English | Telugu

'ఎన్టీఆర్ 30'.. లేడీ సూప‌ర్ స్టార్ స్పెష‌ల్ రోల్?

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంతో తెలుగునాట‌ రి-ఎంట్రీ ఇచ్చారు లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి. ఎప్ప‌టిలాగే త‌న అభిన‌యంతో అభిమానుల‌ను అల‌రించారు. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం మ‌రో క్రేజీ ప్రాజెక్టులో ఆమె న‌టించ‌బోతున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఓ పాన్ - ఇండియా మూవీని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే 'ఎన్టీఆర్ 30' (వ‌ర్కింగ్ టైటిల్)లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్పెష‌ల్ రోల్ ఉంద‌ట‌. ఆ పాత్ర‌లో విజ‌య‌శాంతి అయితేనే బాగుంటుంద‌ని కొర‌టాల అండ్ టీమ్ భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

'జ‌న‌తా గ్యారేజ్' (2016) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత తార‌క్ - కొర‌టాల కాంబినేష‌న్‌లో రానున్న ఈ చిత్రాన్ని యువ‌సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. 2022 ఏప్రిల్ 29న 'ఎన్టీఆర్ 30' తెర‌పైకి రానున్న‌ది.