English | Telugu

వెంకీ బాలీవుడ్ మ‌ల్టిస్టార‌ర్!

తెలుగునాట మ‌ల్టిస్టార‌ర్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేశ్ ఒక‌రు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `మ‌సాలా`, `గోపాల గోపాల‌`, `ఎఫ్ 2`, `వెంకిమామ‌`.. ఇలా ఇటీవ‌ల కాలంలో ప‌లు మ‌ల్టిస్టార‌ర్స్ లో సంద‌డి చేశారు వెంకీ. ఇక ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` కూడా మ‌ల్టిస్టార‌ర్ నే. అంతేకాదు.. త‌న అన్న త‌న‌యుడు ద‌గ్గుబాటి రానాతో క‌లిసి న‌టిస్తున్న వెబ్ - సిరీస్ `రానా నాయుడు` కూడా ఈ త‌ర‌హా ప్రాజెక్ట్ నే.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో వెంకీ ఓ బాలీవుడ్ మూవీ చేయ‌బోతున్నార‌ట‌. `అనారి`, `త‌క్ దీర్ వాలా` త‌రువాత సుదీర్ఘ విరామం అనంత‌రం వెంక‌టేశ్ చేయ‌నున్న ఈ హిందీ సినిమా కూడా మ‌ల్టిస్టార‌ర్ వెంచ‌ర్ అని బ‌జ్. ఇందులో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో వెంకీ జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట‌. యాక్ష‌న్ - కామెడీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని సాజిద్ న‌డియాడ్ వాలా నిర్మించ‌నుండ‌గా.. ఫ‌ర్హాద్ సామ్జి డైరెక్ట్ చేయ‌నున్నార‌ట‌. తెలుగులోనూ ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, తాజాగా వెంకీతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌ల్మాన్ చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.