లారు. వారు వచ్చేవరకూ పెద్దిరెడ్డి, తలశిల జైలు ప్రధాన ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. మిథున్‌రెడ్డికి రోజుకు ఒకే ములాఖత్‌కు అనుమతి ఉండగా.. జైలు అధికారులు రెండింటికి ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది.