English | Telugu
చైతూ సినిమాకి యువన్ బాణీలు!?
Updated : Apr 6, 2022
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో నాగచైతన్య ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో `లాల్ సింగ్ చద్ధా` (హిందీ), `థాంక్ యూ` చిత్రాలున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. అలాగే విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో `దూత` అనే వెబ్ - సిరీస్ కూడా చేస్తున్నాడు చైతూ.
ఇదిలా ఉంటే, కోలీవుడ్ కెప్టెన్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో నాగచైతన్య ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నట్లు ఈ రోజు (ఏప్రిల్ 6) అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. కాగా, ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా బాణీలు అందించబోతున్నట్లు సమాచారం. అదే గనుక నిజమైతే.. చైతూ, యువన్ కాంబోలో వచ్చే ఫస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నది. కాగా, గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు యువన్ స్వరాలు సమకూర్చారు.
ఇక తెలుగులో `శేషు`, `హ్యాపీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`, `ఓయ్`, `పంజా`, `గోవిందుడు అందరివాడేలే`తో పాటు మరికొన్ని సినిమాలకు యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు. టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన `ఆక్సిజన్` కోసం చివరిసారిగా ట్యూన్స్ కట్టారు యువన్. మరి.. ఐదేళ్ళ విరామం తరువాత తెలుగునాట యువన్ చేయబోతున్న ఈ సినిమా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.