English | Telugu

అనుష్క‌కు ప్ర‌భాస్ వీడియో కాల్స్‌!

లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో కావాల్సినంత తీరిక ల‌భించ‌డంతో స్నేహితుల‌తో వీడియా కాల్స్ చేసి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఆ స్నేహితుల్లో అనుష్క కూడా ఉంద‌నేది ఆస‌క్తిక‌ర అంశం. 21 రోజుల లాక్‌డౌన్‌తో సినిమాల షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్‌ సాధ్య‌మైనంత ఎక్కువ సేపు నిద్ర‌లో గ‌డిపేస్తున్నాడంట. ఇంత‌కాలం నిర్విరామంగా ప‌నిచేస్తూ రావ‌డంతో స‌రిగా నిద్ర‌కూడా పోలేక‌పోయాడు. 'సాహో' టైమ్‌లో అయితే మ‌రీ. అందుకే లాక్‌డౌన్‌లో అత‌డి తొలి ప్రాధాన్యం నిద్రే. మెల‌కువగా ఉన్న స‌మ‌యంలో త‌న స‌న్నిహిత స్నేహితులైన రానా, అనుష్క‌తో వీడియో కాన్ఫ‌రెన్సులు పెట్టి మ‌రీ మాట్లాడుతున్నాడ‌ని అత‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్ద‌రూ కాకుండా ప్ర‌భాస్ ఫోన్‌లో ఎక్కువ సేపు గ‌డుపుతోంది రాజ‌మౌళితోటే. ప్ర‌భాస్ జీవితంలో అనుష్క‌కు ప్రత్యేక స్థానం ఉంద‌ని అంద‌రూ న‌మ్మే విష‌యం. వాళ్ల మ‌ధ్య స్నేహాన్ని మించిన బంధం ఉంద‌ని ఇటీవ‌ల "ప్ర‌భాస్ నాకు కొడుకు" అని చెప్ప‌డం ద్వారా తేల్చేసింది అనుష్క‌.

కాగా దేశంలో లాక్‌డౌన్ విధించ‌డానికి కొద్ది రోజుల ముందే జార్జియా నుంచి ప్ర‌భాస్ ఇండియాకు వ‌చ్చాడు. అక్క‌డ త‌న 20వ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఫారిన్ నుంచి విమానాల‌పై ఆంక్ష‌లు మొద‌ల‌వ‌డంతో అక్క‌డి షెడ్యూల్‌ను అర్ధంత‌రంగా ఆపేసి యూనిట్ వ‌చ్చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా టైటిల్ కానీ, ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ కానీ వెల్ల‌డి కాక‌పోవ‌డంతో నిర్మాత‌ల‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హంతో ఉన్నారు.