English | Telugu

వెంక‌టేశ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ?

ఇప్పుడంతా వెబ్ - సిరీస్ ట్రెండ్ న‌డుస్తోంది. అగ్ర తార‌లు సైతం డిజిట‌ల్ డెబ్యూ ఇచ్చేందుకు ఆస‌క్తిచూపిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా చేరనున్నారు. త్వ‌ర‌లో వెంకీ.. దిగ్గ‌జ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ - బేస్డ్ ప్రాజెక్ట్ చేయ‌నున్నార‌ట‌. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ ని 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం', 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌' చిత్రాల ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఆరంభంలో వెంక‌టేశ్ మ‌హా ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించ‌నున్న వెబ్ - బేస్డ్ ప్రాజెక్ట్ షురూ కానుంద‌ని టాక్.

కాగా, ప్ర‌స్తుతం వెంకీ చేతిలో 'దృశ్యం 2', 'నార‌ప్ప‌', 'ఎఫ్ 3' చిత్రాలున్నాయి. ఇప్ప‌టికే 'దృశ్యం 2', 'నారప్ప‌' సినిమాల తాలూకు త‌న షూటింగ్ పార్ట్ ని పూర్తిచేశారు ఈ ద‌గ్గుబాటి వారి హ్యాండ్స‌మ్ హీరో. ఇక 'ఎఫ్ 3' పూర్తిచేయాల్సింది. అలాగే మాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'డ్రైవింగ్ లైసెన్స్' తాలూకు రీమేక్ లో సైతం న‌టించేందుకు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. ఇక వెంక‌టేశ్ మ‌హా విష‌యానికి వ‌స్తే.. సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ తో 'మ‌ర్మాణువు' అనే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.