English | Telugu
గోపీచంద్ తల్లిగా విజయశాంతి?
Updated : Aug 30, 2021
`సరిలేరు నీకెవ్వరు`(2020)తో రి-ఎంట్రీ బాట పట్టారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో అభినయానికి ఆస్కారమున్న పాత్రలో అలరించారామె. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కనిపించనున్నారట విజయశాంతి.
ఆ వివరాల్లోకి వెళితే.. `లక్ష్యం`, `లౌక్యం` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మ్యాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీకి సంబంధించి ఓ ముఖ్య పాత్ర కోసం విజయశాంతితో సంప్రదింపులు జరిపారట శ్రీవాస్. కథ, తన పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట విజయశాంతి. అంతేకాదు.. గోపీచంద్ తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని బజ్. త్వరలోనే గోపీచంద్, శ్రీవాస్ కాంబో మూవీలో విజయశాంతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా గోపీచంద్ తండ్రి, ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ రూపొందించిన సినిమాలతోనే విజయశాంతి నటిగా గుర్తింపు పొందారు. `నేటి భారతం`, `దేవాలయం`, `వందేమాతరం`, `ప్రతిఘటన`, `రేపటి పౌరులు` వంటి చిత్రాల కోసం టి.కృష్ణ దర్శకత్వంలో నటించారు విజయశాంతి. ఆ నేపథ్యంతోనే.. గోపీచంద్ సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించారని వినికిడి.