English | Telugu

'పుష్ప' నుంచి సేతుప‌తి త‌ప్పుకున్నాడు!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' మూవీని రూపొందిస్తున్నాడు. ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ క్యారెక్ట‌ర్ కోసం విజ‌య్ సేతుప‌తిని తీసుకున్నాడు సుక్కు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న ఈ సినిమాలో ట్ర‌క్ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్‌ను బ‌న్నీ చేస్తుండ‌గా, అత‌నిని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించే నెగ‌టివ్ క్యారెక్ట‌ర్‌ను సేతుప‌తి చేయాల్సి ఉంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఇప్పుడు 'పుష్ప' నుంచి సేతుప‌తి త‌ప్పుకున్నాడు. అలా అని కోలీవుడ్ కోడై కూస్తోంది. కారణం సుక్కు, సేతుప‌తి మ‌ధ్య త‌లెత్తిన వివాద‌మేనంటున్నారు. సేతుప‌తిని విల‌న్ క్యారెక్ట‌ర్ కోసం సంప్ర‌దించిన‌ప్పుడు అత‌డికి 'పుష్ప' పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ అని తెలీదంట‌. ఆ విష‌యం అత‌నికి డైరెక్ట‌ర్ కానీ, ప్రొడ్యూస‌ర్స్ కానీ చెప్ప‌లేదు.

కానీ త‌ర్వాత ఈ మూవీని పాన్ ఇండియ‌న్ ఫిల్మ్‌గా త‌యారు చేస్తున్న‌ట్లు ఐదు భాష‌ల్లో బ‌న్నీ లుక్‌ను రిలీజ్ చేసిన‌ప్పుడే అత‌నికి తెలిసింద‌ని స‌మాచారం. దాంతో త‌మిళ వెర్ష‌న్‌లో విల‌న్‌గా క‌నిపించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని సుక్కుతో సేతుప‌తి చెప్పేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణం.. విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్‌ 'మాస్ట‌ర్‌'లో విల‌న్‌గా న‌టించిన సేతుప‌తి వెంట‌నే మ‌రో సినిమాలో విల‌న్‌గా క‌నిపించాల‌ని అనుకోవ‌ట్లేదు. హీరోగా అత‌నికి చాలా ఆఫ‌ర్లు ఉన్నాయి. అందుక‌ని త‌మిళం మిన‌హా మిగ‌తా భాష‌ల్లో విల‌న్‌గా క‌నిపించ‌డానికి అభ్యంత‌రం లేద‌నీ, త‌మిళ వెర్ష‌న్‌కు మాత్రం వేరే న‌టుడ్ని తీసుకొమ్మ‌ని సుక్కుకు సేతుప‌తి సూచించాడ‌ని వినిపిస్తోంది. అలా చేయ‌డం వీలు కాక‌పోతే సినిమా నుంచి త‌ప్పుకుంటాన‌ని అత‌ను తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. దాంతో చేసేదేమీ లేక‌, సేతుప‌తి స్థానంలో మ‌రో స్టార్ యాక్ట‌ర్ కోసం సుక్కు అన్వేషిస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే దీనిపై మ‌రింత స‌మాచారం వెల్ల‌డి కానున్న‌ది.