English | Telugu

అజ్ఞాతవాసి ఆడియో లాంఛ్‌లో సర్‌ప్రైజ్ ఏంటీ..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. పవన్ సినిమా అంటే అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి.. దీనిని మరింత పెంచేందుకు పోస్టర్స్, లిరికల్ వీడియోలను విడుదల చేసి.. దానిని మరింత పెంచుతోంది చిత్రయూనిట్. తాజాగా రెండు పాటలతో అజ్ఞాతవాసి అలరించగా.. ఈ నెల 19న ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లుగా హారికా హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. దీనిలో భాగంగా హైటెక్స్‌లో అజ్ఞాతవాసి పాటల పండుగకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ వేడుకలో ఒక సర్‌ప్రైజ్ ఉందంటున్నాయి చిత్ర వర్గాలు.

ఎందుకంటే ఈ మూవీ పవర్‌స్టార్ కెరీర్‌లో 25వది. అభిమానులకు గుర్తుండిపోయే విధంగా దీనిని సెలబ్రెట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.. అందుకే ఆడియో లాంఛ్‌లో సర్‌ప్రైజ్ అన్న మాట బయటకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సర్‌ప్రైజ్ ఏంటా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అదేమిటి అనే దానిపై ఫ్యాన్స్ పలు వాదనలు వినిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్నో మెగా ఈవెంట్లు జరిగినప్పటికీ అన్నదమ్ములిద్దరూ వేదికను పంచుకుంది లేదు. దానికి తోడు విశాఖ పర్యటనలో చిరంజీవికి అనుకూలంగా మాట్లాడాడు పవర్‌స్టార్. దీంతో చిరు తప్పకుండా అజ్ఞాతవాసి ఆడియోకు వస్తాడంటున్నారు..

అలాగే పవన్ సినిమా వేడుకల్లో మెగా హీరోలు కనిపించి చాలా కాలమైంది. ఒకవేళ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవుతుందా.. విక్టరీ వెంకటేశ్ ఈ మూవీలో గెస్ట్‌రోల్ పోషించాడట.. ఆయనకు ఏమైనా ఛాన్స్ ఇచ్చారా. ఇక మరో వాదన ప్రకారం.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీకి కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడంలో పవన్ కీ-రోల్ పోషించాడని ఇండస్ట్రీ టాక్. కళ్యాణ్ మాట మీదకే త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో సై అన్నాడట. అంతేకాదు.. ముహూర్తపు షాట్‌కు చీఫ్ గెస్ట్‌గా అటెండై జూనియర్‌కి విషెస్ చెప్పాడు. ఇప్పుడు దానికి కృతజ్ఞతగా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్‌కి యంగ్‌టైగర్ హాజరవుతాడా..? ఇలా సవాలక్ష సందేహాలు అభిమానుల మెదళ్లను తొలిచేశాయి. ఇవేవి కాకుండా మరేదైనా సీక్రెట్‌గా ప్లాన్ చేశారేమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు క్రిటిక్స్.